డాలర్‌తో పోల్చితే రూ.91కి క్షీణత
భారత చరిత్రలోనే రికార్టు కనిష్టం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ అధ్వాన్న స్థాయికి పడిపోయింది. పతనంలో మరో నూతన రికార్డ్‌ను చవి చూసింది. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 91 మార్క్‌కు పతనమయ్యింది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పంద అనిశ్చితి, విదేశీ సంస్థగత మదుపర్లు తమ నిధులను తరలించుకుపోవడం, పడిపోతోన్న రూపాయిని కాపాడటంతో మోడీ సర్కార్, రిజర్వ్ బ్యాంక్ విఫలం కావడంతో రూపీ ఆల్‌టైం కనిష్ట స్థాయిని చవి చూసింది. డిసెంబర్ 16న డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 23 పైసలు కోల్పోయి 91.01కి దిగజారింది.
ఫారెక్స్ ఎక్సేంజీ మార్కెట్‌లో ఉదయం 90.87 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 36 పైసలు కోల్పోయి 91.14కి చేరి.. ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టాన్ని చవి చూసింది. ఇంతక్రితం సోమవారం 29 పైసలు తగ్గి 90.78 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 0.61 తగ్గి 60.19 డాలర్లుగా నమోదయ్యింది. మార్కెట్ల వరుస పతనం, తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు భారత కరెన్సీని దిగజారేలా చేస్తోన్నాయి. సోమవారం సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,468.32 కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి. గడిచిన 10 సెషన్లలో డాలర్‌తో రూపాయి 90 నుంచి 91కి క్షీణించింది. క్రితం ఐదు సెషన్లలోనే భారత కరెన్సీ 1 శాతం విలువ కోల్పోయింది.
రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతులను తీవ్ర భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం అమాంతం పెరిగిపోనుంది. భారత్‌పై అమెరికా వేసిన భారీ టారిఫ్‌లకు తోడు, విదేశీ నిధుల బయటకు తరలిపోవడం, డాలర్ల కొనుగోళ్లకు దిగుమతిదారులు మొగ్గు చూపడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో మోడీ సర్కార్ విఫలం కావడం తదితర పరిణామాలు దేశీయ కరెన్సీని అగాథంలోకి నెట్టుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. రూపాయి ప్రతికూల సంకేతాలతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 533.50 పాయింట్లు లేదా 0.63 శాతం పతనమై 84,680కి దిగజారింది. నిఫ్టీ 167 పాయింట్ల నష్టంతో 25,860కి పరిమితమయ్యింది.




