– సింగరేణిని కొల్లగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– గులాబీ పార్టీలో చేరిన మూల రాజిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల ముందు స్కీమ్‌లను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవి మాయమై స్కాములకే పరిమితమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. సింగరేణి స్కాంపైన మంత్రులు తేలు కుట్టిన దొంగళ్లా కనీసం మాట్లాడటం లేదనీ, ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయారని అన్నారు. సింగరేణి దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మెన్ మూల రాజిరెడ్డితోపాటు ఆయన అనుచరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి స్కామ్ ప్రజల విశ్వాసానికి తూట్లు పొడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటోందనీ, కొల్లగొడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన తెచ్చి టెండర్లను కట్టడి చేసిందని విమర్శించారు. గతంలో దేశంలో ఎక్కడున్నా కాంట్రాక్టర్ ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయడంతో అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. దీని వల్ల ఎవరు టెండర్ వేయాలి, ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి కంపెనీకే మొదటి టెండర్ రూ.250 కోట్ల కాంట్రాక్ట్ దక్కిందని వివరించారు. గతంలో మైనస్‌లో పోయే టెండర్లు ఇప్పుడు వేల కోట్ల విలువైన డీల్స్‌గా మారాయని అన్నారు. ఒక్కో టెండర్‌ను వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే ఈ కుంభకోణం బయటకొచ్చిందని అన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వాటాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి కోమటిరెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయని చెప్పారు. ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని వివరించారు. ఈ వ్యవహారంపై హరీశ్‌రావు ప్రశ్నించగానే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందన్నారు. సింగరేణి స్కామ్‌పై సమాధానం చెప్పాల్సిందిపోయి ఫోన్ ట్యాపింగ్ అంటూ పాత సీరియల్‌లా కేసులు లాగుతున్నారని విమర్శిం చారు. దొంగ పనులు చేస్తే పోలీసులే పట్టుకుంటారనీ, రేవంత్‌రెడ్డి లాలూచీ పనులు చేస్తే లాలూచీగాడనే అంటారని అన్నారు. చెన్నూరులో మంత్రి వివేక్ పరిశ్రమ పెట్టి 40 వేల నుంచి 45 వేల ఉద్యోగాలొస్తాయన్నారని గుర్తు చేశారు. రాబోయే మూడేండ్లలోనూ ఆయన 400 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరని అన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కాక పాలన చేయలేక ఢిల్లీ చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 62 సార్లు ఢిల్లీకి వెళ్లారని గుర్తు చేశారు. పదవులు కాపాడుకోవడానికి సంచులు మోసేందుకేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీ పార్టీలేననీ, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకొకటి చెప్పులు మోసే పార్టీ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కె కిశోర్‌గౌడ్, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి తీరుపై కేటీఆర్ ఆగ్రహం
సింగరేణి టెండర్ల కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించిన తీరు పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి వాదన దివాళాకోరు విధానానికి నిదర్శనమని బుధవారమొక ప్రకటనలో విమర్శించారు.ఈ స్కామ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ మే ప్రధాన దోషిగా ఉందని తెలిపారు. ఇది కేంద్ర మంత్రి అజ్ఞానమా, లేక సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయటపడినా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోకపోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందనీ, అవసర మైతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
స్కీమ్‌లు మాయం.. స్కామ్‌లకే పరిమితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



