– రూ.400 కోట్ల మోసం.. బాధ్యులెవరైనా వదలొద్దు
– వాళ్లు ఏ పార్టీ ఉన్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
– మాజీ మేయర్ సునీల్ రావు సంచలన ఆరోపణలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ కేంద్రంగా వందల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీ కుంభకోణం జరిగిందని, దీని వెనుక పలువురు రాజకీయ పెద్దల హస్తం ఉందని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మెగా మోసంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని కాశ్మీర్ గడ్డ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్ జిల్లాలోనే సుమారు రూ.400 కోట్ల మోసం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆశ చూపి అమాయక ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ఈ కుంభకోణం వెనుక కొందరు పేరున్న రాజకీయ నాయకులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ నాయకులు ఏ పార్టీకి చెందినవారైనా, ఎంతటి వారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందులో మా పార్టీ (బీజేపీ) నాయకులు ఉన్నా వదలొద్దు’ అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో దారుణాలు
మోసపోయిన బాధితుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు రాయించుకుని వారిని మరింతగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సునీల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలను మోసం చేసి, వందల కోట్లు దేశం దాటిస్తున్న ఈ ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. మెగా, ఇండియన్ అంటూ రకరకాల పేర్లతో ఈ మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, కరీంనగర్ ఇలా అన్ని ప్రాంతాలకు ఈ మాయాజాలం విస్తరించింది’ అని ఆయన తెలిపారు.
మోసపోయిన అమాయక ప్రజల సొమ్మును రికవరీ చేసి, తిరిగి ఇప్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలీసు శాఖ ఈ విషయంపై ప్రత్యేక దష్టి సారించి, పూర్తిస్థాయిలో విచారణ జరిపితేనే ఈ మోసం వెనుక ఉన్న దొంగల ముఠా బయటపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.