టాప్ 7 నగరాల్లో 14 శాతం తగ్గిన అమ్మకాలు
హైదరాబాద్‌లో 23 శాతం క్షీణత
చెన్నైలో మాత్రమే పెరుగుదల
అన్‌రాక్ రిపోర్ట్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మందగమనంలోకి జారుకుందని మరో రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది 2025లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస అమ్మకాలు 14 శాతం తగ్గాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అన్‌రాక్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇండ్ల ధరలు పెరగడం వల్ల మొత్తం విక్రయాల విలువ మాత్రం 6 శాతం పెరిగి రూ.6 లక్షల కోట్లకు పైగా నమోదయ్యింది. కానీ సంఖ్యా పరంగా భారీ తగ్గుదల చోటు చేసుకోవడం ఆందోళనకరం. అత్యంత కీలకమైన నిర్మాణ రంగం డీలా పడటం ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసరనుంది. దేశంలోని టాప్ 7 నగరాల్లో నివాసాల సగటు చదురపు అడుగు ధర 8 శాతం పెరిగి రూ.9,260కి చేరింది.
అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో ధరలు 23 శాతం పెరిగాయి. ఇక్కడ కొత్త ఇళ్లలో 55 శాతం కంటే ఎక్కువ రూ.2.5 కోట్ల పైగా ధర కలిగిన విలాసవంతమైన ఇండ్లే ఉండటం విశేషం. ఏడు ప్రధాన నగరాల్లో 2024లో మొత్తంగా 4,59,645 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. 2025లో ఈ సంఖ్య 3,95,625కి తగ్గింది. ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ఆస్తి ధరల వల్ల అమ్మకాల్లో మందగమనం చోటు చేసుకుంది. ఏడింటిలో కేవలం ఒక్క చెన్నైలో మాత్రమే 15 శాతం పెరుగుదలతో 22,180 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మిగితా ఆరు నగరాల్లో క్షీణత చోటు చేసుకుంది. హైదరాబా ద్‌లో 2024లో 58,540 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. 2025లో 23 శాతం పతనమై 44,885 యూనిట్లకు పరిమితమయ్యాయి.
పెరిగిన నిల్వలు..
2025లో కొత్త ఇళ్ల అభివృద్ధి రెండు శాతం పెరిగి 4.19 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని అన్‌రాక్ తెలిపింది. ఇందులో రూ.2.5 కోట్ల పైగా విలువ చేసే లగ్జరీ ఇళ్ల వాటా 21 శాతానికి పెరిగింది. ఇది 2024లో 18 శాతంగా ఉంది. టాప్ 7 నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల నిల్వ 4 శాతం పెరిగి 5.77 లక్షల యూనిట్లకు చేరింది. కాగా.. హైదరాబాద్‌లో కొత్త నివాసాల సరఫరా తగ్గడం వల్ల అమ్ముడుపోని ఇళ్ల నిల్వలో రెండు శాతం స్వల్ప తగ్గుదల నమోదయ్యింది. బెంగళూరులో మాత్రం ఇది అత్యధికంగా 23 శాతం పెరిగింది. ”2026లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించడం, బిల్డర్లు ధరలకు కోత పెట్టాల్సిన అవసరం ఉంది.” అని అన్‌రాక్ గ్రూప్ చైర్మెన్ అనుజ్ పూరి పేర్కొన్నారు.



