Friday, February 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఈ దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింప జేసిన త్యాగధనులు!

ఈ దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింప జేసిన త్యాగధనులు!

- Advertisement -

చదువు వ్యాపారమైపోయింది. కళలు అమ్ముడుపోతున్నాయి. స్నేహానికి, అనుబంధానికి కొత్త అర్థాల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. భాషా సంస్కృతులు బీటలు వారుతున్నాయి. మనిషి మాత్రం దిన దినమూ పురోగమిస్తున్నాడు. నిజమే! కాని, ఆ పురోగమనం భారతీయ విలువల్ని నిలబెట్టగలుగుతోందా? ఆలోచించాల్సిన విషయం! యువతరానికి ఏవో కొన్ని ధ్యేయాలు ఏర్పరచి, వారిని వాటిచుట్టూ తిరిగే విధంగా చేస్తున్నారు కదా తల్లిదండ్రులు? నిజానికి డాక్టర్లు, ఇంజనీర్లు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులతో సమాజం ఆరోగ్యవంతమైపోదు కదా? ఆరోగ్య వంతమైన ఆలోచనలు గల వ్యక్తులతో సమాజం ఆరోగ్యవంతమవుతుంది. వృత్తిపరంగా ఎదిగినా -వ్యక్తులు చాలామంది, ఎదగకుండా కుంచించుకుపోయి బతుకుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. తమలోని ఆంధ విశ్వాసాల్ని అట్టడుగుకు తొక్కేస్తూ, విశాల హృదయులై, స్వేచ్ఛాలోచనతో, వివేచన గల బాధ్యత గల పౌరులుగా ఎదగగలగాలి!

మన ముందు తరాల వారిని, వారి జీవన శైలిని గమనిస్తే, మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి మన ప్రయాణం ఎలా సాగుతూ వచ్చిందో తెలుస్తుంది! మన ముందు తరాలలో కొంతమంది, ఏ వృత్తిలో రాణించినా, వ్యక్తులుగా అద్వితీయంగా నిలబడ్డారు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలోని కొంతమంది భారతీయుల జీవితాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే – వారు గొప్ప వ్యక్తులుగా, కళాకారులుగా, వైజ్ఞానికులుగా ఎలా నిలబడ్డారన్నది తెలిసిపోతుంది. వ్యక్తిత్వ వికాస దిశలో వారి పరిణతి అవగతమవుతుంది. ఎక్కడా ఏ అవకాశమూ లేని రోజుల్లో – బీదతనంలో కొట్టుమిట్టాడుతూ కూడా ఏ చిన్న అవసరానికైనా వారు ఎంతగానో సంఘర్షించాల్సి వచ్చింది. వారి వైజ్ఞానిక పరిశోధనల గురించి తెలుసుకుంటూనే, వాళ్లు వ్యక్తులుగా ఎలా మహోన్నతులయారు? అనేది మనం గ్రహించాలి.

మనం మన ముందు తరం వారికి తెలియజేస్తూ ఉండాలి! సాధారణ శకానికి పూర్వ ఆరవ శతాబ్దం (బిసిఇ) లో సుశ్రుతుడు ముందు చూపుతో శస్త్రచికిత్స పరికరాలు తయారు చేయకపోతే, ఆ తరువాత, ఆరువందల ఏళ్లకు చరకుడు ఆయుర్వేద గ్రంథాన్ని పరిష్కరించకపోతే, గణిత శాస్త్రంలో వర్షం, వర్గమూలం, ఘనం, ఘనమూలం త్రిభుజ వైశాల్యం మొదలైనవన్నీ ఆర్యభట్టు ప్రస్తావించక పోతే – మనం ఈరోజు ఇలా ఉండేవాళ్లం కాదు. కంప్యూటర్లు, కాలిక్కులేటర్లు లేని కాలంలో, ఆర్యభట్టు అంతటి విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా గ్రంథస్తం చేయగలిగాడన్నది ఎంతో విస్మయం కలిగించే విషయం. ఆర్యభట్టు గ్రహణాలకు భయపడమని చెప్పలేదు కదా? మరి ఎందుకు ఈ ఆధునిక యుగంలో మనుషులు భయపడుతున్నారూ?

”చాదయతి శశీ సూర్యం
శశినం మహతీ చ భూచ్ఛాయా||”
అంటే- చంద్రుడు – సూర్యుడినీ… గొప్పదైన భూఛాయ చంద్రుడినీ కప్పేస్తాయి అని అర్థం! (ఆర్య భటీయం, గోళపాద, 37వ శ్లోకం).
రాహుకేతువులు సూర్యచంద్రులని మింగివేయడం వల్ల గ్రహణాలు సంభవిస్తున్నాయని అందరికందరూ భావిస్తున్న రోజుల్లో – సూర్యగ్రహణం చంద్రుడి వలన, చంద్రగ్రహణం భూమి యొక్క నీడవలన సంభవిస్తున్నాయని ఆర్యభట్టు చెప్పాడు. పదిహేను వందల ఏళ్లకు పూర్వమే ఆయన ఈ జ్ఞానాన్ని అందించినా, ప్రజలు నేటికీ గ్రహణాలకు భయపడుతున్నారు- అజ్ఞానులైన జ్యోతిష్య పండితుల- స్వార్థపరులైన మనువాదుల – బ్రాహ్మ నిజపు వికృతక్రీడల్లో – ఇది ఒకటి అయ్యింది!

సాధారణ శకం 630లలో భూమికి ఆకర్షణశక్తి ఉందని చెప్పిన బ్రహ్మగుప్తుడు, ఖగోళ శాస్త్రానికి సంబంధించి కొన్ని సూత్రీకరణలు చేశాడని చెపుతారు. కానీ, వెయేళ్ల తర్వాత ఈ విషయం మీద ఐజాక్‌ న్యూటన్‌ చెప్పిన విషయాలు ప్రపంచం స్వీకరించింది. సా.శ. 1840 ప్రాంతంలోనే గజల్‌ భాషను సైన్సులోకి మళ్లించి, మూఢ నమ్మకాల నిర్మూలనకు నిరంతరం కృషిచేశాడు మాస్టర్‌ రామచంద్ర (1821-1880) ఈయన ఢిల్లీ కాలేజిలో టీచర్‌గా ఉండేవాడు. డాక్టర్‌ మహేంద్రలాల్‌ (2 నవంబర్‌ 1833 -23 ఫిబ్రవరి 1904) అలోపతిక్‌ డాక్టరే అయినా, హోమియో వైద్యవిధానాన్ని ప్రోత్సహించాడు. ఈయన శాస్త్రీయ జిజ్ఞాసువే కాదు, గొప్ప సాహిత్య ప్రియుడు కూడా!1860లలో శాస్త్రీయ పరికరాలు లేకుండా, కేవలం తన బుద్ధి బలంతో, ఊహాశక్తితో, కొండ ఎత్తును సామంత చంద్రశేఖర్‌ (1835-1904) అనే గణిత శాస్త్రవేత్త నిర్ధారించగలిగాడు. అంతేకాదు, అమెరికాలో రాబోయే సూర్యగ్రహణాన్ని ఖచ్చితంగా లెక్కగట్టగలిగాడు.

ఒక నాటకానికి ఉన్నంత జనాదరణని సరళవిజ్ఞాన శాస్త్రానికి కల్పించడం రుచి రామ్‌ సాహ్ని (5 ఏప్రిల్‌ 1863 -3 జూన్‌ 1948)కి మాత్రమే వీలయ్యింది. ఈయన ప్రఖ్యాత భారతీయ వృక్ష శాస్త్రవేత్త బీర్బల్‌ సాహ్నికి తండ్రి. దేశం విడిపోక ముందు, పంజాబ్‌ ప్రాంతంలో పనిచేసిన రుచిరామ్‌ సాహ్ని విద్యావేత్తగా, వైజ్ఞానికుడిగా గొప్ప కృషిచేశాడు. అనువైన రీతిలో సైన్సు పరికరాలకు రూపకల్పన చేసి, వాటిని తయారు చేయించి, వాడుకలోకి తెచ్చాడు. వృక్షాలు స్పందించగలవని చెప్పిన జగదీశ్‌ చంద్రబోస్‌ (30 నవంబర్‌ 1858- 23 నవంబర్‌ 1937) వృక్ష శాస్త్రవేత్త కాదు, నిజానికి ఆయన భౌతిక శాస్త్రవేత్త! ఆయనకు కళ్లంటే ఇష్టం. కవిత్వమంటే చెవి కోసుకునేవాడు. విశ్వకవి రవీంద్రుడికి సన్నిహిత మిత్రుడు.

పదవుల కోసం పాకులాడే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ప్రఫుల్ల చంద్ర రే (2 ఆగష్టు 1861-16 జూన్‌ 1944) జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మహాత్మా గాంధీ అంతటివాడు అతణ్ణి వెతుక్కుని వెళ్లి నమస్కరించాడు. అతనికి వచ్చే ఎనిమిది వందల జీతంలో కేవలం నలభై రూపాయలు స్వంత ఖర్చులకు ఉంచుకుని, మిగిలినదంతా ప్రజల కోసం ఖర్చుచేసిన వాడు పి.సి.రే. ఆ నాటి పరిస్థితులను గమనించి SCIENCE CAN WAIT, BUT SWARAJ CAN NOT – అనే నినాదంతో స్వాతంత్రోద్యమంలోకి దూకిన శాస్త్రవేత్త ఆయన! ఇకపోతే, పంజాబ్‌ రసాయనిక శాస్త్రవేత్త పూరణ్‌సింగ్‌, గొప్ప మానవవాది, దార్శనికుడు. ఈయన 1881 – 1931 మధ్య కాలంలో జీవించినవాడు.

”భారతరత్న ఇచ్చారు కదా అని ఎప్పుడూ మీ ప్రభుత్వాన్ని పొగడుతూ ఉంటానని అనుకోవద్దు. వాస్తవాలు ఖచ్చితంగా బయటపెడుతూ ఉంటాను.”- అని నెహ్రూ అంతటి వాడితో నిక్కచ్చిగా వ్యవహారం నడిపినవాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య (15 సెప్టెంబర్‌ 1861 – 14 ఏప్రిల్‌ 1962). అర్భాటాలకూ, ప్రచారాలకూ విలువ ఇవ్వకుండా సామాన్యుల్లో సామాన్యుడిగా బతికిన దేవేంద్ర మోహన్‌బోస్‌ (1885-1975)కు ఒక దశలో నోబెల్‌ పురస్కార గ్రహీత పావెల్‌ వినమ్రంగా ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడూ? పోర్ట్‌ట్రస్ట్‌లో గుమస్తాగా పనిచేసే శ్రీనివాస రామానుజన్‌ (22డిసెంబర్‌ 1887- 26 ఏప్రిల్‌ 1920) గణితశాస్త్ర సూత్రీకరణలు ఎలా చేయగలిగాడు? విదేశాలలో చదవకుండానే, ప్రపంచంలోని పెద్ద పెద్ద ప్రయోగశాలలు సందర్శించకుండానే, తనకు తానుగా ఒక కాకలుతీరిన శాస్త్రవేత్తగా తయారై, నొబెల్‌ సాధించగలగడం సి.వి.రామన్‌ (7 నవంబర్‌ 1888 – 21 నవంబర్‌ 1970)కు ఎలా సాధ్యమైంది? వంటి విషయాలు తెలుసుకుంటే ఆనాటి మహనీయుల వ్యక్తిత్వాలు స్పష్టంగా అర్థమవుతాయి.

రికార్డుల కోసం వెర్రి మొర్రి పనులు చేస్తున్న నేటి యువతరం, రామన్‌ జీవితంలోని రికార్డులను ఛాలెంజ్‌ చేయగలరేమో తేల్చుకోవాలి! ఆయన ఆర్థికశాఖలో ఉద్యోగం చేస్తూ భౌతిక శాస్త్రంలో నోబెల్‌స్థాయి పరిశోధనలు చేశారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే, చాలా వాటిని వదులుకోక తప్పదు – అన్నది ఆయన జీవితం చెపుతుంది. కరువులు ఎందుకొస్తాయీ? తుపానులు ఎందుకొస్తాయి ? దారిద్య్రానికి అంతం ఎక్కడా? అని బాల్యంలోనే ఆలోచించిన మేఘనాథ్‌ సాహా, ఆ తరువాత కాలంలో దేశ వైజ్ఞానిక ప్రగతికి దోహదపడే ప్రణాళికల్ని తయారు చేయగలిగాడు. 1893 – 1956 మధ్యకాలంలో జీవించిన సాహా, ప్రాచీన తాళపత్ర గ్రంథాల అధ్యయనం కూడా కొనసాగించారు.

ఇక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ (21 ఫిబ్రవరి 1894-1జనవరి 1955) కరైకుడి గ్రామంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయాల్సి వచ్చినపుడు- నెహ్రజీ మన్ననలు పొందడానికి చిన్న చిట్కా ప్రయోగించాడు. వంద టాక్సీలు మాట్లాడి వాటిని విమానాశ్రయానికి – కరైకుడి సంస్థకు మధ్య ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ తిప్పించాడు. అంటే అదంతా అభివృద్ధి ప్రాంతమేనని భారత తొలి ప్రధాని పండిట్‌ జవహార్‌ లాల్‌ నెహ్రూకు శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ఒక భ్రమని కల్పించాడు. దేశ వైజ్ఞానిక ప్రగతికి దోహదపడే ఒక జాతీయస్థాయి సంస్థకు రూపమివ్వడానికి మంచితనంతో ప్రధానిని సంతృప్తి పరిచిన వైనం మనల్ని అబ్బుర పరుస్తుంది. కవిత్వానికి తలపూచే శాంతి స్వరూప్‌ భట్నాగర్‌, మిరా గాలిబ్‌ సమాధి స్వంత డబ్బులతో కట్టించాడు. ఒక మహా కవి పట్ల ఒక మహా శాస్త్రవేత్త ప్రకటించిన ఘనమైన శ్రద్ధాంజలి అది! ఇలాంటి సంఘటన ప్రపంచంలో మరొకటి ఎక్కడా జరిగి ఉండదు.

శాస్త్రవేత్తలు కనుగొన్న వైజ్ఞానిక అంశాలు విద్యాలయాల్లో బోధిస్తారు గానీ, వారి వ్యక్తిత్వం, వారి త్యాగాలు, వారు చేసిన దేశ సేవ గురించి పాఠాలలో చెప్పరు. అసలైతే అవి కూడా చెప్పడం అవసరం. భావితరాల్ని మానవవాదులుగా మార్చాలంటే అలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి? ఎవరైనా సరే, వ్యక్తులుగా ఎదిగినప్పుడే మానవాళికి ఉపయోగపడే ఆధ్భుతాల్ని సాధిస్తారు. వారు శాస్త్రవేత్తలయినా, కవులైనా, గాయకులైనా, తత్త్వవేత్తలయినా, చిత్రకారులైనా ఎవరైనా సరే – ఒక స్థాయిని అందుకోవడం కష్టం! అందుకున్నాక సైన్సు, కళలు, సామాజిక, ఆర్థిక అంశాల మధ్య అడ్డుగోడలు తొలగిపోయి – అన్నీ ఒకే పరిధిలో కనిపించడం విశేషం!

అన్ని స్థాయిల్లోని విద్యాలయాల్లో, కార్యాలయాల్లో, పౌర సమాజాల్లో ఈ కింది రోజుల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడు మనిషి కేంద్రంగా హేతుబద్ధంగా ఆలోచనలు పెరుగుతాయి. 28 ఫిబ్రవరి : నేషనల్‌ సైన్స్‌ – 21 జూన్‌ : ‘హ్యూమనిస్ట్‌ డే – 3వ వారం (16-18 మధ్య) నవంబర్‌లో ప్రపంచ తాత్వికతా దినం (world philosophy Day) 24 నవంబర్‌ : ఎవల్యూషన్‌ డే. 20 ఆగష్టు వైజ్ఞానిక స్పృహదినం (Scientifie Temper Day). ఇతర జాతీయ పండగలతో పాటు వీటిని జరపడం ప్రారంభిస్తే- మత పునాదుల మీద అసంబద్ధంగా ఏర్పడి కొనసాగుతున్న అబద్ధాల పండుగలు అంతరిస్తాయి. పౌరుల్లో విశాల దృక్పథం అలవడుతుంది! ప్రభుత్వాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న విద్వేష భావనని తిప్పికొడతారు. మానవజాతి అంతా ఒకటేనన్నది గ్రహిస్తారు! అందరూ విశ్వమానవులవుతారు!!

సుప్రసిద్ధ సాహితీవేత్త,
నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, మాజీ సలహా సభ్యులు.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -