వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రజలకు మహత్తర అవకాశం
యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలెన్నో వచ్చాయి : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలుసుకునే మహత్తర అవకాశముందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టం తీవ్ర ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ చట్టం అమల్లోకి వచ్చి 20 ఏండ్లైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్, మధు సత్యం గౌడ్, కొమురయ్యతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పేదలకు, అణగారిన వర్గాలకు ఇది ఒక జీవనరేఖగా మారిందని తెలిపారు. యూపీఏ హయాంలో అటవీ హక్కుల చట్టం (2006), విద్య హక్కు చట్టం(2009), భూసేకరణ న్యాయమైన పరిహారం చట్టం (2013), ఆహార భద్రత చట్టం (2013) వంటి చారిత్రాత్మక చట్టాలను ప్రజలకు అందుబాటులో ఉంచిందని వివరించారు.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆర్‌టీఐ చట్టానికి తూట్లు పొడుస్తోందని చెప్పారు. ఆ చట్టానికి కొన్ని సవరణలు తీసుకరావడం ద్వారా సమాచార కమిషన్ల స్వతంత్రతను దెబ్బతీసిందని విమర్శించారు. ఫలితంగా ఓటరు జాబితాలు, ప్రభుత్వ నిధుల వినియోగం, ఖర్చుల వివరాలు లాంటి ప్రజా ప్రయోజన సమాచారం దాచిపెట్టే అవకాశం పెరిగిందని తెలిపారు. కేంద్ర సమాచార కమిషన్‌లో 11 మంది కమిషనర్లు ఉండాల్సిన చోట ప్రస్తుతం ఇద్దరితోనే నడుస్తున్నదని చెప్పారు. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉందన్నారు. ఈ చట్టం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్న ఎంతో మంది ఆర్‌టీఐ కార్యకర్తలు హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.