సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాసరావు
ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేస్తే ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది
సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి
సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని సకాలంలో అందజేయాలి
సమాచార కమిషనర్ వైష్ణవి మెర్ల
నవతెలంగాణ – వనపర్తి
ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి, పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం-2005పై పిఐఓ లు, ఏపీఐఓ లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి, వైష్ణవి మేర్ల హాజరయ్యారు. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సమాచార కమిషనర్లకు అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పూల మొక్కలను బహుకరించి స్వాగతం పలికారు. అనంతరం వారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో కమిషనర్ పీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి, పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
పౌర సమాజంలో అనేక వ్యక్తుల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సమాచార హక్కు చట్టం అని తెలిపారు. పి ఐ ఓ లు, ఏపీఐవోలు సమాచార హక్కు చట్టం అంటే తప్పించుకునే ధోరణిని వదిలేసి, ఈ చట్టాన్ని అర్థం చేసుకొని నిర్దిష్టంగా అమలు చేసి దేశంలోనే ఆర్టిఐ దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేలా చేయాలని సూచించారు.
పి ఐ ఓ స్థాయిలో దరఖాస్తులను పరిష్కరిస్తే పై స్థాయికి వచ్చే అవకాశం ఉండదని, తద్వారా పెండింగ్ దరఖాస్తులు ఉండే అవకాశం కూడా ఉండదని చెప్పారు. గత మూడున్నర ఎళ్ళుగా సమాచార కమిషనర్ల నియామకం లేకపోవడంతో చాలా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని ఈ జిల్లాల పర్యటన ద్వారా అందరికీ అవగాహన కల్పించి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పథకాలను సక్రమంగా అమలు చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో సమాచార హక్కు చట్టం పాత్ర కీలకమని తెలిపారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కలుగజేస్తుందని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు, అందులో పి ఐ ఓ, ఏపీఐవో వివరాలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల బాధ్యతలను తెలియజేసే 4(1)(b) తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.
గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో సమాచార కమిషన్ కు కమిషనర్ల నియామకం లేకపోవడంతో 18 వేల అప్పిళ్లు పెండింగ్ లో ఉన్నాయని, జిల్లాల పర్యటన ద్వారా వాటిలో ఇప్పటివరకు 3500 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేస్తే వారికి మీ పట్ల ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు.
వైష్ణవి మెర్ల మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని సకాలంలో అందజేయాల్సిన బాధ్యత పిఐఓల పైన ఉందని గుర్తు చేశారు. మొదటి 30 రోజుల్లో వారికి తప్పనిసరిగా రిప్లై ఇవ్వాలని ఆమె గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ప్రతి సమాచార హక్కు దరఖాస్తును పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులకు సమాచారం ఇవ్వగలిగేలా ఉన్నప్పటికీ కొందరు ఇతరులకు బదిలీ చేస్తున్నారని, అలా అనవసరంగా బదిలీ చేయవద్దని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ సమాచార హక్కు చట్టానికి సంబంధించి వస్తున్న దరఖాస్తులను పరిష్కరించడంలో కమిషనర్లు సూచించిన ప్రకారం అనుసరించి దరఖాస్తులను పిఐఓ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లా శాఖల అధికారులు, పి ఐ ఓ లు ఏపీఐవోలు, తదితరులు పాల్గొన్నారు.