No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఅంతర్జాతీయంట్రంప్‌పై పుతిన్‌ ఎఫెక్ట్‌

ట్రంప్‌పై పుతిన్‌ ఎఫెక్ట్‌

- Advertisement -

– రష్యాకు సానుకూలంగా వాదనలు ఉక్రెయిన్‌, ఈయూ వాదనల్ని పట్టించుకోని వైనం
– ముందుగా కాల్పుల విరమణను కోరిన యూరోపియన్‌ నేతలు
– నేరుగా త్రైపాక్షిక చర్చలేనంటూ ట్రంప్‌ ప్రకటన
– అమెరికా అధ్యక్షుడిపై యూరప్‌ దేశాల సొణుగుడు

అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ జరిపిన చర్చల తర్వాత అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రంప్‌ కూడా రష్యా పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టు సోమవారం శ్వేతసౌధంలో ఉక్రెయిన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో జరిగిన చర్చల్లో తేలిపోయింది. ఆ దేశాల ప్రతినిధులు ఏ ప్రతిపాదన చేసినా, ట్రంప్‌ పట్టించుకోనట్టే వ్యవహరించారు. పుతిన్‌ ప్రతిపాదించినట్టు నేరుగా త్రైపాక్షిక చర్చలకే గ్రీన్‌ సిగల్‌ చెప్పారు. దీనితో యూరోపియన్‌ దేశాలు ట్రంప్‌నకు వ్యతిరేకంగా గళం ఎత్తలేక సణుగుడు మొదలుపెట్టాయి.
వాషింగ్టన్‌ : అమెరికా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌, వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన పలువురు నేతల మధ్య సోమవారం శ్వేతసౌధంలో జరిగిన సమావేశం ఎలాంటి గొప్ప ప్రకటనలు లేకుండానే ముగిసింది. అయితే ఉక్రెయిన్‌ వివాదానికి శుభం కార్డు వేసేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలలో ట్రంప్‌ పెత్తనం చేస్తున్న తీరు ఈయూ దేశాలకు మింగుడు పడటంలేదు. పైగా అన్నింట్లోనూ తనే పైచేయి సాధించడానికి అమెరికా ప్రయత్నిస్తోండటం చర్చనీయాంశంగా మారుతోంది. చర్చల సందర్భంగా నిర్ణయాత్మక ఫలితం ఏదీ వెలువడనప్పటికీ అసలు కథ తెర వెనుక నడుస్తోందని అర్థమవుతోంది. సమావేశం ముగిసిన తర్వాత జరిగిన పాత్రికేయుల సమావేశం సందర్భంగా ట్రంప్‌ అంతా తానై వ్యవహరిండమే దీనికి సంకేతం. చర్చల సమయంలో ఉక్రెయిన్‌, ఈయూ వాదనలను ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. తన మాటే చెల్లుబాటు కావాలన్న పట్టుదల ప్రదర్శించటంతో ఆ దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పుతిన్‌తో ట్రంప్‌ మంతనాలు
ఏదేమైనా శాంతి ఒప్పందం దిశగా వాషింగ్టన్‌లో ఒక ప్రయత్నమైతే జరిగింది. అది ఉక్రెయిన్‌ భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది. యూరప్‌ భద్రతా నిర్మాణంపై కూడా దాని ప్రభావం పడుతుంది.
మరోవైపు రష్యా ఎలాంటి ఆందోళన చెందడం లేదు. జెలెన్‌స్కీ, ఈయూ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత పుతిన్‌తో ట్రంప్‌ 40 నిమిషాల పాటు ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణపై వెలువడిన సమాచారాన్ని పరిశీలిస్తే ట్రంప్‌ ఎలాంటి డిమాండ్లు చేయలేదని, అలాగే పుతిన్‌ కూడా ఎలాంటి రాయితీలు ఇవ్వజూపలేదని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ చర్చల పైనే వారు దృష్టి సారించారు. చర్చల స్థాయిని ‘పెంచడం’ గురించి కూడా మాట్లాడుకున్నారు. కాగా శ్వేతసౌధంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెబుతున్న దాని ప్రకారం పుతిన్‌-జెలెన్‌స్కీ మధ్య రెండు వారాల్లో ప్రత్యక్ష చర్చలు జరుగుతాయి.
ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. రష్యా వైఖరి దృఢంగా ఉంది. వాషింగ్టన్‌ శిఖరాగ్ర సమావేశంలో అద్భుతమైన ఫలితం కన్పించకపోవచ్చు కానీ అది భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుదారుగా కొనసాగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు తన పరపతి తగ్గిపోతోందని ఈయూ గుర్తించింది.

పుతిన్‌-జెలెన్‌స్కీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నా : ట్రంప్‌
రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్‌, జెలెన్‌స్కీ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నానని ట్రంప్‌ ప్రకటించారు. ‘ఉక్రెయిన్‌, ఈయూ నేతలతో సమావేశాన్ని ముగించిన తర్వాత పుతిన్‌తో మాట్లాడాను. పుతిన్‌, జెలెన్‌స్కీ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నాను. వేదికను నిర్ణయించాల్సి ఉంది’ అని ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. ఆ సమావేశం తర్వాత ముగ్గురం కూర్చుని చర్చిస్తామని అంటూ దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని అంతమొందించేందుకు ఇది ఒక మంచి, ముందస్తు చర్య అని వ్యాఖ్యానిం చారు. కాగా ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం ఆగిపోవాలని పుతిన్‌ కోరుకుంటున్నారని, శాంతి స్థాపన కోసం ఆయన అన్ని పక్షాలతో కలిసి పని చేస్తారని ట్రంప్‌ విలేకరులకు తెలిపారు. సమస్య పరిష్కారంలో పురోగతి కన్పిస్తోందని, భద్రతా పరమైన హామీలు ఇవ్వాలని ఉక్రెయిన్‌ కోరుతోందని చెప్పారు.

ట్రంప్‌-పుతిన్‌ భేటీ తర్వాత…
యుద్ధంలో అమెరికా ప్రమేయం ఉండకూడదని రష్యా కోరుకుంటోంది. గత శుక్రవారం అలస్కాలో పుతిన్‌-ట్రంప్‌ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగిన తర్వాత రష్యాపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించలేదు. ఒత్తిడి కూడా పెంచలేదు. తొలుత కాల్పుల విరమణను డిమాండ్‌ చేసిన ట్రంప్‌ ఆ తర్వాత ప్రత్యక్ష శాంతి చర్చలను సమర్ధించారు. ఇది రష్యాకు అనుకూలంగా మారింది. ట్రంప్‌ మధ్యవర్తిత్వాన్ని సమర్ధించ డానికి జెలెన్‌స్కీ, ఈయూ నేతలు వాషింగ్టన్‌ వచ్చారు. ఆంక్షలు, ఆయుధ రవాణా, ఉక్రెయిన్‌కు భద్రత వంటి అంశాలపై ట్రంప్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిం చారు. వారి ఆశలపై ట్రంప్‌ నీళ్లు గుమ్మరించారు. మొదటి నుంచి ఉక్రెయిన్‌, ఈయూను డిఫెన్స్‌లో పడేయాలనే చూశారు. దీంతో తమ ప్రభావం నామమాత్రమే అయిపోతుందనే భయం, ఆందోళన కనిపించింది.

ఎవరి వాదన వారిదే

కొద్ది రోజుల క్రితం పుతిన్‌కు ట్రంప్‌ ఆతిథ్యం ఇచ్చారు. ఈయూ సూచించిన ముందస్తు షరతులను ట్రంప్‌ పట్టించుకోకుండా మరింత సరళమైన దౌత్య మార్గాన్ని చూపారు. ఉక్రెయిన్‌కు భద్రతా సంబంధమైన హామీ చుట్టూనే వ్యవహారమంతా నడిచింది. అయితే ఇది అత్యంత వివాదాస్పదమైన అంశం. ఉక్రెయిన్‌ తటస్థ వైఖరిని అవలంబించి, నిస్సైనికీకరణకు అంగీకరిస్తే అర్థవంతమైన హామీ ఇవ్వవచ్చునని రష్యా అంటోంది. ఉక్రెయిన్‌, ఈయూ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. ఉక్రెయిన్‌ సైన్యాన్ని బలోపేతం చేయాలని, ఉక్రెయిన్‌ గడ్డపై నాటో సైన్యాన్ని మోహరించాలని అవి కోరుతున్నాయి. నాటోలో చేరాలని కూడా ఉక్రెయిన్‌ భావిస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై జరుపుతున్న యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతున్నందున ఈ వాదన వీగిపోతోంది. చర్చల సందర్భంగా ఉక్రెయిన్‌, ఈయూ వాదనలు కాస్త నీరు కారిపోయాయనే టాక్‌ వైట్‌హౌస్‌లో వినిపిస్తోంది.ఈయూ దేశాల ప్రతినిధులంతా వైట్‌హౌస్‌కు వచ్చామనే తృప్తి తప్ప..ఏ విషయంలోనూ మాట్లాడే ఛాన్స్‌ ట్రంప్‌ అస్సలు ఇవ్వకపోవటం గమనార్హం.

త్రైపాక్షిక చర్చలకు సిద్ధమేనన్న జెలెన్‌స్కీ
దౌత్య యత్నాలతో యుద్ధాన్ని ఆపేయాలన్న ఆలోచనకు మద్దతు ఇస్తానని జెలెన్‌స్కీ అన్నారు. త్రైపాక్షిక చర్చలకు తాను సిద్ధమేనని చెప్పారు. కాగా ట్రంప్‌-జెలెన్‌స్కీ చర్చల్లో నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రట్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వన్‌ డర్‌ లెయన్‌, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌, ఇటలీ ప్రధాని మెలోనీ, ఫిన్లాండ్‌ ప్రధాని అలగ్జాండర్‌ స్టబ్‌, జర్మనీ ఛాన్సలర్‌ మెర్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ కూడా పాలుపంచుకున్నారు. కాల్పుల విరమణకు పుతిన్‌ను ఒప్పించాలని వారంతా ట్రంప్‌ను కోరారు. ఉక్రెయిన్‌కు భద్రతా హామీల గురించి
ప్రస్తావించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad