ఆర్థిక స్థిరత్వం, వృద్ధిపై కేంద్రం తీరు
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ కథనాలు
అంకెల గారడీతో జీడీపీ మెరుగు…
ప్రజల జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించని వైనం
ఇది మోడీ సర్కారు ఆర్థిక విధానాల వైఫల్యం
బడ్జెట్‌లో ఉపాధి, కుటుంబాల ఆదాయం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
కేటాయింపులు మరింతగా పెంచాలి: ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్రం బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ సమయంలో వినిపిస్తున్న ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అంటూ ప్రభుత్వం వినిపిస్తున్న కథనాలు వాస్తవ పరిస్థితులతో పొంతన లేకుండా ఉన్నాయి. అవి ప్రజల దైనందిన జీవితాల్లో కనిపించడం లేవు. నిరుద్యోగం, అసంఘటిత రంగంలో ఉద్యోగాల అస్థిరత, సామాజిక రంగాలపై ఖర్చులలో తగ్గుదల వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మోడీ సర్కారు మాత్రం జీడీపీ మెరుగుదలను చూపెడుతూ అంతా సవ్యంగానే ఉన్నదనే ప్రచారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నది. దీనిని ఆర్థిక నిపుణులు, మేధావులు తప్పుబడుతున్నారు. ఈ సారి బడ్జెట్‌లో జీడీపీ గణాంకాలకే పరిమితం కాకుండా.. ఉపాధి సృష్టి, కుటుంబ ఆదాయాల పునరుద్ధరణ, ప్రజా సేవల బలోపేతం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని వారు చెప్తున్నారు.
పెట్టుబడులు, వాణిజ్య ఒత్తిళ్లు
దేశీయ వినియోగం పెరగాలంటే స్థిరమైన ఆదాయ వనరులు అవసరం. అందుకోసం గృహ పొదుపులు, పెట్టుబడులు పెరగాలి. పన్ను విధానంలో సరళత, పారదర్శకత, సమానత్వం తప్పనిసరి. అమెరికా విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పాదకత, పోటీ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇక విదేశీ పెట్టుబడులు వేగంగా బయటకు వెళ్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలకు ఆందోళనకరమైన విషయం. గతేడాది సెప్టెంబర్‌లో 1.66 బిలియన్ డాలర్ల మేర నికర మూల ధనం బయటకు వెళ్లగా.. అది అక్టోబర్‌లో 1.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, ఎగుమతులు తగ్గడం విదేశీ మారక ద్రవ్య స్థిరత్వం విషయంలో ముప్పుగా మారాయి.
ఉపాధి లేకుండా వృద్ధి ఒక నిర్మాణాత్మక వైఫల్యం
భారత్‌లో ఇటీవల ఆర్థిక వృద్ధి.. విస్తృత ఉపాధి సృష్టిగా మారడం లేదు. జీడీపీ వృద్ధి, స్టాక్ మార్కెట్ లాభాలు ప్రధానంగా సంఘటిత రంగం పనితీరునే చూపిస్తాయి. కానీ దేశంలో దాదాపు 90 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు. నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీ అమలు, కోవిడ్ మహమ్మారి, ఆర్థిక రంగం ఒత్తిళ్లు… ఇవన్నీ చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు, కూలీల జీవనాధారాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. ప్రభుత్వ విధానాలు ఎక్కువగా మూలధనాధారిత (క్యాపిటల్-ఇంటెన్సివ్) రంగాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉపాధి సృష్టి కేంద్ర బిందువుగా మారలేదని నిపుణులు చెప్తున్నారు.
రాష్ట్రాల ఆర్థికం, సంక్షేమం, క్రమశిక్షణ
రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వం బడ్జెట్‌లో ప్రధాన అంశంగా ఉండాలి. సంక్షేమ పథకాలు మెరుగైన లక్ష్య సాధనతో అమలవ్వాలి. ఎన్నికల సమయంలో నగదు బదిలీ వంటివి తాత్కాలిక ప్రయోజనాలకే పరిమితమవుతున్నాయని తీవ్ర విమర్శలున్నాయి. దీనికి బదులు.. సామాజిక మౌలిక వసతులపై మూలధన వ్యయం, పట్టణ ఉపాధి హామీ పథకం, విద్య, పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు అత్యవసరం.
విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలు నిర్లక్ష్యం
దేశంలో విద్యావంతుల నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న యువత సామాజిక, ఆర్థిక అస్థిరతకు గురవుతున్నది. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రయివేటు రంగం ఆధిపత్యం వల్ల సేవలు ఖరీదైపోతున్నాయి. కాబట్టి.. విద్యపై ఖర్చు జీడీపీలో ఆరు శాతానికి పెంచాలి. ఆరోగ్యంపై వ్యయం జీడీపీలో మూడు శాతానికి పెంచాలి. ప్రస్తుతం విద్యపై ఖర్చు దేశ జీడీపీలో మూడు శాతంగా ఉండగా… ఆరోగ్యంపై రెండు శాతమే ఉన్నది.
బడ్జెట్.. అందరి స్వరం వినిపించాలి
మోడీ ప్రభుత్వం వికసిత్ భారత్ నినాదాన్ని వినిపిస్తున్నది. ఇందుకు 2047ను లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అయితే దేశంలోని రాష్ట్రాల పాత్రను మాత్రం విస్మరిస్తున్నది. వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే… మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి, వ్యవసాయం – పరిశ్రమలు-సేవల మధ్య సమన్వయ విధాన రూపకల్పన అవసరమని నిపుణులు చెప్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. సంప్రదింపులు కూడా క్షేత్రస్థాయిలో జరగాలి. కేవలం కార్పొరేట్లు, కన్సల్టెన్సీలు, బడా పారిశ్రామికవేత్తలనే కాకుండా పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఆర్థిక నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
సంఘటిత అసంఘటిత విభజన.. విధాన లోపాలు
కొన్ని ఆర్థిక గణాంకాలు అసంఘటిత కార్మికులను గణాంకాల్లోనూ, రాజకీయాల్లోనూ కనిపించనివారిగా మారుస్తున్నాయి. వ్యవసాయం, రైతులపై విధానపరమైన దృష్టి తగ్గుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) వంటి కార్యక్రమాల నుంచి దూరమై, తాత్కాలిక గ్రామీణ ఉపాధి పథకాల వైపు మళ్లడం వంటి పరిస్థితులను చూస్తే ప్రభుత్వం ఉపాధి కల్పన విషయంలో వెనక్కి తగ్గినట్టు అర్థమవుతున్నది. ఇక టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ-కామర్స్ విస్తరణ చిన్న వ్యాపారులను తీవ్రంగా నష్టపరుస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల అస్థిరత మరింత పెరుగుతోంది.



