– లంచాలు ఇచ్చిన వారికే కాంటాలు పెడుతున్నారని ఆరోపణ
– తాడిచెర్ల-మల్లారం ప్రధాన రహదారిపై ఐదు గంటలపాటు నిరసన
– రోడ్డుపైనే వంటావార్పు
నవతెలంగాణ-మల్హర్‌రావు
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనడం లేదంటూ, లంచాలు ఇచ్చిన వారికే కాంటాలు పెడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం తాడిచెర్ల-మల్లారం ప్రధాన రహదారిపై బైటాయించి బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు. సుమారు ఐదు గంటలపాటు నిరసన తెలిపారు. ఇటు తాడిచెర్ల, అటు పెద్దతూండ్ల రోడ్డుకు అడ్డంగా వాహనాలు వెళ్లకుండా ట్రాక్టర్ అడ్డంపెట్టి రోడ్డుపై టెంట్ వేసి ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనానికి వెళ్లకుండా రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. అలాగే కొయ్యూర్ ప్రధాన రహదారిపై ధాన్యం అమ్ముకోవడానికి కల్లంలో పోసి వారాలు గడుస్తున్నా కాంటాలు పెట్టే దిక్కులేదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం అమ్ముకోవడానికి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నా నిర్వాహకులు రేపు మాపు అంటూ దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం మూడుసార్లు తడిసి మొలకలు వచ్చిందని వాపోయారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి చివరిగింజ వరకు కొంటామని కంటితుడుపు చర్యగా చెప్పడమే తప్పా ఆచరణకు నోచుకోవడం లేదని అన్నారు. ఆరుగాలం కష్టపడి, వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోస్తే ధాన్యం మ్యాచర్ వచ్చినా విక్రయించడం లేదన్నారు. ధాన్యం తూకం వేయడానికి గన్నీ సంచులు ఇచ్చి వారాలు గడుస్తున్నా హమాలీలు కాంటాలు పెట్టడం లేదని తెలిపారు. లారీల కొరత ఉందంటూ నిర్వాహకులు కుంటి సాకులు చెబుతూ దాటవేస్తున్నట్టు చెప్పారు. చేసేది లేక అకాల వర్షాలకు భయపడి కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ప్రయివేటు దళారులకు అమ్మేందుకు కొందరు రైతులు ట్రాక్టర్లలో పోసుకొని పోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మెన్ ఇప్ప మొండయ్య, వైస్ చైర్మెన్ ప్రకాష్‌రావు, డైరెక్టర్ వొన్న తిరుపతిరావు, తహసీల్దార్ రవికుమార్.. రైతుల వద్దకు వచ్చి వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం గింజ లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైస్ మిల్ అలర్ట్ లేక కొద్దిగా ఆలస్యమయిందని, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో రైస్ మిల్ అలర్ట్ అయిందని, రైతులు ధాన్యం మ్యాచర్ వచ్చేలా చూడాలని, ఇప్పటివరకు ఎలాంటి కటింగ్స్ లేకుండా కొనుగోలు చేశామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ధాన్యం కొనడం లేదంటూ రోడ్డెక్కిన రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES