Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకల్తీ కల్లు విక్రయాన్ని అరికట్టాలి

కల్తీ కల్లు విక్రయాన్ని అరికట్టాలి

- Advertisement -

– ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు డీవైఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కల్తీకల్లు విక్రయాన్ని అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌, ఉపాధ్యక్షులు ఎండీ జావిద్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సయ్యద్‌ ఖురేషికి వినతి పత్రాన్ని సమర్పించారు. కల్తీ కల్లు అమ్ముతున్న కాంపౌండ్ల నిర్వాహకులనూ, కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాంటి కల్లు కాంపౌండ్లను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కల్తీ కల్లు ఘటనలు వరుసగా జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ధనార్జనే ధ్యేయంగా ఆ కాంపౌండ్ల నిర్వాహకులు పలు రసాయనాలతో కల్లును కల్తీచేసి అమ్ముతున్నారనీ, అది సేవించిన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేశారు. ఘటనలు జరిగిన ప్పుడు హడావుడి చేయడం కాకుండా.. నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలనీ, తనిఖీలు చేయాలని కోరారు. కూకట్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌ బస్తీకి చెందిన ఎనిమిది మంది నిరుపేదలు కల్తీకల్లు తాగి మరణించడం విషాదకరమని తెలిపారు. ఇప్పటికే 44మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారని గుర్తు చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలనీ, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -