– వాలిడేషన్ యాక్ట్ 2025 ఉపసంహరణకు డిమాండ్
నవతెలంగాణ – కామారెడ్డి : పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెన్షన్ పొందడం ప్రాథమిక హక్కు అని, దానిపై ఎలాంటి పరిమితులు విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ రామరాజు పేర్కొన్నారు.
వాలిడేషన్ ఆక్ట్ 2025 చట్టాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2025 మార్చి 25న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ చట్టానికి ఏడాది పూర్తయినందున, ఈ తేదీని “బ్లాక్ డే”గా పాటిస్తున్నట్లు తెలిపారు.
ఈ చట్టం ద్వారా 2026 జనవరి 1కు ముందు, తర్వాత రిటైర్ అయిన వారిని రెండు వర్గాలుగా విభజించడం, వేతన సవరణలు, కరువు భత్యం, పెన్షన్ పెంపు వంటి అంశాలపై పూర్తి అధికారాలను పార్లమెంట్‌కు ఇవ్వడం పెన్షనర్లకు అన్యాయం అని విమర్శించారు. పెన్షన్ అనేది భిక్ష కాదు అని రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దానిపై నిర్ణయాలు తీసుకునే విధానం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఈ చట్టం అమలైతే పెన్షనర్ల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునరాలోచించి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసన అనంతరం జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి విజ్ఞాపన పత్రం సమర్పించి, ప్రధానమంత్రికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లచ్చయ్య, డాక్టర్ బాలరాజు, జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, కల్వకుంట్ల రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రాజలింగం, మధుసూదన్ రావు, మురళీధర్ రావు, లక్ష్మీనారాయణ, కుర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



