పేదలపై మరింత ప్రభావం
‘వీబీ- జీ రామ్ జీ’తో కేంద్రానికి విస్తృత అధికారాలు
గాంధీ పేరును తీసివేయటం సరికాదు : కేరళ, తమిళనాడు, కర్నాటక, హిమాచల్ సీఎంలు
న్యూఢిల్లీ : మోడీ సర్కారు తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు (వీబీ-జీ రామ్ జీ)పై అన్ని పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ బిల్లుపై నాలుగు ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది గ్రామీణ పేదల పరిస్థితిని మరింత దారుణం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలి, వలసల నుంచి రక్షించే చివరి కవచాన్ని బలహీనపరుస్తుందని కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను రద్దు చేస్తుందనీ, నిధుల కేటాయింపు, అమలు ప్రాంతాలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్య విధానంలో మార్పులపై కేంద్రానికి విస్తృత అధికారాలు ఇస్తుందని వారు పేర్కొన్నారు.
చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు. ”గాంధీజీ పేరును తీసివేయడం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్వభావాన్ని బలహీనపర్చడం ద్వారా సంఘ్ పరివార్ గాంధీ వారసత్వం పట్ల, శ్రమ ద్వారా గౌరవం అనే ఆలోచన పట్ల తన శత్రుత్వాన్ని చూపుతోంది” అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. పంటకాలంలో తప్పనిసరిగా 60 రోజుల విరామం నిబంధన గ్రామీణ సంక్షోభాన్ని పెంచి, ఉపాధి అస్థిరతకు దారి తీస్తుందన్న ఆయన హెచ్చరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఈ బిల్లును అమలు చేయొద్దని కోరారు.
ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపి, లక్షలాది మంది పేద గ్రామీణ కార్మికుల జీవనాధారాన్ని దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్దేశించే ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలవారీగా నిధుల పరిమితులను నిర్ణయించే అధికారాలను కేంద్రానికి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడులో వాతావరణ, భౌగోళిక పరిస్థితుల కారణంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుందనీ, జనాభా వంటి అంశాల ఆధారంగా ఖర్చులకు పరిమితి విధిస్తే పని దినాలు, వేతనాలు తగ్గి కార్మికులు ఇబ్బందులు పడతారని వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన 60:40 నిధుల విధానం రాష్ట్రాలకు అదనపు భారంగా మారుతుందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించి కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టును రాసుకొచ్చారు. ఈ బిల్లు గ్రామీణ పేదలకు, ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే పరిణామమని పేర్కొన్నారు.
”దాదాపు రెండు దశాబ్దాల పాటు కోట్లాది గ్రామీణ కుటుంబాలకు పని హక్కును కాపాడిన చట్టాన్ని సరైన చర్చ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపకుండా, స్టాండింగ్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను పట్టించుకోకుండా బలవంతంగా ఆమోదించారు. ప్రజల జీవనాధారాలపై ఇంత పెద్ద మార్పును ఇలా అమలు చేయకూడదు” అని వివరించారు. ఉపాధి చట్టం కార్మికులకు గౌరవం, సంక్షోభ సమయాల్లో ఆదాయ భద్రత కల్పించిందని పేర్కొన్నారు. ఇకపై ఉపాధి ఢిల్లీ నుంచి జరిగే కేటాయింపులు, నోటిఫికేషన్లు, కేంద్రం వినియోగించే స్వేచ్ఛా అధికారాలపై ఆధారపడి ఉంటుందని ఆరోపించారు. ఈ వివాదాస్పద బిల్లును హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ కూడా వ్యతిరేకించారు. ఇది కష్టపడి పని చేసే ప్రజల హక్కులను హరించే ప్రయత్నమని వ్యాఖ్యానించారు.



