– కాటారం తహసీల్దార్ నాగరాజు
నవతెలంగాణ – కాటారం
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సామాన్య ప్రజల చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన బ్రహ్మాస్త్రమని కాటారం తహసీల్దార్ నాగరాజు పేర్కొన్నారు. సోమవారం కాటారం మండల తహసీల్దార్ కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత పెరుగుతుందని, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కట్టడి చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఆర్‌టీఐని సమర్థంగా వినియోగించుకుంటే మంచి పాలన సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ (యుఎఫ్) కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, సభ్యుడు బూడిద రాజ సమ్మయ్యతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



