1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి కారణం ఫాసిజం. దీన్ని సోవియట్ సైన్యం వీరోచితంగా పోరాడి వెనక్కికొట్టింది ఈ ఓటమిని తట్టుకోలేక ఫాసిస్టు హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మే 9న జర్మన్ రిచ్‌స్టార్గ్ భవనం మీదకు ఇద్దరు ఎర్ర సైనికులెక్కి ఎర్రజెండా ఎగురవేశారు. ప్రపంచాన్ని ఫాసిజం భారినుండి రక్షించిన సోవియట్ రష్యా భారీగా త్యాగం చేయాల్సి వచ్చింది. రెండుకోట్ల మంది ప్రాణాలర్పించారు. అంతకు రెండు మూడు రెట్లు మంది క్షతగాత్రులయ్యారు. అనేక నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారాయి. అయినా ఎర్రజెండా త్యాగాల వల్ల ఫాసిస్టు నియంతృత్వం నుండి ప్రజలను కాపాడుకోగలిగాము. తద్వారా ప్రపంచంలో అనేక జాతీయ విముక్తి ఉద్యమా లకు ఊపు వచ్చింది. దీని ప్రభావం భారతదేశపు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తీవ్రంగా పడింది. సోవియట్ యూనియన్ ప్రభావంతో మన దేశం 1947 ఆగస్టు 15న వలస పాలన నుండి విముక్తి అయ్యింది. ఇండియా సోషలిస్టు తరహా ఆర్థిక విధానాలు చేపట్టింది. మిశ్రమ ఆర్థిక విధానం, సంక్షేమ రాజ్యంగా పేర్కొంది. అందుకే రష్యా మనకు కీలక మిత్రుడిగా మారింది.
ఫాసిజం యుద్ధోన్మాదంగా మారి ప్రపంచాన్ని కబళించడానికి పూర్వరంగం కూడా ఉంది. 1920-30 మధ్య కాలంలో ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారీ ప్రపంచంలో పెరుగుతూ 2029-30 నాటికి ప్రపంచం ” గ్రేట్ డిప్రెషన్ ”గా పేర్కొంటున్న ” ఆర్థిక మహా మాంద్యం”కు దారితీసింది. అంతకుముందు 1917లో నిరంకుశ జార్ ప్రభువుల పాలన నుండి లెనిన్ నాయకత్వంలో విముక్తి అయిన సోవియట్ యూనియన్ ప్రపంచ భూభాగంలో ఇరవై శాతంగా ఏర్పడి అప్రతిహాతంగా పురోగమనంలో సాగింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ఛాయలు దాని మీద పడలేదు. ఈ పెట్టుబడిదారీ ప్రపంచానికి సోషలిజం ప్రత్యామ్నాయంగా ఏర్పడింది. ఫాసిజం ఆవిర్భావానికి యుద్ధాలతో నిండిన యూరఫ్ ఆర్థిక సంక్షోభం ఒక ప్రధాన కారణం. హిట్లర్ జర్మనీ ఎక్కువగా సంక్షోభ ప్రభావానికి గురైంది. యాభై శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. బ్యాంకుల్లోని ప్రజల పొదుపులను బలవంతంగా తీసుకుని బ్యాంకులు కుప్పకూలాయి. కార్పొరేట్ల పన్నులను మాఫీ చేశారు. కార్మికుల హక్కులను అత్యంత నిరంకుశంగా అణిచివేశారు. యుద్ధ సన్నాహాల వైపు ఆర్థిక, పారిశ్రామిక రంగాలను మళ్లించారు.ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. దీనిపై శ్రామిక ప్రజలు తిరుగుబాటు మొదలైంది.
ఈ స్థితిలో పెట్టుబడిదారీ విధానానికి ఫాసిజం అవసరమైంది. హిట్లర్ భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ప్రపంచంపై నాజీల అధిపత్యం సాధించాలని లక్ష్యాన్ని ప్రకటించాడు. తన దేశ ప్రజల్లో జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టాడు. ఫలితంగా వివిధ జాతులకు చెందిన ఎనభై లక్షల మందిని అత్యంత దారుణంగా, క్రూరంగా చంపాడు. హిట్లర్ జర్మనీ తన పొరుగున ఉన్న చిన్న దేశాలన్నింటినీ క్రమంగా ఆక్రమించాడు.ఫాసిజం వ్యతిరేక పోరాట యోధుడు కామ్రేడ్ డిమిట్రోవ్ ఏడో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌కు సమర్పించిన నివేదికలో ”ఫాసిజం అనేది ఫైనాన్స్ క్యాపిటల్ బలం. ఇది కార్మికవర్గం, రైతు, మేధావుల విప్లవ విభాగాలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఉగ్రవాద సంస్థ. ఇది ఇతర జాతులు, దేశాలపై ద్వేషాన్ని అతిక్రూరమైన రూపంలోని జింగోయిజాన్ని రేకెత్తిస్తుంది” అని పేర్కొన్నాడు. అదేవిధంగా వలసవాద విముక్తి పోరాటాల్లో రైతుల పాత్రను, జాతీయ బూర్జువా వర్గం పాత్రను విస్మరించటం, తక్కువ అంచనా వేయటం ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి తీవ్ర నష్టం చేస్తుందని, ఈ సెక్టేరియన్ పోకడను వదిలించుకోవాలని దిశా నిర్ధేశం చేశాడు. ఈ డైరెక్షన్ భారత జాతీయోద్యమంలో పోరాడుతున్న కమ్యూనిస్టులకు, ఈ దేశంలో ఇతర సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయడానికి, తద్వారా పురోగమించటానికి దోహదపడింది.
ప్రపంచాన్ని ఉత్తేజపరిచే అత్యంత స్ఫూర్తిదాయక విజయాన్ని సోవియట్ ఎర్రసైన్యం సాధించింది. దీన్ని మన తెలుగుకవులు ఎర్ర సేన పరాక్రమానికి నీరాజనాలు పలుకుతూ హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా గేయాలు రాశారు. మహాకవి శ్రీశ్రీ అయితే ” గర్జించు రష్యా..గాండ్రించు రష్యా.. పర్జన్య శంఖం పూరించు రష్యా…దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా….” అనే గొప్ప గేయాన్ని లిఖించారు. హిట్లర్ ఘోరంగా ఓడిపోయాక జర్మనీ రెండు ముక్కలైంది. తూర్పు జర్మనీ సోషలిస్టు రాజ్యంగా మారింది. పోలెండ్, హంగరీ, రుమేనియా, బల్గేరియా, జకొస్లొవేకియా ఇలా తూర్పు యూరఫ్ దేశాలు సోషలిస్టు దేశాలుగా మారాయి.అనేక వలస దేశాలు విముక్తి అయ్యాయి.తర్వాత కాలంలో చైనా, వియత్నాం, క్యూబా తదితర దేశాలపై ఈ ప్రభావం పడింది. సోషలిజం వేగంగా పురోగమించింది. మరోపక్క ఇండియా ప్రజలు బ్రిటీష్ వలస పాలనపై చేస్తున్న పోరాటానికి ప్రజా ప్రతిఘటనకుఈ పరిణామాలు బాగా తోడ్పడ్డాయి. ఇండియా స్వతంత్రం సాధించిన తర్వాత తన కాళ్లపై నిలబడి ఎదగడానికి సోవియట్ రష్యా ఇతోదిక సహకారం అందించింది. మనదేశం శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయక, మిలిటరీ, రోదసీ రంగాల్లో వేగంగా సార్వభౌమరాజ్యంగా ఎదగటానికి సోషలిస్టు రష్యా ఉపయోగపడింది. ఫలితంగానే మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న కుట్రలను ఎదిరించి ఎదిగింది. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా, దాని మిత్ర ‘నాటో’ దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధంలోకి వచ్చాయి. సోవియట్ ప్రత్యక్షంగా రంగం మీద నిలబడటంతో అమెరికా తోక ముడిచింది. భారత్ సహాయంతో బంగ్లాదేశ్ విముక్తి అయ్యింది.
1990ల తర్వాత సోవియట్ కూలింది. ప్రపంచంలో సోషలిస్టు క్యాంపు బలహీనపడింది. ప్రపంచమ్మీద అమెరికా కూటమి నాయకత్వంలో దోపిడీ పెరిగింది. 2008 నుండి ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచ మ్యానుఫ్యాక్చర్ హబ్‌గా డాలర్ గుత్తాధిపత్యాన్ని ఎదిరించే శక్తిగా శాస్త్ర సాంకేతిక, ఆర్థిక, సైనిక రంగాల్లో చైనా వేగంగా ముందుకు వచ్చి అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసింది. భారతదేశం ఈ కాలంలో ప్రధానంగా మోడీ హయాంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు అప్పు పెరిగింది. సంపద కేంద్రీకరణ మన దేశంలో విపరీతమైంది. ఒక్కశాతం మంది వద్ద 78శాతం సంపద పోగుపడింది. కోట్లాది ప్రజల వద్ద కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతున్నది. గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ చవిచూడనంత స్థాయిలో ఇటీవల నిరుద్యోగం పెరిగింది. ఆర్థిక ఒత్తిడిలు, ఆత్మహత్యలు పెరిగాయి. అమెరికా తాను ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి ప్రపంచ ప్రజల మీద వాణిజ్య యుద్ధం టారిఫ్‌ల పేరుతో ప్రారంభించింది. ప్రపంచ దేశాల వనరులన్నింటినీ కొల్లగొట్టడంలో అగ్రబాగాన ఉన్న అమెరికా ప్రాంతీయ ఉద్రిక్తతలను సృష్టిస్తూ యుద్ధాలను వాడుకుంటున్నది. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధంలో తలదూర్చి ఆ దేశంపై ఒత్తిడిచేసి అక్కడి కీలక భూ భాగాల్లోని ఖనిజాలను తన హస్తగతం చేసుకున్నది. గాజాను కూడా తన రియల్ ఎస్టేట్ లేదా వ్యాపార అవసరాల కోసం ఆక్రమించుకోవడానికి ఇజ్రాయిల్‌ను ఉపయోగిస్తున్నది. ఫలితంగా ఇలాంటి అనేక పరిణామాల వల్ల ప్రపంచంలోని యుద్ధ వాతావరణం ఉద్రిక్తతలు పెరగటం అమెరికా, నాటో దేశాలు తమ ఆయుధ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతున్నవి.
మనదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి, మైనార్టీలను టార్గెట్ చేసి మెజారిటీ ప్రజల్లో అసహనం, విద్వేషం రెచ్చగొట్టే చర్యలు పెరిగాయి. మైనింగ్,ఖనిజాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే అడవులను నిర్మూలించి, ఆదివాసీలను తరిమేసే కుట్రపూరిత చర్యల్ని ఎక్కువయ్యాయి. రైతులు, కార్మికుల మీద, వారి పోరాటాల మీద, వారి హక్కులు, సదుపాయాల మీద దాడి అంతకంతకూ రెట్టింప య్యాయి. దేశంలోని వనరులన్నింటినీ కొద్దిమంది బడా కార్పొరేట్లకు కట్టబెట్టడం, బ్యాంకులు, ఇన్సూరెన్స్, కీలక ప్రభుత్వ రంగ సంస్థల లూటీకి కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని రకాల అవకాశాలు కల్పించింది.
ఇండియా లాంటి దేశాలను ఆర్థికంగా శాసించాలని చూస్తూ, తనకు, తన డాలర్ ఆధిపత్యానికి ఎదురేలేదని అనుకుంటున్నది అమెరికా. కానీ చైనా నుండి తీవ్రమైన సవాళ్లను మరోవైపు ఎదుర్కొంటున్నది. భారత ఉపఖండంలో ఉగ్రవాద పోషక పాకిస్తాన్ ను కంట్రోల్ చేయగలిగే ఏకైక శక్తి అమెరికానే. అది గీసిన గీత దాటే సాహసం పాకిస్తాన్ ఏమాత్రం చేయలేదు. కానీ, అమెరికా దాన్ని నియంత్రించకుండా ఇండియా, పాకిస్తాన్ రెండూ తనకు మిత్రదేశాలేనంటూ రెండింటికీ యుద్ధ విమానాలు, ఆయుధాలు అమ్ముతూ పాకిస్తాన్‌కు మిలిటరీ ప్యాకేజీలు కూడా ప్రకటిస్తున్నది. కశ్మీర్ పట్ల ఇండియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తమ వీటో పవర్‌ను కూడా గతంలో ఉపయోగించింది.
ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడి దోపిడీ, ఆధిపత్యాల నుండి విముక్తి కావడానికి ప్రపంచ ప్రజల ప్రతిఘటనా పోరాటాలు ముందుకొస్తున్నాయి. నాటి సోవియట్ రెడ్‌ఆర్మీ పరాక్రమం, స్ఫూర్తి మనముందున్నాయి. నేడు పెట్టుబడిదారీ దేశంగా మారినప్పటికీ రష్యా ఫాసిజం వ్యతిరేక ఎనభయ్యవ వార్షికోత్స వాలు పెద్దఎత్తున నిర్వహించాలని భావించటం ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రత్యేకత.
(ఫాసిజంపై సోవియట్ విజయానికి నేటితో 80ఏండ్లు)
– బండారు రవికుమార్
9490098090
ఫాసిజం నుండి ప్రజల్ని కాపాడిన ఎర్రజెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES