Friday, January 16, 2026
E-PAPER
Homeమానవిప్రశ్నించే చైతన్యం పెరగాలి

ప్రశ్నించే చైతన్యం పెరగాలి

- Advertisement -

డి. ఇందిర – కుగ్రామం నుంచి విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి ఎస్‌ఎఫ్‌ఐలో నాయకురాలయ్యారు. లా పూర్తి చేసి పదేండ్లు అడ్వకేట్‌ గా ప్రాక్టీస్‌ చేశారు. లాయర్స్‌ అసోసియేషన్‌ లో( ఐలు ) రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సమస్యలపై పోరాడారు. సామాన్యులకు చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు బస్తీలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీగా సీనియర్‌ న్యాయవాదులతో కలిసి పని చేశారు. న్యాయవాద వృత్తి ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. మహిళా హక్కుల కోసం కృషి చేస్తున్న ఐద్వాలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయటం ప్రారంభించారు. సుమారు రెండున్నర దశాబ్దాల పాటు హైదరాబాదు నగరంలో ఐద్వా చేపట్టిన అనేక ఉద్యమాలలో పాల్గొంటూనే రాష్ట్ర కేంద్రంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ బాధ్యతల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఈ నెల 25 నుండి 28 వరకు ఐద్వా అఖిల భారత మహాసభలు జరగబోతున్న సందర్భంగా తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

ప్రపంచీకరణ తర్వాత మహిళలు ఇంటా బయట రకరకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాల స్థానంలో న్యూక్లియర్‌ కుటుంబాలు పెరగటం, పిల్లల పెంపకం, ఇంటి పని, బయట పని బాధ్యతలలో మహిళలు మూడు షిఫ్టుల పని భారం పెరిగింది. కుటుంబాలలో పిల్లలనుండి పెద్దల వరకు మాదకద్రవ్యాలు, మత్తు పానీయాలు, బెట్టింగులు, జూదం వంటి అవలక్షణాలు పెరిగాయి. మహిళలపై హింస పెరిగింది. అనేక కుటుంబాలలో కుటుంబ భారం మహిళలపై పడుతుంది. ఇంటిగుట్టు బయటపడుతుందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబం ఆగమవుతుందని, ఆ ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుందని మౌనంగా భరిస్తున్నారు.

అమలు కాని చట్టాలు
ఐద్వా నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాల ఫలితంగా గ్రామీణ స్థాయి నుండి కేంద్రస్థాయి వరకు అనేక చట్టాలు సాధించుకున్నారు. అవి ప్రస్తుతం మనువాద పాలనలో ప్రమాదంలో పడ్డాయి. బాల్య వివాహ నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం నిర్భయ అత్యాచార నిరోధక చట్టం, కుటుంబ ఆస్తిలో సమాన ఆస్తి హక్కు చట్టం వంటివి అమలుకు నోచుకోవడం లేదు. విశాఖ కేసులో సుప్రీంకోర్టు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును చట్టం చేయాలని ఐద్వా దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించింది. దాని ఫలితం 2013లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో, అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దాంతో ఐద్వానే చట్టంపై సదస్సులు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది.

రాజకీయ పలుకుబడితో
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే వర్మ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై అధ్యయనం చేసి సమగ్రమైన రిపోర్టును ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అత్యాచార నిరోధక చట్టంలోని లోపాలను సవరిస్తూ నిర్భయ అత్యాచార నిరోధక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అయినా నేరాలు ఆగలేదు. పైగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వమే వారిని నిర్దోషులుగా తప్పించే చర్యలకు పాల్పడుతోంది ఉన్నవా, బిల్కీస్‌ భాను, రెజర్ల కేసులలో యావర్జీవశిక్ష పడిన దోషులను నిర్దోషులుగా విడుదల చేయించింది.

మహిళా కమిషన్‌ పనితీరు
సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాల కోసం మహిళా కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఐద్వాగా ఒత్తిడి చేశాం. దాని ఫలితంగా జాతీయ మహిళా కమిషన్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఏర్పడ్డాయి. అయితే కమిషన్‌ చైర్మన్‌ నుండి సభ్యుల వరకు అధికార పార్టీ పక్షాన మాత్రమే పనిచేస్తున్నారు. చైర్మన్లు నిష్పాక్షికంగా, సమర్థవంతంగా పనిచేయటంలేదు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుల చర్చే లేదు. యువతను పక్కదారి పట్టిస్తున్న డ్రగ్స్‌, మత్తు పానీయాలు, ఫోర్న్‌ సైట్లు, మహిళలు బాలికలపై జరుగుతున్న నేరాలు, ట్రాఫికింగ్‌ మొదలైన అంశాలపై, నివారణా చర్యలపై ఏనాడు మహిళా కమిషన్‌ లో చర్చలు లేవు. మహిళా కమిషన్‌ పని తీరుపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

సమాజ మార్పు కోసం…
మహిళలు, యువతలో సమస్యలపై ప్రశ్నించే చైతన్యం పెరగాలి. అప్పుడే చట్టాల అమలు సాధ్యమవుతుంది. అందుకే ఐద్వా అఖిల భారత మహాసభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలలో సెమినార్లు పెడుతున్నాం. అబ్బాయిలు, అమ్మాయిలకు జెండర్‌ సెన్సిటివిటీపై అవగాహన కల్పిస్తున్నాం. కుటుంబాల్లో పరిస్థితులు చూసి చాలా మంది యువత పెండ్లి, పిల్లల పట్ల విముఖత చూపిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. వీటన్నింటిపై అవగాహన కల్పించి యువతను సమాజ మార్పులో భాగస్వామ్యం చెయ్యాల్సిన అవసరం ఉంది. ఈ కృషిని ఐద్వాతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయాలి.

ఉచిత న్యాయ సలహా కేంద్రం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 31.2% మహిళలు ఏదో ఒక రూపంలో గృహింసకు గురవుతున్నారు. మహిళా ఉద్యమాల ఫలితంగా 2013లో గృహ హింస రక్షణ చట్టం వచ్చినా అమలు చేయడం లోపభూయిష్టంగా ఉంది. పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్ళినా న్యాయం జరగకపోగా చీత్కారాలు, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పోలీసులకు జెండర్‌ సెన్సిటివిటీ లేకపోవడంతో మహిళలు అనేకమంది కుటుంబ సమస్యల పరిష్కారం కాకపోవటంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఐద్వా 1992లో మానికొండ సూర్యావతి, మోటూరు ఉదయం నాయకత్వన విజయవాడలో ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ అనుభవంతో హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో న్యాయ సలహా కేంద్రాలు ఏర్పడ్డాయి. నాటి నుండి వందలాది కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్ల నుండి కూడా ఐద్వా లీగల్‌ సెల్‌కు వెళ్ళండని పంపుతుంటారు. కౌన్సెలింగ్‌ సెంటర్స్‌ మహిళలకు భరోసా కల్గించాయి.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -