నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటర్ల జాబితాను తీవ్రంగా సవరించడం వల్ల బెంగాల్ ప్రజలు తీవ్ర బాధను, హింసను ఎదుర్కొన్నారని భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముర్షీదాబాద్‌కు చెందిన మోస్తారి బాను అన్నారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఆమె మీడియాతో మాట్లాడారు. ”ఎలక్షన్ కమిషన్ మైనారిటీలు, వెనుకబడిన తరగతులను ఎంపిక చేసి ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తోంది. సీపీఐ(ఎం) మద్దతుతో న్యాయ పోరాటం జరుగుతోంది.
2002 ఓటర్ల జాబితాలో ఉన్న వారిని కూడా తొలగిస్తున్నారు. వారు నా పేరును ముసాయిదా జాబితా నుంచి కూడా మినహాయించారు. రాష్ట్రంలోని చాలా చోట్ల, మైనారిటీ వర్గాలను సామూహికంగా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఓటర్లను తొలగించడానికి ఫిర్యాదులు చేసే వారి వివరాలు కూడా తెలియవు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారు” అని ఆమె అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు మురళీధరన్, పిటిషనర్ తరఫు న్యాయవాది సబ్యసాచి ఛటర్జీ పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణతో బెంగాల్ ప్రజలకు తీవ్ర బాధ, హింస
- Advertisement -
- Advertisement -



