మంత్రి అడ్లూరి చెంతకు విద్యార్థులు.. విచారణకు ఆదేశం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ కొద్ది రోజులుగా ఆందోళనలు, వివాదాలకు నిలయంగా మారింది. విద్యాబోధన జరగాల్సిన ప్రాంగణంలో కుట్రలు, వేధింపులు, సామాజిక వివక్ష ఆరోపణలు వెల్లువెత్తు తుండటంతో వర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకునేందుకు నేరుగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను శుక్రవారం ఆశ్రయించారు. ఈ భేటీ వర్సిటీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను మరోసారి రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం చేసింది.
వర్సిటీలో అసలేం జరుగుతోంది?
యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణం కంటే గ్రూపు రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న బోటనీ ఫ్యాకల్టీ పెంచల శ్రీనివాస్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతోనే వర్సిటీలో అశాంతి మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను ఎత్తిచూపిన కారణంగానే యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులపై దాడులు జరిగాయని అంటున్నారు.
‘అర్బన్ నక్సలైట్’ముద్ర.. సోషల్‌మీడియా వేదికగా కుట్ర
ముఖ్యంగా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, విద్యార్థి నేత కరికే మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని పలువురు విద్యార్థులను ‘అర్బన్ నక్సలైట్లు’గా చిత్రీకరించి సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. దీన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పూర్తిగా ఖండిస్తూ జిల్లాలో ఎక్కడా మావోయిస్టులు, అర్బన్ మావోయిస్టులు లేరని ప్రకటన చేయడంతో విద్యార్థులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ‘అడ్లూరి’ దృష్టికి ఈ అంశాన్నే విద్యార్థులు తీసుకెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో తమపై జరుగుతున్న విషప్ర చారం.. పెంచల శ్రీనివాస్ నియామకాన్ని ప్రశ్నించినం దుకుగానూ, ప్రొఫెసర్ సుజాతను, మహేష్‌ను ‘అర్బన్ నక్సలైట్లు’ అని సంబోధిస్తూ పోస్టులు పెట్టిస్తున్నారని వివరించారు. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు, వర్సిటీ గౌరవానికి భంగం కలిగిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘చదువుకోవాల్సిన ప్రాంగణంలో కులం పేరుతో వేధింపులు ఏంటి? ప్రజాస్వామికంగా నిరసన తెలిపితే మావోయిస్టులు అని ముద్ర వేస్తారా?’ అని విద్యార్థి నాయకులు మంత్రితో గోడు వెళ్లబోసుకున్నారు.
తక్షణ చర్యలకు మంత్రి ఆదేశం
మీడియాలో వచ్చిన కథనాలు, విద్యార్థులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెంటనే స్పందించారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానాకు ఫోన్ చేసిన మంత్రి.. వర్సిటీలో నెలకొన్న అస్థిరతపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తక్షణమే ఎంక్వయిరీ కమిటీ వేయాలని, మీడియాలో కథనాలు, విద్యార్థుల ఫిర్యాదులపై లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి హామీతోనైనా శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ప్రశాంతత నెలకొంటుందో లేదో చూడాలి. మంత్రిని కలిసిన వారిలో విద్యార్థి నాయకులు కరికే మహేష్, శివాజీ, సుమన్, రమేష్, సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.
శాతవాహన వర్సిటీలో ముదిరిన సెగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



