– బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమనీ, ప్రజల మౌలిక హక్కులపై నేరుగా దాడి చేయడమే అవుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడమే అవుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి ప్రజల బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని చెప్పారు. ట్రాఫిక్ చలాన్ అనేది నేర నిర్ధారణ కాదనీ, అది కేవలం ఒక ఆరోపణ మాత్రమేనని అన్నారు. చలాన్ వచ్చిన ప్రతి పౌరుడికీ వివరణ ఇచ్చే హక్కు, అప్పీల్ చేసుకునే హక్కు, కోర్టును ఆశ్రయించే హక్కు ఉన్నాయని వివరించారు. ఆటోడెబిట్ విధానం ఈ హక్కులన్నింటినీ హరిస్తూ, నేరం రుజువు కాకముందే శిక్ష విధించినట్టుగా మారుతుందని అన్నారు. బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాదారుడి స్పష్టమైన అనుమతి లేదా కోర్టు ఆదేశం లేకుండా బ్యాంకు ఖాతా నుంచి డబ్బును తీసుకోవడం అక్రమమని చెప్పారు. బ్యాంకింగ్ రంగం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదని అన్నారు. ఈ విధానం అమలైతే, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. ఆటోడెబిట్ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య, చట్టబద్ధమైన విధానాలను మాత్రమే అనుసరించాలనీ, ప్రజల మౌలిక హక్కులు, గోప్యత, ఆస్తి హక్కులను గౌరవించాలని కోరారు.
చలాన్ల ఆటోడెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



