– ప్రభుత్వానికి గిరిజన సంఘాల డిమాండ్
– తెలంగాణ సాయుధ పోరాట వీరుడి జయంతి
– గిరిజన సాయుధ పోరాట వీరుల వర్ధంతులను అధికారికంగా నిర్వహించలి
– గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతి రామ్ నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన దొడ్డి కొమురయ్య అనంతరం రెండో దశ పోరాటాన్ని నడిపిన ప్రముఖ నాయకుడు కామ్రేడ్ తాను నాయక్ అని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతి రామ్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాను నాయక్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1950 మార్చి 20న విష్ణూర్ దేశ్ముఖ్ నర్సింగ్ రావు దొరలు తాను నాయక్‌ను బండి చక్రాలకు కట్టి తుపాకులతో కాల్చి హతమార్చారని తెలిపారు.
గిరిజనుల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహా వీరుడని కొనియాడారు. జనగామ జిల్లా ముండ్రాయి గ్రామానికి చెందిన తాను నాయక్ గిరిజనులకు భూమి దక్కేందుకు చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించారని, ఆయన కుటుంబమంతా సాయుధ పోరాటంలో పాల్గొన్నదని గుర్తుచేశారు. ఇటువంటి వీరుల నాయకత్వాన్ని ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తాను నాయక్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గిరిజనుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సాగునీరు, తాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కొన్ని పథకాలతో మాత్రమే ప్రజలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాబోయే బడ్జెట్ సమావేశంలో కనీసం రూ.30 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పపువ్వు చెట్ల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వాలని, గిరిజనులకు హక్కులు కల్పించాలని కోరారు. గిరిజన హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను త్వరలో రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నేనావాత్ గణేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ వినోద్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. మోతీరాం నాయక్, రాష్ట్ర సహా కార్యదర్శి కే. మోతి సింగ్ నాయక్, బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, కోశాధికారి లస్కర్ నాయక్, ప్రేమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



