తాడిచెర్ల ఎన్నికల అధికారిపై లోకాయుక్తలో ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ,అప్పటి రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ పై విచారణ జరపాలని కోరుతూ సర్పంచ్ అభ్యర్థి కేశారపు రవి లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లుగా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 6వ తేదీన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా, ఒక అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి నామినేషన్ పత్రాల్లో కీలక వివరాలు పూర్తిగా దాఖలు చేయకపోయిన విషయంపై తాను ఆధారాలతో సహా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ ఫిర్యాదును పూర్తిగా విస్మరించినట్లుగా ఆరోపించారు.
నామినేషన్ పత్రాలపై కనీస స్థాయి విచారణ (ఎంక్వయిరీ) కూడా నిర్వహించకుండా,ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆ అభ్యర్థి పేరును నోటీసు బోర్డులో చెల్లుబాటు అయ్యిందిగా ప్రకటించారన్నారు. ఇది స్పష్టమైన అధికార దుర్వినియోగం, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకతప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఇప్పటికీ ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నాడని, ఇది మరింత ఆందోళన కలిగించే అంశమన్నారు.
ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం వల్ల ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ,తన ఫిర్యాదును పట్టించుకోకపోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ, సంబంధిత ఆధారాలతో సహా లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి,తప్పుడు సమాచారం ఇచ్చిన వారితో సహా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్తను కోరినట్టుగా తెలిపారు.



