20 మంది విద్యార్థులకు గాయాలు
బస్సు ఫిట్‌నెస్ లేకపోవడం, పరిమితికి మించి విద్యార్ధులను ఎక్కించడంతోనే ప్రమాదం
నవతెలంగాణ-వేంసూరు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలోని వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు స్కూల్ ముగిసిన తర్వాత విద్యార్ధులను ఎక్కించుకొని బయలుదేరింది. డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో గణేశ్‌పాడు గ్రామశివారులోకి రాగానే బస్సు అదుపుతప్పి బీరాపల్లి, గణేష్‌పాడు మధ్యలో ఉన్న ఎన్‌ఎస్‌పీ మేజర్ కాల్వలో పడిపోయింది. ఈ సమయంలో బస్సులో 107 మంది విద్యార్ధులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో 20మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాయపడిన విద్యార్ధులను దగ్గరలోని తిరువూరుకి, మరికొంతమందిని పెనుబల్లి, సత్తుపల్లి ఆస్పత్రులకు తరలించారు. సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యారు. కాగా, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వీటికి తోడు బస్సు ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడం, పరిమితికి మించి విద్యార్థులను బస్సులో ఎక్కించటంపై పలు విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



