-మున్సిపల్ టికెట్ల పంపిణీలో తీవ్ర అన్యాయం
– ఎమ్మెల్యేపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణ కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల-రాయికల్ పట్టణాల్లో ఊహించని రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనపెట్టి బీఆర్‌ఎస్‌కు చెందిన వారికే బీ-ఫారాలు ఇచ్చారని ఆరోపించారు. రాయికల్‌లోని 12 స్థానాల్లో ఏడు స్థానాలు కాంగ్రెస్‌కు సంబంధం లేని వ్యక్తులకు కేటాయించారని, కేవలం ఐదుగురు మాత్రమే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలని తెలిపారు. జగిత్యాలలో 50 స్థానాలకు 30 స్థానాలు ఎమ్మెల్యే ప్రతిపాదించారని, మిగిలిన 20 స్థానాలు మాత్రమే పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నట్లు అఫిడవిట్ దాఖలు చేసిన విషయం ఆశ్చర్యకరమన్నారు. అభివృద్ధి అనేది రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కు అని, చట్టసభలకు ఎన్నికైన ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధికి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 32 స్థానాల్లో ఏకైక సభ్యుడిగా ఎన్నికై అభివృద్ధిలో వెనుకబడ్డానా అని ప్రశ్నించారు. బోర్నపల్లి వంతెనకు రూ.70 కోట్లు, జగన్నాథ్ పూర్ వంతెనకు నిధులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాయికల్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు, అదనంగా తాగునీటి సమస్య లేకుండా బావులు తవ్వించడంతో రాయికల్ సగం ఊరికి నీరు అందుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, పదేళ్ల పాటు పోరాటం చేసిన కార్యకర్తల నుంచి కౌన్సిలర్ టికెట్లు లాక్కోవడం దుర్మార్గమన్నారు.
‘‘జీవన్‌రెడ్డి సహచరులమనే కారణంతోనే ఈ శిక్షనా.?’’ అని నిలదీశారు. గ్రీన్‌జోన్, ఇండస్ట్రియల్ జోన్ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడం నిజమేనా అని ప్రశ్నించారు. మున్సిపల్ అవినీతి, అవకతవకలకు కేంద్రంగా మారిన రాయికల్‌లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. వలసవాదులు, అవకాశవాదులకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పదవి ఉన్నా లేకపోయినా రాయికల్ అభివృద్ధికి తన బాధ్యత కొనసాగుతుందన్నారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న క్రమశిక్షణ గల కార్యకర్తగా, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పార్టీకి అండగా నిలిచిన వారికే తాను అండగా ఉంటానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, భూమారెడ్డి, నర్సయ్య, మమత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



