ఇంట్రాడేలో డాలర్ ఏ 92.02
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి నూతన రికార్డ్ కనిష్టాన్ని చవి చూసింది. చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో ఏకంగా 92.02కు పతనమయ్యింది. స్టాక్ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థగత మదుపర్లు వరుసగా తమ నిధులను తరలించుకుపోవడం, అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి తదితర పరిణామాలు రూపాయిని అగాథంలోకి నెట్టుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే జనవరి 30న ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి 91.89 వద్ద తెరుచుకుంది. ఓ దశలో 92.02 కనిష్ట స్థాయిని చవిచూడగా.. తుదకు ఇంతక్రితం సెషన్‌తో పోల్చితే 2 పైసలు పెరిగి 91.97 వద్ద ముగిసింది. ఇంతక్రితం జనవరి 23న 92 కనిష్టాన్ని తాకింది. జనవరిలో ఇప్పటి వరకు 2.5 శాతం వరకు బలహీనపడింది. 2025లో 5 శాతం పడిపోయింది. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతులను తీవ్ర భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం అమాంతం పెరిగిపోనుంది.



