మాతా శిశువులకు ప్రాణాంతకంగా మారిన అనేమియా
ఐరన్, బలవర్ధక ఆహార లోపాలతో సతమతం
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 తాజా డేటాలో వెల్లడి
సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలంటున్న వైద్య నిపుణులు
న్యూఢిల్లీ : తమ పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. హుటాహుటిన శిశు వైద్యుల వద్దకు తీసికెళతారు. అయితే కేవలం మందులతో మాత్రమే ఆ చిన్నారుల అనారోగ్యాన్ని నయం చేయలేమని వైద్యులు చెబుతున్నారు. కొందరు శిశువులకు పాలు ఇచ్చేటప్పుడు వారు వెంటనే ఆలసిపోతుంటారు. తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ కొందరు పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు. తరగతి గదిలో చదువుపై తగినంత దృష్టి పెట్టలేని పిల్లలు కూడా ఉంటారు. దీనికి కారణం వారిలో తెలివితేటలు లేకపోవడం కాదని, వారి శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడమేనని శిశు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోషక లోపాలకు ప్రధాన కారణం ఇదే
చిన్నారుల్లో ఇలాంటి సమస్యలు కన్పించడం సర్వసాధారణమే. సూక్ష్మ పోషకాలు లోపించడం లేదా కన్పించని ఆకలి వీటికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అత్యంత నిశ్శబ్దంగా, అనేక సంవత్సరాలుగా మన దేశంలో ని చిన్నారుల ఆరోగ్యాన్ని, మనుగడను దెబ్బతీస్తున్నాయి. పోషక లోపాలకు ప్రధాన కారణం రక్తహీనతే. భారత్‌లో పిల్లలే కాదు…పెద్దలు కూడా తరచూ ఈ సమస్యకు గురవుతుంటారు.
ఈ సవాలును తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) తాజా డేటా చెబుతోంది. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు…అంటే 67.1 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆ డేటా తెలిపింది. శిశువులకు జన్మనిచ్చే వయసున్న (15-49 సంవత్సరాలు) మహిళల్లో 57 శాతం మందిని కూడా ఇదే సమస్య వేధిస్తోంది. గర్భిణుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వారిలో సగానికి పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల తల్లులకే కాదు…పుట్టబోయే బిడ్డలకు కూడా ప్రమాదమే.
పట్టించుకోకుంటే వెంటాడుతుంది
రక్తహీనత (అనేమియా) అనేది కేవలం గణాంకాలకు సంబంధించిన సమస్యే కాదు. గర్భిణుల్లో ఈ సమస్య ఉన్న వారు తరచూ ఇన్‌ఫెక్షన్లు, అలసటకు గురవుతుంటారు. అనేక ప్రమాదకరమైన సమస్యలు ఎదురవుతాయి. చిన్నారుల శరీరం వేగంగా, మెదడు చురుకుగా అభివృద్ధి చెందాల్సిన తరుణంలో రక్తహీనత కలిగితే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు అధికమవుతాయి. వారిలో వృద్ధి కుంటుపడుతుంది. విద్యాభ్యాసం కూడా నెమ్మదిస్తుంది. ఇక తల్లుల విషయానికి వస్తే కనిపించని ఆకలి సమస్య వారి శక్తిని నిర్వీర్యం చేస్తుంది. వారిలో ఉత్పాదక సామర్ధ్యం తగ్గిపోతుంది. కుటుంబాల బాగోగులను సరిగా చూసుకోలేరు.
సమస్యను సకాలంలో పరిష్కరించలేకపోతే అది తరతరాలుగా వెంటాడుతూనే ఉంటుంది. రక్తహీనతకు కారణం శరీరంలో ఇనుము (ఐరన్) లోపించడమే. ఇది కేవలం ఆహార సమస్య మాత్రమే కాదు. పేదరికం, ఆహార అభద్రత, తరచుగా ఇన్‌ఫెక్షన్లకు గురి కావడం, పరాన్నజీవుల దాడి, మాతా శిశు ఆరోగ్య సేవలు సరిగా అందుబాటులో లేకపోవడం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఐరన్ లోపంపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. సమస్యను గుర్తించిన తర్వాత, అది ప్రమాదకరంగా పరిణమించిన తర్వాత, శాశ్వత ప్రభావాన్ని చూపిన తర్వాత మాత్రమే చికిత్స కోసం పరుగులు పెడతారు.
ఏం చేయాలంటే…
సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో అనేమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. మాతా శిశువులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించడం ద్వారా సమస్యను చాలా వరకూ పరిష్కరించవచ్చు. బియ్యం, గోధుమ పిండి, వంట నూనె, పాలు, ఉప్పు వంటి పదార్థాలకు అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కలిపితే అదే బలవర్ధకమైన ఆహారం అవుతుంది. దానిని తీసుకుంటే సంప్రదాయ ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరమే ఉండదు. ఐరన్, బలవర్ధక ఆహారం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని ఇనుమడిం పజేస్తాయి. గర్భిణుల్లో తీవ్రమైన రక్తహీనతను నివారిస్తాయి. ప్రసవ సమయంలో ఇబ్బంది లేకుండా చేస్తాయి.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశంలో రక్తహీనత కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 డేటా ప్రకారం పిల్లల్ని కనే వయసున్న మహిళల్లో రక్తహీనత సమస్య నాలుగు శాతం పెరిగింది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ల సరఫరాను పెంచితే సమస్యకు కొంతమేర చెక్ చెప్పవచ్చు. ప్రజల్లో అవగాహన పెంచి, వారు ఆ సేవలను పొందేలా చేయని పక్షంలో ఎన్ని ప్రయత్నాలు జరిపినా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో శిశు వైద్యులు తగినంత చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. మాతా శిశువులకు అవసరమైన ఆహారాన్ని సూచించడం, రక్తహీనతకు కారణాలేమిటనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



