Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి

ఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి

- Advertisement -

పత్తి తేమను 18 శాతానికి పెంచాలి
పత్తి దిగుమతులను ఆపివేయాలి
దిగుమతి సుంకాలను కేంద్రం పెంచాలి : సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి


నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి ఎంత పంట పండితే అంత కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారతదేశానికి పత్తి దిగుమతులపై ఉన్న 11శాతం సుంకాన్ని వచ్చే డిసెంబర్‌ 31 వరకు రద్దు చేసిందని, ఇది అత్యంత దుర్మార్గమని అన్నారు. మన దేశంలో 365 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని, మన వినియెగం 325 లక్షల బేళ్లుఉంటుందన్నారు. అదనంగా ఉన్న 50 లక్షల బేళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

కానీ అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ప్రోద్భలంతో అమెరికా నుంచి 50 లక్షల బేళ్ల పత్తిని దిగుమతి చేసుకునేందుకు మోడీ అంగీకరించారని, దీనిపై దిగుమతి సుంకాన్ని సైతం రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్లనే సీసీఐ కొనుగోళ్లలో ఏడు క్వింటాళ్ల నిబంధన పెట్టారని తెలిపారు. పత్తి ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి అవుతుందని, సీసీఐ 7 క్వింటాళ్లు మాత్రమే కొంటే మిగితాది ఎక్కడ అమ్ముకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల మిగిలిన పత్తిని దళారులకు అమ్మేలా చేస్తూ మోడీ ప్రభుత్వం రైతులను అధ్వాన పరిస్థితుల్లోకి నెడుతోందని విమర్శించారు. ఇప్పుడు తక్కువ ధరకు బయటి నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ ధరలు పడిపోవడంతో బడా పరిశ్రమలకు లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులు పత్తి సాగుచేస్తుండగా, వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. పత్తి కనీస మద్దతు ధర రూ.8110 ఉండగా అంతకన్నా తక్కువకే సీసీఐ కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే, తేమ 8 నుంచి 12శాతం మాత్రమే ఉండాలని చెబుతున్నారని, కానీ వర్షాలు, తుఫాన్‌ వల్ల పత్తి తేమ శాతం 12 కన్నా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పత్తి తేమను 18 శాతం వరకూ అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం రైతులను ఆదుకునేందుకు పత్తి దిగుమతులను వెంటనే ఆపాలని, మన దిగుమతి సుంకాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజ్‌, కార్యదర్శి వర్గ సభ్యులు అతిమెల మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -