సర్ అమలు రాష్ట్రాల్లో ధోరణులపై ఈసీ
న్యూఢిల్లీ : ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి అందుతున్న ఎన్యూమరేషన్ ఫారాలు చాలా తక్కువగా వున్నాయని ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం తెలిపారు. పనులకు వెళ్లడం లేదా వృత్తిపరమైన కారణాలతో ఇండ్లల్లో లేకపోవడం ఈ ఫారాలు అందజేయకపోవడానికి ప్రధాన కారణంగా వుంటోందని చెప్పారు. ఇతర ప్రాంతాలకు నిరంతరంగా వలస వెళ్లఢం కూడా మరో కారణంగా కనిపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లస్థాయి అధికారులకు అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య చాలా ఎక్కువగా వుంటోంది. లక్నో, కాన్పూర్, నొయిడా వంటి నగరాల్లో ఓటర్ల నుంచి అందుతున్న ఫారాలు చాలా తక్కువగా వున్నాయన్నారు. సర్ అమలవుతున్న రాష్ట్రాల్లో నెలకొన్న ధోరణులను వారు ఉదహరించారు. గతేడాది బీహార్‌లో సర్ అమలైనపుడు పాట్నాలోనూ ఇదే ధోరణి నెలకొంది.
నవంబరు 4న అండమాన్ నికొబార్ దీవులు, లక్షదీవులు, చత్తీస్‌గడ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల్లో సర్ రెండో దశ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ మినహా, మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురితమైంది. అసోంలో విడిగా ప్రత్యేక సవరణ జరుగుతోంది.
రాష్ట్రాల్లో చివరిసారిగా నిర్వహించిన సర్‌ని కటాఫ్ తేదీగా చూస్తున్నారు. బీహార్‌లో 2003 నాటి ఓటర్ల జాబితాను సర్‌కు ఉపయోగించారు. చాలా రాష్ట్రాల్లో 2002, 2004 మధ్య కాలంలో చివరిసారిగా ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. ఆ రాష్ట్రాలు ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్‌ని దాదాపు పూర్తి చేశాయి.
పట్టణ ప్రాంతాల్లో స్పందన అంతంతే
- Advertisement -
- Advertisement -



