Friday, October 31, 2025
E-PAPER
Homeజాతీయంవిభూతిపూర్‌లో ఎగిరేది ఎర్రజెండానే

విభూతిపూర్‌లో ఎగిరేది ఎర్రజెండానే

- Advertisement -

‘మాస్కో ఆఫ్‌ సమస్తిపూర్‌’లో సత్తా చాటుతాం
పోరాటాలు, అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
గతంతో పోలిస్తే మెజారిటీ పెరుగుతుంది: సీపీఐ(ఎం) అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అజయ్ కుమార్‌ విశ్వాసం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న తరుణంలో బీహార్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎర్రజెండా సిద్ధమవుతున్నది. పోరాటాలతో ప్రజల పక్షాన నిలిచిన సీపీఐ(ఎం).. ‘మాస్కో ఆఫ్‌ సమస్తిపూర్‌’ గా పిలువబడే విభూతిపూర్‌ను ఈసారి కూడా నిలుపుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. దళితులు, భూమి హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాటాలతో ఈ ఎర్ర నేలను మరోసారి నడిపించడానికి సీపీఐ(ఎం).. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అజయ్ కుమార్‌ను రంగంలోకి దించింది. 2020లో 40,500 ఓట్ల మెజారిటీతో నియోజకవర్గాన్ని తిరిగి గెలుచుకున్న అజయ్, ఈసారి తన మెజారిటీ పెరుగుతుందని నమ్మకంగా ఉన్నారు. ఐదు సంవత్సరాలుగా అసెంబ్లీ లోపల, వెలుపల తాను చేసిన పోరాటాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులే తన మెజారిటీకి పునాదులని అజయ్ కుమార్‌ చెబుతున్నారు.

అజయ్ కుమార్‌కు ఓటర్ల నుంచి మంచి స్పందన
కుండపోత వర్షం ఉన్నప్పటికీ మెహతి గ్రామంలో ఓట్లు అడగడానికి బయలుదేరిన అజయ్ కుమార్‌ భయ్యాను నిర్మలా దేవి అనే మహిళ ఆపి, ‘ఈసారి నేను మీకు ఎలా ఓటు వేయాలి?’ అడిగింది. అజయ్ కుమార్‌ తన జేబులో నుంచి బ్యాలెట్‌ పేపర్‌ మోడల్‌ను తీసి ఆమెకు వివరించారు. ‘ఈసారి మొదటి పేరు అదే. పెద్ద కలర్‌ ఫోటో కూడా ఉంది. భయపడాల్సిన పని లేదు’ అని చెప్పారు. ఆయన మరొక ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఇంటి యజమాని జారే గోడ ఎక్కి, జామకాయను తెంపి అజయ్ కుమార్‌కు అందించాడు. రైతు కుటుంబం భోజనం కోసం వెన్నతో చేసిన చపాతీలు, ఆలు కూర, తీపి లస్సీని తయారు చేసి అజయ్ కుమార్‌ను స్వాగతించింది. చాలా ఇండ్లు మిగిలి ఉన్నాయని, కానీ వర్షం కారణంతో తిరగలేకపోవడంతో క్షమాపణలు చెబుతూ అభ్యర్థి, ఆయన బృందం మరో గ్రామానికి వెళ్లారు.

బరిలో ఉన్నది వీరే
2010, 2015లో విభూతిపూర్‌ నుంచి గెలిచిన రామ్‌ బాలక్‌ సింగ్‌ రెండో భార్య రవీనా ఖుష్వాహా ఈసారి అధికార జేడీ(యూ) అభ్యర్థిగా బరిలో ఉంది. రామ్‌ బాలక్‌ సింగ్‌ పెద్ద ఫొటో, పేరు పోస్టర్లు, ప్రచార వాహనాలపై ఉన్నాయి. డబుల్‌ మర్డర్‌ కేసులో నిందితుడిగా రాంబలక్‌ జైలులో ఉన్నాడు. లైంగికదాడి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అశ్లీల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కూడా అయింది. దీంతో రాంబలక్‌కు జేడీ(యూ) సీటు నిరాకరించింది. అయితే, తన భార్యకు సీటు ఇవ్వాలనే ఆయన పట్టుపట్టడంతో జేడీ(యూ) సీటు ఇచ్చింది. బీజేపీ రెబల్‌ అభ్యర్థి రూపాంజలి కుమారి కూడా పోటీలో ఉన్నారు.

ఎర్రనేల విభూతిపూర్‌
సమస్తిపూర్‌లోని విభూతిపూర్‌ సీపీఐ(ఎం) హక్కుల పోరాటాలతో నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిన నేల. 500 నుంచి 1000 ఎకరాలను కలిగి ఉన్న భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని, దళితులు, వెనుకబడిన వర్గాలకు పంచే చారిత్రాత్మక పోరాటాలను పార్టీ చేసింది. ఈ పోరాటంలో 26 మంది అమరులయ్యారు. అజయ్ కుమార్‌పై భూస్వాములు మూడుసార్లు దాడి చేశారు. ఆ దాడులను సైతం ఎదుర్కొని ఆయన ప్రజా పోరాటాలను నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -