సోషలిస్ట్ విధానాలకు పెరుగుతున్న ఆదరణ
ఏక ధ్రువ ప్రపంచం నుండి బహుళ ధ్రువ ప్రపంచం వైపు పయనం
ఆర్థిక సంక్షోభాల నుండి ప్రపంచ దేశాలను గట్టెకించలేని నయా ఉదారవాద విధానాలు
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – హైదరాబాద్:
ఆర్థిక సంక్షోభాల నుంచి ప్రపంచంలో దేశాలను నయా ఉదారవాద విధానాలు గట్టెక్కించే విధంగా లేవని, సోషలిస్ట్ విధానాలే ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాయని, ఎర్రజెండాదే భవిష్యత్తు జరుగుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన సోమవారం, మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లిలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి క్లాసులను ఉద్దేశించి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఏక ధ్రువ ప్రపంచం నుండి బహుళ ధృవ ప్రపంచం వైపు పయనిస్తుందని, అమెరికా డాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాల కూటమి చైనా నాయకత్వంలో ముందుకు వచ్చిందని, ఆయా దేశాల లోకల్ కరెన్సీలో ప్రపంచ వ్యాపారానికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. దీనిలో భారతదేశం కూడా భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం మంచి పరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు. నయా ఉదారవాద విధానాల వలన నిరుద్యోగం, పేదరికం, ఉపాధి కోసం వలసలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, కార్మికుల వేతనాలు లేక ప్రజల కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పడిపోతున్నదని, ఆకలి కేకలు పెరుగుతున్నాయని అన్నారు.
వ్యవసాయ కార్మికులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. సామ్రాజ్యవాద దేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక మాన్యం నుండి బయటపడడానికి ఆయుధాలు మందు గుండు సామాగ్రి అమ్ముకోవడం కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తన మాట వినని దేశాలపైన టారిఫ్ సుంకాలను విధించడానికి సిద్ధపడిందని చెప్పారు. చిన్న చిన్న దేశాలు అమెరికా టారిఫ్ లకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి మాట్లాడుతుంటే 50% సుంకాలు విధించిన భారతదేశం మాత్రం నోరు విప్పడం లేదని అన్నారు. చౌకగా కొనుక్కునే రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అని, మన దేశాన్ని బెదిరించినా, భారత్, పాకిస్తాన్ యుద్ధం నేను చెప్పడం వల్లనే ఆగిపోయిందని ట్రంప్ అనేకసార్లు ప్రకటించినా, 56 ఇంచుల చేతగలిగిన మన ప్రధాని నిజమా కాదా అనేది ఇప్పటి వరకు చెప్పకపోవడం మన దేశ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమే అన్నారు.
స్వతంత్ర విదేశాంగ విధానాలకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు. అమెరికా తారీఫ్ లను యధావిధిగా అమలు చేస్తే మన వ్యవసాయ రంగంలో సోయాబీన్ , పత్తి , బియ్యం లతోపాటు మత్స్య పరిశ్రమ, చేనేత పరిశ్రమ, పాల ఉత్పత్తుల పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు. వీటి ఆధారంగా బతుకుతున్న అనేకమంది ఉపాధిని కోల్పోతారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా అమెరికాతో మోడీ లాలూచీ తనని ఎండగడుతూ దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, బి.పద్మ, కేంద్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, నారి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.




