తమ కాలం కంటే ముందుండే వాళ్లను దార్శనికులంటాం. జీవిత కాలంలోనే అందరి అభిమానం చూరగొనగలిగిన వాళ్లను అగ్రనాయకులంటాం. సవాళ్లు, సమరాలలో ముందుండేవాళ్లను సాహసికులంటాం. ధన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించ గలిగిన వాళ్లను త్యాగులంటాం. చేయవలసిందేమిటో, ఎందుకో స్పష్టంగా చెప్పగలవాళ్లను సిద్ధాంతకారులంటాం. ఇందులో ప్రతి నిర్వచనమూ భగత్‌సింగ్‌కు వర్తిస్తుంది. భగత్‌సింగ్ అంటే శాండర్స్ (స్కాట్) హత్య, పార్లమెంటులో బాంబు ప్రయోగం, ధైర్యంగా ఉరికంబమెక్కడం గుర్తుకురావచ్చు. నిజానికి నెత్తిమీద టోపీతో మన మనసులలో స్థిరపడిన భగత్‌సింగ్ ఇమేజికన్నా ఆయన ఉజ్వల జీవితం ఎన్నో రెట్లు విశిష్టమైనది, విప్లవాత్మకమైనది. ఆయన సమరశీల జీవితం, సమగ్ర అవగాహన, సంయమనం నిండిన ఆచరణ ఆ కాలానికి అనితర సాధ్యమైనవి.
భగత్‌సింగ్(1907 సెప్టెంబర్ 27), సుఖదేవ్(1907 మే 15 పుట్టుక), రాజ్‌గురు(1908 ఆగష్టు 24)లను 1931 మార్చి 23నే ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటికి వారికి ఇరవై మూడేళ్లు మాత్రమే. ఆ బలిదానం దాదాపు వందేళ్లయినా ఇప్పటికీ ఆ వీరుల పేర్లు ప్రజలను ఉత్తేజపరుస్తూనే వున్నాయి. అవిభక్త పంజాబ్‌లోని పైసలాబాద్ జిల్లాలో పుట్టిన భగత్ సింగ్ తండ్రి కిషన్‌సింగ్, తల్లి విద్యావతి. ఆయన తండ్రి పినతండ్రి కూడా స్వాతంత్రోద్యమంతో సంబంధం వున్నవారే. ఇక సుఖదేవ్ కూడా పంజాబ్‌లోని లూధియానా సమీపంలో రామ్‌లాల్ థాపర్, రాల్లిదేవిలకు జన్మించారు. పూనేలో పుట్టిన రాజ్‌గురు తండ్రి హరినారాయణ అతని బాల్యంలోనే చనిపోగా తల్లి పార్వతీదేవి పెద్దకుమారుడు దినకర్ సాయంతో అతన్ని పెంచి పెద్దచేసింది. స్వాతంత్రోద్యమ ప్రభావంతో వీరంతా చిన్నప్పుడే చైతన్య వంతమైన భావాలు అలవర్చుకున్నారు. వారిని అర్థం చేసుకోవాలంటే స్వాతంత్రోద్యమ క్రమాన్ని పరిశీలించాలి. ఇప్పటికీ వర్తించే పాఠాలు తీసుకోవాలి.
దక్షిణాఫ్రికాలో వివక్షతకు వ్యతిరేకంగా సత్యాగ్రహం నడిపి అనుభవం గడించిన గాంధీజీ 1915లో స్వదేశానికి తిరిగొచ్చారు. రైతులు, కార్మికుల కొన్ని సమస్యలపైన సత్యా గ్రహాలు చేసి ఫలితాలు సాధించారు. అవి ప్రజలను చేరువచేశాయి. అలాంటిస్థితిలో నిరంకుశ రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆ సందర్భం గానే 1919 ఏప్రిల్ 17న పరమ దుర్మార్గమైన జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగింది.దీనిపై తీవ్ర నిరసన రగుల్కొంది. అదే ఏడాది నవంబర్‌లో టర్కీలో ఖలీఫాను కూలదోయడం ముస్లింలకు చాలా ఆగ్రహం కల్గించడంతో గాంధీజీ ”ఖిలాఫత్” ఉద్యమానికి పిలుపునిచ్చారు.
ఆ ఉద్యమంలో మొదటిసారిగా హిందూ ముస్లింలు భుజంభుజం కలిపి పాల్గొన్నారు. 1922 నవంబర్‌లో వేల్సు యువరాజు రాకకు నిరసన కార్యక్రమాలపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. దానిపై పెద్దఎత్తున సత్యాగ్రహోద్యమానికి గాంధీజీ పిలుపు నిచ్చారు. ఆ పోరాటం సందర్భంలో చౌరీచౌరాలో పోలీసుల దుర్మార్గాలపై ఆగ్రహించిన రైతులు వారిని సజీవ దహనం చేశారనే కారణంగా గాంధీజీ ఉద్యమాన్ని హఠాత్తుగా విరమించడం ప్రజలను నిరుత్సాహానికి గురిచేసింది. నిరుత్సాహాన్ని సాకుగా చూపి మితవాదులు బ్రిటీష్ ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకోవాలంటూ స్వరాజ్యపార్టీగా ఏర్పడ్డారు. దాన్ని ఆమోదించలేని యువకులు అనేకమంది విప్లవమార్గం వైపు ఆకర్షితులయ్యారు.
1924లో అలాంటివారు కాన్పూర్‌లో సమావేశమై హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించారు. 1925 ఆగష్టులో కాకోరి దగ్గర రైలును నిలిపివేసి సంపద కొల్లగొట్టారు. అందులో పాల్గొన్న నలుగురిని ఉరితీయగా 17మంది యావజ్జీవ శిక్షకు గురయ్యారు. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తప్పించుకోగలిగారు. 1920-25లోనే దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ నాయకత్వం ప్రజల సమరశీలతకు తగినట్లు స్పందించని స్థితిలో మత తత్వశక్తులు చెలరేగాయి. ముస్లింలీగ్-హిందూ మహాసభ ప్రజల ఐక్యతకు గండికొట్టాయి. వీటన్నిటిపైనా భగత్‌సింగ్ పరిశీలన జరుపుతూనే వున్నారు.
భగత్‌సింగ్ స్పష్టత
1928నాటికి కాంగ్రెస్ మళ్లీ పన్నుల నిరాకరణోద్యమానికి పిలుపు నిచ్చింది. అదే అక్టోబర్‌లో హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, శివవర్మ, సుఖదేవ్ తదితరుల నాయకత్వాన ఏర్పడింది. పేరు మార్పు కూడా భగత్ సింగ్ సూచనపై జరిగిందే. మత రాజకీయాలతో ఏ మాత్రం ప్రమేయం వుండరాదని తొలి విధానంలోనే స్పష్టం చేశారు. అంతకుముందు కాలంలో దుర్గాదేవి ముందు రక్త ప్రమాణంతో సహా జాతీయ విప్లవకారుల మార్గం ఆవేశ ప్రధానంగా ఉండేది. దాన్ని సంఘటిత పరిచి దానికి ఒక ఏక రూపతను, భావ స్పష్టతను కలిగించారు. భగత్‌సింగ్‌కు దేశ స్వాతంత్య్రం అధికార మార్పిడి తోనే పూర్తికాదని బాగా తెలుసు. దానికోసం పోరాడేందుకు అహింసను మంత్రంగా వల్లించడమూ మార్గం కాదు. అలా అని ఆయన వ్యక్తిగత హింసకే పట్టం కట్టాలని అనుకోలేదు. అతి చిన్న వయసు లోనే అపారమైన అధ్యయనం చేసిన ఆయన భారత ప్రజల విమోచనకు సోషలిజమే మార్గమన్న అవగాహనకు వచ్చాడు. హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీగా ఏర్పరచారు. అక్టోబర్ విప్లవానికి స్వాగతం పలికాడు.
అక్కడ లెనిన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలను లోతుగా అధ్యయనం చేశాడు. అందుకు విప్లవానికే అంకితమైన కార్యకర్తలు ఉండాలని ప్రతిపాదించారు. భారత కమ్యూనిస్టు పార్టీ కూడా బలపడని రోజులలోనే భగత్‌సింగ్ అంతటి పరిపక్వత ప్రదర్శించడం అపూర్వమే. హెచ్‌ఎస్‌ఆర్‌ఎ ఏర్పడిన మరుసటి నెలలోనే అంటే 1928 అక్టోబర్‌లో సైమన్ కమిషన్ పర్యటనకు నిరసనగా దేశమంతటా సైమన్ గోబ్యాక్ ఉద్యమం నడిచింది.లాహోర్‌లో ఆ ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న లాలా లజపతి రాయ్ పై పోలీసులు క్రూరంగా లాఠీచార్జికి పాల్పడ్డారు. లాలాజీ భగత్‌సింగ్‌కు రాజకీయ గురువుకూడా. ఆ దెబ్బలతో ఆయన కొద్ది రోజులలోనే చనిపోవడం వారిని ఆగ్రహోద్రోగులను చేసింది.లాఠీచార్జికి కారుకుడైన సాండర్స్‌ను భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు చంపేశారు. ఒక వ్యక్తిని చంపాల్సివచ్చినందుకు బాధపడుతున్నా అమానుషాన్ని ప్రతిఘటించేందుకు చంపాల్సి వచ్చిందని పోస్టర్ కూడా వేశారు.
టెర్రరిస్టును కాను…
తర్వాత ఘట్టం పార్లమెంటుపై బాంబు దాడి. ప్రజా భద్రతా చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టం రెండు ప్రజల ఉద్యమాన్ని అణచివేయడానికి వచ్చాయి. వాటికి నిరసనగా భగత్‌సింగ్ పార్లమెంటులో బాంబులు విసరాలని ప్రతిపాదించడమే కాక అందుకు తానే వెళ్తానని పట్టుపట్టాడు. బాంబులు వేశాక దొరికిపోయి తమ భావాలు లోకానికి చాటాలని నిర్ణయించుకున్నారు గనుక ఆ పనికి ఆయన్ను పంపడానికి సహచరులు ఒప్పుకోలేదు. చంద్రశేఖర్ అజాద్ వచ్చాక ఆయన సహాయంతో మరోసారి చర్చ చేయించి తనే వెళ్లేలా నిర్ణయం మార్పించాడు. పార్లమెంటులో అమాయకులకు ముఖ్యంగా భారతీయులకు ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పొగబాంబులు మాత్రమే తీసుకెళ్లాడు.
వాటిని విసిరి కలకలం సృష్టించిన తరువాత కరపత్రాలు విసిరి పారిపోవడానికి అవకాశమున్నా విప్లవం వర్థిల్లాలి అని నినదిస్తూ అనుకున్న ప్రకారమే దొరికిపోయాడు. తర్వాత కోర్టులో తన చర్యను సమర్థించుకుంటూ తాము ప్రాణాలకు చాల విలువనిస్తామని అనవసరంగా చంపబోమని స్పష్టీకరించాడు. విప్లవానికి ఆధారం ప్రజా బలమేనని చాటి చెప్పాడు. కొద్దికాలం తప్ప తానెప్పుడూ టెర్రరిస్టుగా లేనని ప్రకటించాడు. ఇప్పుడు దేశంలో మనం చూస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భగత్ సింగ్ నాడే చెప్పిన ఈ పాఠాలు ఎంతైనా విలువైనవి.
ఆఖరిదాకా అధ్యయనం
త్యాగం, సాహసం రెండురకాలని అంటూ ఉరికంబ మెక్కడం కంటే చివరి వరకూ ప్రజల కోసం పనిచేయడంలోనే అత్యధిక త్యాగం ఉన్నదని చెప్పడం ఆయన నమ్రతకు వాస్తవికతకు నిదర్శనం. తనను ఉరితీస్తారని తెలిసిన తర్వాత కూడా పుస్తకాలు ఆపకుండా చదవడమేకాదు – ఫలానా గ్రంథాలయంలో ఫలానా పుస్తకం దొరుకుతుంది తెచ్చిపెట్టమని మిత్రులకు ఉత్తరం రాయడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత దృఢమైందో అర్థమవుతుంది. జైలు సూపరింటెండెంట్ ఒకసారి సహచరులకు చివరిసారిగా భగత్‌సింగ్‌ను కలుసుకునే అవకాశం కలిగించాడు. వారిలో ఒకరైన జయదేవ్ కపూర్ ‘సర్దార్, నీవు చనిపోవడానికి ఇక సిద్ధంగా వున్నావు. ఇందుకు నీవేమీ విచారించడం లేదా?’ అని అడిగితే, దానికాయన బిగ్గరగా నవ్వి ‘విప్లవ పథంలో అడిగిడునప్పుడే నా ప్రాణాలర్పించి దేశమంతటా ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్థిల్లాలి అనే నినాదాన్ని వ్యాపింపపచేయగలిగితే జీవితం ధన్యమైపోతుందనుకున్నాను.
ఈనాడు జైలుగదిలో కూర్చున్నప్పటికీ కోట్లాది మన ప్రజల కంవం నుండి వెలువడుతున్న ఆ నినాదాన్ని వినగలుగుతున్నాను. ఈ నా నినాదం స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉద్దీపింప చేసే శక్తిగా, సామ్రాజ్యవాదులను చివరివరకూ దెబ్బతీస్తూనే ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇంత చిన్న జీవితానికి ఇంతకన్నా మరేం కావాలి?’ అన్నాడు. ఆయనతో పాటు సుఖదేవ్,రాజ్‌గురు ఉరికంబాలెక్కగా వారికి ఎంతో ప్రియమైన చంద్రశేఖర్ ఆజాద్ కొంతకాలం తర్వాత పోరాటంలో మరణించారు. 1931 మార్చిలో కుదిరిన గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం రాజకీయ ఖైదీలు విడుదల చేయబడ్డారు. కాని భగత్‌సింగ్, సుఖ్‌దేశ్, రాజ్‌గురుల ఉరిశిక్ష రద్దుపై గాంధీజీ పట్టుబట్టకపోవడం ప్రజలకు చాలా ఆగ్రహం కలిగించింది. ఇప్పటికీ ఆ అసంతృప్తి కొనసాగుతూనే వుంది.
వారిని రహస్యం గా ఉరితీసిన బ్రిటిష్ ప్రభుత్వం మృతదేహాలను కూడా ఇచ్చేందుకు జంకింది. సట్టెజ్ నదీ తీరంలో వారి సమాధులు నిర్మించబడ్డాయి. భాస్వరాన్ని నీటిలో నిల్వచేసినట్టు ఈ విప్లవకారుల సమాధులు నదిలో కట్టారని ఆరుద్ర కవిత రాశారు. భారతీయులందరి హృదయాలలో విప్లవపతాకగా ప్రతీకగా నిలిచిపోయారు. నాటి ఆయన సహచరులలో చాలామంది తర్వాతి కాలంలో కమ్యూనిస్టులయ్యారు. రాజమండ్రి జైలులో సుందరయ్య గారు వారిని కలుసుకుని ప్రేరణ పొందారు. ఆ బృందంలోని అజరుఘోష్ తర్వాత ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కాగా శివవర్మ వంటివారు సీపీఐ(ఎం)లో కీలక పాత్ర వహించారు.ఆ విధంగా తమ మిత్రుడి ఆశయాలు నిజం చేస్తూ ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు.ఇప్పటికీ భగత్‌సింగ్ బృందాన్ని తల్చుకుంటేనే విప్లవోత్తేజం మదిలో నిండుతుంది. స్వాతంత్రోద్యమ క్రమంలో వచ్చిన నినాదాలన్నిటిలోకి సంపూర్ణమైంది, ఇంకా సాధించవలసింది అదే- ఇంక్విలాబ్ జిందాబాద్.
(మార్చి 23 భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు ఉరితీయబడిన రోజు)
తెలకపల్లి రవి
ఆ ముగ్గురి బలిదానం – ‘ఇంక్విలాబ్’ నినాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



