Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంకుంచించుకుపోతున్న పీఎం పోషణ్‌

కుంచించుకుపోతున్న పీఎం పోషణ్‌

- Advertisement -

క్రమంగా పడిపోతున్న కవరేజీ
ఐదేండ్లలో పథకానికి దూరమైన 84 వేల పాఠశాలలు
యూపీ, ఎంపీ, అసోంల నుంచే అధికం : కేంద్రం సమాచారం
పోషకాహారానికి దూరమవుతున్న కోట్లాది మంది చిన్నారులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే కేంద్ర ప్రభుత్వ కీలక పథకం ‘పీఎం పోషణ్‌’ (మధ్యాహ్న భోజన పథకం) పరిధిలోని పాఠశాలల సంఖ్య గత ఐదేండ్ల లో గణనీయంగా పడిపోయింది. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దాదాపు 84,453 పాఠశాలలు ఈ పథకం నుంచి దూరమయ్యాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించిన సమాచారం ఈ విషయాన్ని తెలియజేస్తున్నది.

ఐదేండ్లలో 7.5 శాతం తగ్గుదల
ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి సమాచారాన్ని వెల్లడించారు. దీని ప్రకారం.. 2020- 21లో పీఎం పోషణ్‌ పథకం కింద 11.19 లక్షల పాఠశాలలు ఉన్నాయి. అయితే 2024-25 నాటికి ఆ సంఖ్య 10.35 లక్షలకు పడిపోయింది. అంటే ఈ ఐదేండ్లలో తగ్గుదల 7.5 శాతం అన్నమాట. ఇక ఈ తగ్గుదల కోవిడ్‌ తర్వాతే భారీగా నమోదైంది. అత్యధికంగా తగ్గుదల 2020-21 నుంచి 2021-22 మధ్యనే చోటు చేసుకున్నది. ఆ ఒక్క ఏడాదిలోనే 35,574 పాఠశాలలు (3.18 శాతం) పథకం పరిధి నుంచి దూరమయ్యాయి ఆ తర్వాతి సంవత్సరాల్లో తగ్గుదల వేగం కొంత మందగించినా.. నిరంతర పతనం మాత్రం కొనసాగింది.

ఇక 2022-23లో పాఠశాలల సంఖ్య 10.76 లక్షలకు తగ్గింది. అంటే, 7,604 (0.7 శాతం) స్కూళ్లు తగ్గిపోయాయి. 2024-25లో గణనీయమైన పతనం నమోదైంది. ఆ పాఠశాలల సంఖ్య 10.35 లక్షలకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 31,766 స్కూళ్లు (2.98 శాతం) తగ్గిపోయాయి. ప్రధాన మంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ (పీఎం పోషన్‌) అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, యూటీల సహకారంతో అమలవుతున్న పథకం. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న ప్రీక్లాస్‌ 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు రోజుకు ఒకసారి వేడిగా వండిన భోజనం అందిస్తారు.

యూపీ, ఎంపీలలో అధిక ప్రభావం
దేశవ్యాప్తంగా పీఎం పోషణ్‌ పథకం పరిధి నుంచి అధిక సంఖ్యలో దూరమైన పాఠశాలల సంఖ్య యూపీ నుంచి ఉన్నది. అక్కడ 2020-21 పథకం కింద లబ్ది పొందిన పాఠశాలల సంఖ్య 1.67 లక్షలుగా ఉండగా.. 2024-25 నాటికి అవి 1.41 లక్షలకు పడిపోయాయి. అంటే మొత్తం 25,361 పాఠశాలలు ఈ పథకం నుంచి దూరమయ్యాయి. ఇక మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నది. ఇక్కడ పథకం కింద ప్రయోజనం పొందిన స్కూళ్ల సంఖ్య 1.12 లక్షల నుంచి 88,204కు పడిపోయింది. అంటే.. 24,704 పాఠశాలలు తగ్గిపోయాయి.

అసోంలోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇక్కడ 2020-21లో 53 వేలకుపైగా పాఠశాలలు ఉండగా.. ఆ సంఖ్య 44,106కు పడిపోయింది. అంటే స్కూళ్ల తగ్గుదల సంఖ్య 9,321గా ఉన్నది. ఈ మూడు రాష్ట్రాలే దేశవ్యాప్తంగా మొత్తం తగ్గుదలలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉన్నాయి. అంటే పథకానికి దూరమైన 84,453 పాఠశాలల్లో దాదాపు 59,400 పాఠశాలలు ఈ మూడు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కాగా యూపీ, ఎంపీ, అసోంలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కావటం గమనార్హం.

కారణాలపై లేని స్పష్టత
ఇక పథకం పరిధి ఎందుకు తగ్గిందనే అంశంపై కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. అయితే పథకం అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యూటీలు)దేనని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

తగ్గిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ..!
యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడైస్‌ ప్లస్‌) గణాంకాల ప్రకారం.. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 10.32 లక్షల నుంచి 10.13 లక్షలకు తగ్గింది. అంటే.. తగ్గిన పాఠశాలల సంఖ్య 18,727 (1.8 శాతం)గా ఉన్నది. ఇక గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ స్కూళ్ల సంఖ్య మరింతగా పడిపోయింది. వీటి సంఖ్య 84,295 నుంచి 79,349కి తగ్గింది. అంటే 4,946 పాఠశాలలు (5.9 శాతం) తగ్గాయి. ఇది పీఎం పోషణ్‌ పథకం కవరేజ్‌ తగ్గడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.

కేటాయింపులు పెరిగినా.. వినియోగం తక్కువే
2024లో మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థిపై ఖర్చును కేంద్రం పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎం పోషణ్‌ పథకానికి కేంద్రం రూ.12,467.39 కోట్లు కేటాయించింది. అయితే తర్వాత దానిని రూ.10వేల కోట్లకు సవరించింది. అయినప్పటికీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నాటికి రూ.5,421.97 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఇది పథకం అమలుపై అనేక సందేహాలను కలిగిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో పీఎం పోషణ్‌ పథకానికి రూ.12,500 కోట్లు కేటాయించారు.

మోడీ సర్కారు తీరుపై తీవ్ర వ్యతిరేకత
పేద విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో రూపొందించిన పీఎం పోషణ్‌ పథకం క్రమంగా సంక్షోభంలోకి వెళ్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాలల మూసివేతలు, రాష్ట్రాల నిర్లక్ష్యం, నిధుల సమర్థ వినియోగం లేకపోవడం వంటి అంశాలు కలిసి ఈ కీలక సంక్షేమ పథకం ప్రభావాన్ని బలహీనపరుస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా పిల్లల పోషణ, విద్యపై పడే ప్రమాదమున్నదని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పేద, మధ్యతరగతి, అణగారిన వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదనీ, వాటిని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నదని మేధావులు ఆరోపిస్తున్నారు. మోడీ సర్కారు తీరును వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -