అక్కడే అభివృద్ధి కేంద్రీకృతం
మిగిలిన భారతావనిలో అన్నీ సమస్యలే
దేశంలో పెరిగిపోతున్న అంతరాలు
న్యూఢిల్లీ : దేశంలో 1,687 మందికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపద ఉంది. అలాగే 358 మంది వద్ద ఎనిమిదిన్నర వేల కోట్ల సంపద పోగుపడి ఉంది. వీరందరి వద్ద కలిపి ఉన్న సంపద భారత జీడీపీలో దాదాపు సగానికి సమానమని హూరన్ ఇండియా రిచ్ తాజా జాబితా తెలిపింది. ఈ గణాంకాలు దేశానికి గర్వకారణమని అనిపిస్తోంది కదూ ! కానీ నాణేనికి మరో వైపు కూడా చూస్తే చేదునిజాలు బయటపడతాయి. కనిపిస్తున్న సుందర దృశ్యం అదృశ్యమవుతుంది. ఈ సంపద అంతా దాదాపుగా దేశంలోని కొన్ని ప్రాంతాలలోనే కన్పిస్తుంది. భారతదేశానికి చెందిన మిలియనీర్ కుటుంబాలలో సగానికి పైగా కుటుంబాలు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌లోనే ఉండడం గమనార్హం. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా…వీటిని కూడా కలుపుకుంటే భారత వృద్ధిలో 90 శాతం ఈ పది రాష్ట్రాలలోనే మనకు కన్పిస్తుంది.
మరో మాటలో చెప్పాలంటే ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలలోనే సంపద సృష్టి జరుగుతోంది. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. హూరన్ నివేదికను పరిశీలిస్తే పరస్పర విరుద్ధమైన అంశాలు ఎన్నో కన్పిస్తాయి. అది కేవలం సంపన్నుల జాబితా మాత్రమే కాదు. దేశంలో అభివృద్ధి ఎక్కడ కేంద్రీకృతమైంది, అది ఇంకా ఎక్కడ కన్పించడం లేదు అనే అంశాలను కూడా ఆ నివేదిక స్పృశించింది.
కొన్ని రాష్ట్రాలలోనే ఎందుకు కేంద్రీకృతం?
సంపద ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు లభిస్తాయని చెబుతుంటారు. మహారాష్ట్రలో వాణిజ్య రాజధాని ముంబయి
ఉంది. ఆ రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపా యలకు పైగా సంపద ఉన్న వారు 548 మంది. అంటే దేశంలో ఉన్న సంపన్నుల్లో సగం మంది మహారాష్ట్రలోనే ఉన్నారన్న మాట. ఢిల్లీలో 223 మంది సంపన్నులు ఉండగా కర్నాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలో మిగిలిన వారు నివసిస్తున్నారు. దీనిని బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాలు ఉంటాయి. పెట్టుబడిదారులకు విశ్వాసం కలుగుతుంది. ముంబయి లేదా బెంగళూరులో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే పెట్టుబడిని సమీకరించడం సులభం. నిపుణులైన సిబ్బంది లభిస్తారు. డబ్బు ఖర్చు చేసే వినియోగదదారులూ దొరుకుతారు. అదే ఇండోర్‌లోనో పాట్నాలోనూ వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందడానికి చాలా కాలం పడుతుంది.
ఏం తయారు చేస్తున్నామన్న దాని కంటే ఎక్కడ తయారు చేస్తున్నామన్నదే ముఖ్యమని ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ యజమాని వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. లక్షలాది మంది యువతీ యువకులు ఉద్యోగాలు, విద్య, స్థిరమైన జీవితం కోసం సంపన్న నగరాలకు వలస వస్తుంటారు. బెంగళూరు, ముంబయి, ఢిల్లీ వంటి నగరాలు కేవలం సంపదను మాత్రమే సృష్టించడం లేదు. అవి సంపదను ఆకర్షిస్తున్నాయి కూడా. ఎక్కువ మంది ప్రజలు వలస వస్తుంటే ఆ రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అదే సమయంలో ఆ రాష్ట్రాలకు, మిగిలిన ప్రాంతాలకు మధ్య అంతరం నానాటికీ పెరిగిపోతుంది. ఈ పది రాష్ట్రాలలోనే ప్రధాన పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, విమానాశ్రయాలు, అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలు కేంద్రీకృతం అయ్యాయి. పెట్టుబడి, నైపుణ్యం ఎక్కడైతే కన్పిస్తుందో సహజంగానే అక్కడ సంపద పోగుపడుతుంది.
పెరిగిపోతున్న అంతరం
సంపదను సృష్టించే సామర్ధ్యం మన దేశానికి పుష్కలంగా ఉంది. కాకపోతే అది కొన్ని ప్రాంతాలలోనే మనకు కన్పిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక వెనుకబడే ఉన్నాయి. ఈ అంతరం అర్థికంగా, సామాజికంగా నష్టం కలిగించడం ఆందోళనకు దారితీస్తోంది. నగరాలు ఎలా దినదినాభివృద్ధి చెందుతున్నాయో అందరికీ తెలుసు. ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని ఢిల్లీ…ఈ రెండు నగరాలలో డబ్బు మాత్రమే కాదు…ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. అక్కడ ఇల్లు దొరకాలంటే భగీరథ ప్రయత్నమే చేయాలి. దొరికినా అద్దెలు భరించడం చాలా కష్టం. రోడ్లన్నీ కిక్కిరిసి ఉంటాయి. ఎక్కడ చూసినా జనం…జనం…జనం. చిన్న చిన్న పట్టణాలలో ఇందుకు భిన్నమైన వాతావరణం కన్పిస్తుంది. అక్కడికి అవకాశాలు అంతగా రావు. ఫలితంగా అభివృద్ధి నత్తనడక నడుస్తుంది. అవకాశాలు ఎక్కడ ఎక్కువగా లభిస్తాయో అక్కడికి జనం పరుగులు తీయడం సహజం. అది బెంగళూరు కావచ్చు…గురుగ్రామ్ కావచ్చు…ముంబయి కావచ్చు. ఈ నిశ్శబ్ద వలసలు అసమానతలకు కారణమవుతున్నాయి.
కటిక దరిద్రం వైపు పేదలు
మోడీ సర్కార్ వచ్చాక దేశంలో పేదలు మరింత పేదరికంలో మగ్గిపోతున్నారు. మధ్యతరగతి ప్రజానీకం అయితే దినదినగండం నూరేండ్ల ఆయుష్ఘు మాదిరిగా మారింది. పెరగని ఆదాయాలు, ర్చులు డిసిమోపడవుతున్నాయి. ఇంటి అద్దెల నుంచి నిత్యావసరాలు మరింతగా భారమవుతున్నాయి. నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతున్న మాటలు, ఇస్తున్న హామీలు ీటిమూటల్లా మిగిలిపోతున్నాయి. పాలకులు మారినా… తమ బతుకులు మారటంలేదనే ఆవేదన పేద, మధ్య తరగతి ప్రజల్లో వ్యక్తమవుతోంది. సంపన్నులు పెరిగినంతగాపేదలు, మధ్య తరగతి ప్రజల జీవితాలు మాత్రం బతుకుబండి లాగేదెలా అంటూ మానసిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకోవటం సర్వసాధారణమైపోయింది.
ఏం చేయాలంటే….
దేశంలో ఆర్థికాభివృద్ధి సుదీర్ఘ కాలం కొనసాగాలంటే అసమానతలను తగ్గించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందడాడానికి ప్రతి రాష్ట్రానికీ అవకాశం కల్పించాలి. మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ యాక్సెస్ వంటివి ఇందుకు దోహదపడతాయి. చిన్న చిన్న నగరాలలో రోడ్లు నిర్మించి, ఇంటర్నెట్ సదుపాయం కల్పించి, పెట్టుబడులు పెడితే నూతన అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ముంబయి, బెంగళూరులో ఉండే బిలియనీర్ల విజయ గాథలనే కాదు…కోయంబత్తూరులోని చిన్న తయారీ సంస్థ, ఇండోర్‌లోని డిజైన్ స్టూడియా, గౌహతిలోని ఫిన్‌టెక్ స్టార్టప్ వంటి విభిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్న తీరునూ పరిశీలించాలి. ఏవో కొన్ని రాష్ట్రాలు వెలిగిపోయినంత మాత్రాన నిజమైన బలమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడదు. ఎక్కడ నైపుణ్యం ఉందో, ఎక్కడ వినూత్న ఆలోచనలు పుట్టుకొస్తాయో వాటన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందే.
హూరన్ నివేదిక ఓ అద్దం వంటిది. అది మన దేశం ఏమి సాధించిందో చెప్పింది. అలాగే ఏం చేయాలో కూడా సూచించింది. మరింత మంది బిలియనీర్లను సృష్టించడం సవాలు కాదు. తమ జీవితాలు వెలిగిపోతున్నాయని లక్షలాది మంది ప్రజలు నమ్మే దేశాన్ని సృష్టించుకోవడమే నిజమైన సవాలు.