కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీపీటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీఆర్‌ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పెట్టలేదని రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేవలం 30శాతం నిధులను మాత్రమే ఖర్చుపెట్టి అన్యాయం చేశారని నిరసన తెలిపారు. శాసనసభలో స్పీకర్ జి ప్రసాద్‌కుమార్ అనుమతి మేరకు శనివారం కృష్ణా, గోదావరి జలాలపై మంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్ సర్కారు 2015లో జీవో ఇచ్చి 2022లో డీపీఆర్ సమర్పించిందని గుర్తు చేశారు.
‘కాళేశ్వరంపై రూ. 90 వేల కోట్లు ఖర్చు చేశారనీ, పాలమూరుపై కేవలం రూ.27 వేల కోట్లు మాత్రమే వెచ్చించినట్టు తెలిపారు. కాళేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా అంచనాలు పెంచి, పాలమూరులో మాత్రం 1.5 టీఎంసీకి తగ్గించారనీ అన్నారు. ప్రాణహిత-చేవెళ్లను తుమ్మిడిహట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారనీ, జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. రూ. 7469.26 కోట్లు ఖర్చు చేస్తే కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పూర్తయ్యేవని మంత్రి ఉత్తమ్ అన్నారు.
అక్రమంగా ఏపీకి తరలింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి అక్రమంగా నీటిని తరలిస్తుంటే గత బీఆర్‌ఎస్ సర్కారు చూస్తూ కూర్చున్నదని మంత్రి విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను అంగీకరించి కేసీఆర్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని గుర్తు చేశారు. కృష్ణా నదీ పరివాహకం ప్రకారం తెలంగాణకు అధిక వాటా రావాల్సి ఉందనీ, మేంవచ్చాక 550 టీఎంసీలు కావాలని వాదించామని వివరించారు. ఒక్క టీఎంసీనే కాదు.. నీటిచుక్కనూ కూడా వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణకు కీలకం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరలో వెలువడనుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. తాను స్వయంగా ట్రిబ్యునల్ వాదనలకు హాజరవుతున్నాననీ, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 72 శాతం వరకు నీటి కేటాయింపులు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తెలంగా ణకు అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 814 టీఎంసీల కృష్ణా నీళ్లను తెలంగాణ, ఏపీకి న్యాయంగా కేటాయించాలని కోరారు.
బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి: మంత్రి శ్రీధర్‌బాబు
నదీజలాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ అంశంపై విస్తృతంగా చర్చించేందుకు సభలో లఘ చర్చ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇలాంటి కీలక అంశంపై చర్చ జరిగే సమయంలో బీఆర్‌ఎస్ సభకు గైర్హాజరవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. నదీ జలాల అంశంపై ప్రజలకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సైతం పాల్గొన్నారు.
‘కాళేశ్వరం’పై ఉన్న శ్రద్ధ పాలమూరుపై లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



