రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ స్థాయిలో ప్రథమ చికిత్స అందించడంలో ఆర్ఎంపీల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుశ్రుత గ్రామీణ వైద్య సంఘం భవన వద్ద రాష్ట్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పోనుగంటి హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన 19వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. ప్రధమ చికిత్స చేయడంలో ఆర్ఎంపి వైద్యుల సేవలు చాలా అభినందనీయమని తెలిపారు. గ్రామస్థాయిలో రోగులకు ప్రధమ చికిత్స చేయడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవల గురించి వారికి అవగాహన కల్పించి వైద్య సేవలు వినియోగించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నానని తెలిపారు.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వారిని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి,సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు, వ్యవస్థాపకులు బొల్లెపల్లి శ్రీనివాసరాజు,రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు,విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్,సిపిఎం రైతు సంగం నాయకులు భాస్కర్ రెడ్డి,స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ కెమిస్ట్రీ, డ్రగ్జిస్ట్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పరమాత్మ, గోవర్ధన్ అశోక్ సత్యనారాయణ చారి,కందికట్ల లక్ష్మయ్య గౌడ్, వివిధ ప్రాంతాల ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు పలువురిని సాల్వలతో మీ మాటలతో సన్మానించారు.



