నవతెలంగాణ – జక్రాన్ పల్లి : ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2025 అక్టోబర్ 14 తారీఖున జక్రాన్ పల్లి మండలం లోని తొర్లికొండ గ్రామంలో కార్మికుల సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. దాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పెంచి పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తారీఖున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఒకే పనికి రెండు రకాల వేతనం ఇవ్వడం వివక్షత అని బానిస విధానమని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 9 సంవత్సరాలు గడిచిన ఇప్పటికి పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచకుండా కేవలం శాలువాలు కప్పి సన్మానిస్తే సరిపోదని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని ఆదేశముగా భావించి దేశ వ్యాపితంగా అమలు చేసి స్వచ్ఛభారత్ లో పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం వేస్తూ, మరో దిక్కు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని ఆయన తెలిపారు.
కార్మికులు మనుషులే అన్న విషయాన్ని మర్చిపోవద్దని ఎనిమిది గంటల పని విధానమే యధా విధంగా కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యము కాదని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దాసు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్, స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ , చిట్టిబాబు, రాజన్న, నాగవ్వ,సత్యనారాయణ, ఎల్లవ్వ, ఎల్లయ్య, పాల్గొన్నారు.