Friday, February 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ పాలనలో స్కాం క్యాలెండర్‌

కాంగ్రెస్‌ పాలనలో స్కాం క్యాలెండర్‌

- Advertisement -

సభ్యసమాజం అసహ్యించుకునేలా రేవంత్‌ భాష
కేసీఆర్‌ను చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్న సీఎం
కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం : మాజీమంత్రి హరీశ్‌రావు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలుండొచ్చనీ, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి వాడుతున్న భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయన ప్రవర్తన తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చ అని విమర్శించారు. చరిత్రలో ఆయనొక వికృత మనస్తత్వం కలిగిన బూతుల సీఎంగానే మిగిలిపోతారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే ఇలా చిల్లర మాటలు మాట్లాడటం దారుణమని చెప్పారు.

రేవంత్‌రెడ్డి వాడుతున్న వికృత భాష తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని అన్నారు. దీనిపై తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు మౌనం వహించడం రాష్ట్రానికి ప్రమాదకరమని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్‌రెడ్డి నెలకు ఒక స్కామ్‌తో స్కాం క్యాలెండర్‌ను అమలు చేస్తున్నారని విమర్శించారు. జనవరిలో పౌరసరఫరాల కుంభకోణం, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫైయాష్‌ స్కాం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్‌లో ఆర్టీసీ స్కాం, మేలో అమృత్‌ టెండర్ల కుంభకోణం, జూన్‌లో ఫోర్త్‌సిటీ స్కాం, జులైలో లగచర్ల, హెచ్‌సీయూ భూకుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్‌ సీట్ల స్కాం, సెప్టెంబర్‌లో హిల్ట్‌ కుంభకోణం, అక్టోబర్‌లో విద్యుత్‌స్కాం, నవంబర్‌లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్‌లో కేఎల్‌ఎస్‌ఆర్‌ స్కాం జరిగాయని వివరించారు. పాలన గాలికొదిలి, జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

రెండున్నరేండ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక, తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్‌రెడ్డి వికృత భాషను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఆయన కుర్చీని కాపాడుకోవడానికి బీజేపీతో రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం విచారణ జరిపించడం లేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్‌ ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచారని అన్నారు. 24 గంటల కరెంటును 12 గంటలకు కుదించారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన జాతిపిత కేసీఆర్‌ను చూసి ఓర్వలేక రేవంత్‌రెడ్డి విషం కక్కుతున్నారని అన్నారు. బీజేపీ జాతీయ నాయకులు వచ్చి ఆర్‌ఆర్‌ టాక్స్‌ అని అవినీతి గురించి మాట్లాడతారు తప్ప, ఎలాంటి విచారణ చేయడం లేదన్నారు. ఇది కాంగ్రెస్‌-బీజేపీల చీకటి ఒప్పందానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -