గ్రామాల సమస్యలపై నిరంతరం ఆరా..
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్పంచుల పదవీకాలం ముగిసిన నాటి నుంచి గ్రామాల బాధ్యతలు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తూ పంచాయతీ కార్యదర్శులు ముందుకు సాగుతూ శేభాష్ అనిపించుకుంటున్నారు. మండలంలో మొత్తం 15 పంచాయతీలు ఉండగా..11 మంది కార్యదర్శులు ఉన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు.
సవాళ్లను అధిగమిస్తూ..
సర్పంచులు పదవీకాలంలో ఉన్నప్పుడు గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించే వారు. పంచాయతీల్లో నగదు లేకున్నా సొంత ఖర్చులు చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సేవలను అందించారు. కానీ సర్పంచ్ పదవి కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమై దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. గ్రామాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కార్యదర్శులు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా శానిటేషన్, నీటి సరఫరా, సీల్డ్ తొలగింపు, వీధి దీపాల నిర్వహణ, వర్ష కాలంలో వీధుల్లో బురద నీరు, మురుగునీటి ప్రాంతాలను శుభ్రం చేయడం, చెత్త తొలగికచడం, వాటర్ పైప్ లైన్ లికేజీలను సరి చేయడం, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్ల నిర్వహణ వంటి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
తప్పని తిప్పలు..
సమస్యల పరిష్కారానికి సొంతంగా వేతనం నుంచి నగదు వెచ్చిస్తున్నారు. కానీ చేసిన పనులకు బిల్లు పెట్టుకుంటే నగదు జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చేసిన పనులకు సకాలంలో నగదు జమ కాకపోవడంతో ఆర్థిక భారం మోస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ప్రతీరోజు తిరగాలంటే డీజిల్ సమస్య పంచాయతీ కార్యదర్శులను వెంటాడుతోంది. కొన్నీ గ్రామాల కార్యదర్వులు పెట్రోల్ బంకులో అప్పులు చేసి డీజీల్ పోయిచడం జరుగుతుందని వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి చెక్కులు వెంటనే విడుదల అయ్యేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్యనే ఉంటున్న గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.



