Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షం తగ్గదు.. కొనుగోళ్లు ప్రారంభించరు

వర్షం తగ్గదు.. కొనుగోళ్లు ప్రారంభించరు

- Advertisement -

మద్దతు ధర కోసం చూస్తే గోసపడుతున్న రైతన్నలు
నీటి నిలువల్లో కొనుగోలు కేంద్రాలు 
రోడ్లపై ధాన్యం నిలువలు 
అంధకారంలో కొనుగోలు కేంద్రాలు 
నవతెలంగాణ – పాలకుర్తి

ప్రకృతి చేస్తున్న విలయతాండవం రైతన్నకు శాపంగా మారింది. జూలై, ఆగస్టు మాసాలు వర్షాలు లేక వేసవిని తలపిస్తే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అతివృష్టిని సృష్టిస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు విలయతాండవాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను 15 రోజుల క్రితమే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. కొనుగోలు కేంద్రాల ప్రారంభం మొదలుకొని వరుస తుఫానులతో రైతులు బెంబేలెత్తుచున్నారు. వర్షాలతో భయాందోళనకు గురవుతున్న రైతులు చేతికొచ్చిన వరి పంటను కోయించి రాశులుగా పోయడం, ధాన్యాన్ని ఆరబెట్టకపోవడంతో ధాన్యం రాశుల అడుగుభాగాల్లో ధాన్యం మొలకెత్తే ప్రమాదం పొంచి ఉంది.

వర్షాలు తగ్గుముఖం పడితే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయచ్చనే ఆలోచనలు రైతులు ఆరాటపడుచున్నప్పటికీ రైతుల ఆశలు కలగానే మిగిలాయి. వర్షం తగ్గదు ధాన్యం కొనుగోలు ప్రారంభించరు అనే మనోవేదనకు రైతులు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 బోనస్, దొడ్డు రకం ధాన్యానికి మద్దతు ధర కోసం ఎదురు చూస్తే వరుస వర్షాలతో ధాన్యాన్ని ఆరబెట్టకుండా గోసపడాల్సిన పరిస్థితి దాపురించింది. నీటి నిలువలు ఉండే చోటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. వీటితో ధాన్యం రాశులు తడవడం, ధాన్యం రాశుల చుట్టూ వర్షపు నీరు నిలవడం, కల్లాలు ఆరకపోవడం, ధాన్యంలో తేమశాతం రాకపోవడంతో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంలో జాప్యం జరుగుతుందని రైతులు రాపోవుచున్నారు.

పాలకుర్తి, తొర్రూరు సొసైటీలతోపాటు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా కల్లాలు లేకపోవడం, రోడ్లపైనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పోసుకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. రోడ్లపై పడే ప్రతి వర్షపు చుక్క ధాన్యం రాశుల కిందికి చేరడం, అడుగుభాగాల్లో మొలకెత్తడం రైతుల్లో ఆందోళనను కలిగిస్తుంది. కొనుగోలు కేంద్రాలను గుర్తించకుండానే ఐకెపి అధికారులు బాధ్యతల నుండి తప్పించుకునే విధంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. మండలంలోని ప్రతి కొనుగోలు కేంద్రం సమస్యలతోటే దర్శనం ఇస్తుంది. కల్లాలను గుర్తించకపోవడం, రోడ్లపైనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, రైతులకు శాపంగా మారింది.

మండలంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలు విద్యుత్ దీపాలు లేక అంధకారంలో ఉన్నాయి. సొసైటీలతోపాటు ఐకెపి అధికారులు పట్టించుకోకపోవడం కొనుగోలు కేంద్రాల అంధకారానికి నిదర్శనంగా మారాయి. ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని అన్యం కొనుగోలు కేంద్రాలను నీటి నిలువ లేని చోట ఏర్పాటు చేయాలని, రోడ్లపై ధాన్యం కొనుగోలు కేంద్రాల ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుచున్నారు. రైతుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వహకుల లోపం మండలంలోని కొండాపురం, పెద్ద తండా కె గ్రామాల్లో వర్షంలోనే ధాన్యం రాశులు తడుస్తున్నాయి. రోడ్లపై ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో ధాన్యం రాశులతో రోడ్లను ఆక్రమించుకోవడం రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టేందుకు అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -