Tuesday, February 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుస్వీయప్రకటిత జాతిపితలకు సిగ్గుండాలే!

స్వీయప్రకటిత జాతిపితలకు సిగ్గుండాలే!

- Advertisement -

నేరాలు చేసి విచారణలు వద్దంటారా?
మహాత్ముడికీ…మీకు పోలికెక్కడ?
రావినారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘జాతిపిత’లు అంటూ స్వయంగా ప్రకటించుకొని, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడి, మమ్మల్ని ఎవరూ ప్రశ్నించొద్దు అనడం విచిత్రంగా ఉన్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారనీ, ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ‘రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం’ జరిగింది. జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డికి ఈ పురస్కారాన్ని అందచేశారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ నాయకులు కే నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే ‘జాతిపిత’కు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారనీ, అధికారంలో ఉన్నన్నాళ్లు దోచుకొని, దాచుకుంటే విచారణలు చేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ పదవులను త్యాగం చేసి, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారనీ, ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు అసలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్‌ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆనాడు ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? అని నిలదీశారు. ”మిమ్మల్ని పోలీసులు అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా..నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు.” అని చెప్పారు. రావి నారాయణరెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ”ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడన్నా అర్థం చేసుకోవాలి.

హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది. ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం” అని ఎద్దేవా చేశారు. అక్రమమార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని అంబేద్కర్‌ చెప్పారనీ, శిబూసోరెన్‌ లాంటి వాళ్లు విచారణలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఎవరూ దైవాంశసంభూతులు కాదన్నారు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారనీ, ఇప్పుడా చక్రవర్తులకు కాలం చెల్లిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. కమ్యూనిస్టులు నినాదాలు ఇచ్చి, పోరాటాలు చేశారనీ, వాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని గుర్తుచేశారు. దున్నే వాడికే భూమి అని పోరాడితే కాంగ్రెస్‌ పేదలకు భూములు పంచిందన్నారు. దేశంలో నాణేనికి ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు కమ్యూనిస్టులు ఉండాలని చెప్పారు.

‘సర్‌’ ఓటుహక్కును కాలరాసేందుకే…
ప్రధాని మోడీ ఒకే దేశం, ఒకేపార్టీ అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. దానికోసమే రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాసేందుకు ‘సర్‌’ను తెచ్చారని చెప్పారు. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదనీ, దానిపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పారు.

ఆనాటి త్యాగాల్ని చరిత్ర విస్మరించదు
పాతతరం నాయకులు ప్రజల కోసంచేసిన త్యాగాలను చరిత్ర ఏనాటికీ విస్మరించదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రావి నారాయణరెడ్డి అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. రాచరిక పాలన, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడారని తెలిపారు. బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేశారనీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారని చెప్పారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదటి పార్లమెంట్‌ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారని గుర్తుచేశారు. 60 ఏండ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత అని శ్లాఘించారు.

ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తొలి తరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి స్ఫూర్తినిస్తే, మలితరంలో ఎస్‌ జైపాల్‌రెడ్డి, జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి లాంటి వారు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిని ఇస్తున్నారని అన్నారు. 2019లో ఎస్‌ జైపాల్‌రెడ్డిని పార్లమెంటుకు పోటీచేయాలని తానే స్వయంగా కోరాననీ, కానీ తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటూ, మీలాంటి యువతరం రాజకీయాల్లో ఉండాలని ఆయన ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నిబద్ధత ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను భయపెట్టిందన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించడం కోసం, ఒకే పార్టీ, ఒకే వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా ఆనాడు సుదర్శన్‌రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారని చెప్పారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితమని ప్రసంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -