ప్రయివేటు బస్సు బోల్తాపడి నలుగురు మృతి
17 మందికి గాయాలు
మృతుల్లో తల్లీ కుమారుడు
ఇందల్‌వాయి మండలం గన్నారం శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘటన
అతివేగమే ప్రమాదానికి కారణం
నవతెలంగాణ-డిచ్‌పల్లి
అర్థరాత్రి.. బస్సు జర్నీలో అందరూ హాయిగా నిద్రిస్తున్నారు. అంతలోనే ఊహించని రీతిలో బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే.. ముగ్గురు ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలపాలైన వారి హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలా వెళ్తున్న ఖూరాణ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో 23 మంది ప్రయాణిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామ శివారులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం 44వ జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద బోల్తాపడింది.
డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన క్యాషన్ బోర్డ్‌ను ఢీకొని రోడ్డు ఎడమవైపునకు దిగిపోయి గుంతలో పడి బండరాయి ఎక్కింది. దాంతో కుడివైపునకు బోల్తాపడి.. కొద్దిదూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న టోల్ ప్లాజా హైవే సిబ్బంది, ఎస్‌హెచ్‌వో జి.సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్న వారిని, గాయాలపాలైన వారిని ఒక్కొక్కరిగా బయటకు తీసి ఐదు అంబులెన్స్‌లను రప్పించి చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరొకరు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. మిగతా 17 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో అకోలాకు చెందిన తల్లీ కుమారుడు మంజూషా (30), రిషి (8), బెంగళూర్‌కు చెందిన అబ్బాస్ (45), అకోలాకు చెందిన రాహుల్ (25) ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు, వారి బంధువులు మాట్లాడుతూ.. రాత్రి పది గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఈ బస్సు బయలు దేరిందని, మధ్యలో ఒక గంట భోజన విరామం సమయంలోనే డ్రైవర్ మద్యం సేవించి ఉండొచ్చని ఆరోపించారు. డ్రైవర్ మద్యం సేవించి, నిద్ర మత్తుతోనే బస్సును అతివేగంగా నడిపించి నలుగురి ప్రాణాలను బలిగొన్నాడని అన్నారు.
బస్సులో దాదాపు మహారాష్ట్రలోని నాందేడ్, అకోలా తదితర చోట్లకు వెళ్లే ప్రయాణికులే అధికంగా ఉన్నారని తెలిపారు. మృతిచెందిన కొందరి అవయవాలు బస్సులో, ఘటనా స్థలంలో పడి ఉన్నాయి. దీన్ని బట్టి ఈ ప్రమాదం తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, డిచ్‌పల్లి సీఐ కె.వినోద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి నాణ్యమైన వైద్యాన్ని అందేలా చూడాలని ఆదేశించారు.
రామచిలుకలను కాపాడిన రవాణా శాఖాధికారులు
44వ జాతీయ రహదారిపై బస్సు ప్రమాద స్థలానికి చేరుకున్న నిజామాబాద్ రవాణా శాఖ కమిషనర్ దుర్గాప్రమీల, డీటీఓ ఉమామహేశ్వర్ రావు, ఎంవీఐ కిరణ్ కుమార్‌తో కూడిన బృందం ప్రమాదానికి కారణమైన బస్సును పరిశీలించారు. బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ క్రమంలో బస్సులో రామచిలుకల చప్పుడు వినిపించగా లోనికి వెళ్లిన రవాణా శాఖ అధికారులు రామచిలుకలు కలిగిన పెట్టెను గమనించి బయటకు తీశారు. ఆ పెట్టెలో సుమారు 60కి పైగా రామచిలుకలను కుక్కినట్టుగా ఉంచడంతో ఊపిరాడక 8 రామచిలుకలు మృతిచెందాయి. దాంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటికి నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. గాయపడ్డ చిలుకలను స్థానిక పశువైద్యశాలకు తరలించారు. ఈ విషయాన్ని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారికి ఫోన్ చేసి అధికారులు తెలిపారు.



