– 2-1తో టీ20 సిరీస్ భారత్ వశం
– బ్రిస్బేన్‌లో ఆఖరు మ్యాచ్ వర్షార్పణం
వరుణుడి విశ్వరూపంతో మొదలైన భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. వర్షంతోనే ముగిసింది. శనివారం బ్రిస్బేన్‌లో కుండపోత వర్షంతో ఆఖరు టీ20 మ్యాచ్ రద్దుగా ముగిసింది. ఐదు మ్యాచుల సిరీస్‌లో రెండు మ్యాచులు వరుణుడి ఖాతాలో పడగా.. రెండింట గెలుపొందిన టీమ్ ఇండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వర్షంతో గబ్బాలో ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యపడలేదు. నిలకడగా ధనాధన్ జోరు చూపించిన అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)
భారత్, ఆస్ట్రేలియా ఆఖరు టీ20 మ్యాచ్ ఊహించినట్టుగానే వర్షార్పణం అయ్యింది. సాధారణంగా నవంబర్ ఆరంభం నుంచి బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. వాతావరణ పరిస్థితులు తెలిసీ.. బ్రిస్బేన్‌లో మ్యాచ్ షెడ్యూల్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. శనివారం గబ్బాలో ఆసీస్, భారత్ ఐదో టీ20లో సూర్యకుమార్ సేన తొలుత బ్యాటింగ్ చేయగా 4.5 ఓవర్లలో 52/0తో ఉండగా వరుణుడు రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత వర్షం తగ్గలేదు. నిలకడగా కుండపోత వర్షం కారణంగా ఆఖరు మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ సైతం వర్షంతో రద్దుగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో ఆసీస్ గెలుపొందగా… మూడు, నాల్గో టీ20ల్లో భారత్ విజయం సాధించింది. ఐదు మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా 163 పరుగులు బాదిన అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
గిల్ ధనాధన్
ఆసీస్ పర్యటనను శుభ్‌మన్ గిల్ గొప్పగా ముగించాడు!. టీ20 జట్టులో ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్.. ఆశించిన స్థాయిలో తొలి నాలుగు మ్యాచుల్లో రాణించలేదు. కొత్త బంతితో నాణ్యమైన పేస్‌ను ఎదుర్కొవటంలో ఇబ్బంది పడ్డాడు. బ్రిస్బేన్‌లో శనివారం శుభ్‌మన్ గిల్ సమీకరణాలు సరి చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బెన్‌పై గిల్ ఒకే ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లతో దండయాత్ర చేశాడు. కవర్‌డ్రైవ్, ఫుల్ షాట్‌తో శుభ్‌మన్ దంచికొట్టాడు. 16 బంతుల్లోనే ఆరు ఫోర్లతో గిల్ అజేయంగా 29 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత ఓపెనర్లను పేస్‌లో వైవిధ్యంతో ఇబ్బందిపెట్టిన నాథన్ ఎలిస్‌ను అభిషేక్ శర్మ సిక్సర్‌తో బాదాడు. ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో ఎలిస్‌పై భారీ సిక్సర్‌తో అభిషేక్ జోరందుకున్నాడు. ఓ ఫోర్, సిక్సర్‌తో 13 బంతుల్లో అభిషేక్ అజేయంగా 23 పరుగులు చేశాడు. 4.5 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసేలోపు మరిన్ని బౌండరీలపై ఓపెనర్లు కన్నేయగా.. ఇంతలోనే స్టేడియంలోకి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆట మళ్లీ పున ప్రారంభం కాలేదు. ఐదు ఓవర్ల మ్యాచ్‌కు సైతం అవకాశం లేకపోవటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
తిలక్ అవుట్, రింకూ ఇన్!
ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అద్వితీయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ.. ఆసీస్‌తో ఆఖరు టీ20లో బెంచ్‌కు పరిమితం అయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ ఆశించిన ప్రదర్శన చేయలేదు. భాగస్వామ్యాలు నిర్మించటంలో, వేగంగా పరుగులు సాధించటంలో తిలక్ వర్మ నిరాశ పరిచాడు. మరో వైపు ఫినిషర్‌గా అవకాశం కోసం ఎదురుచూస్తున్న రింకూ సింగ్‌కు తుది జట్టులో స్థానం దక్కటం లేదు. బ్రిస్బేన్‌లో తుది జట్టులో మార్పులు చేసిన జట్టు మేనేజ్‌మెంట్ తిలక్ వర్మ స్థానంలో రింకూ సింగ్‌ను ఎంచుకుంది. వర్షంతో మ్యాచ్ రద్దు కావటంతో రింకూ సింగ్‌కు గబ్బాలోనూ ఆడే అవకాశం దక్కలేదు. భారత జట్టు ఆస్ట్రేలియాలో వైట్‌బాల్ సిరీస్ పర్యటన శనివారంతో ముగియగా.. సోమవారం సూర్యకుమార్‌సేన స్వదేశానికి తిరిగి రానుంది.


