గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మరణాలు మహారాష్ట్రలో విపరీతంగా ఉంటున్నాయి. అప్పటి వరకు కుటుంబాన్ని పోషించిన వ్యక్తి ఈ లోకం విడిచి వెళ్లిపోవడంతో మహిళలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. కుటుంబం, పిల్లల బాధ్యతతో పాటు అప్పుల భారం కూడా వారిని కుంగదీస్తుంది. భూమిపై హక్కులు లేక, సరైన సర్టిఫికేట్లు లేక ఎంతో మంది మహిళలు తమ హక్కును ఉపయోగించు కోలేక పోతున్నారు. అలాంటి ఒంటరి మహిళలకు అండగా నిలస్తుంది ఒంటరి మహిళల సంఘటన్. దీని ఆధ్వర్యంలో వితంతువులు, ఒంటరి మహిళలు నెమ్మదిగా తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు.
నష్టాలు మిగిల్చిన వ్యవసాయాన్ని భరించలేక, అప్పులు తీర్చలేక పద్మాకర్ తన జీవితాన్ని ముగించిన రోజుతో లతా ధదాసే ప్రపంచం కూడా విచ్ఛిన్నమైంది. ఇద్దరు చిన్న పిల్లలను, ఒక బీడు భూమిని, అప్పులను ఆమెపై వదిలి అతను తన తనువు చాలించాడు. ఐదేండ్లకు పైగా కరువుతో అల్లాడుతున్న విదర్భ ప్రాంతంలోని యావత్మల్ జిల్లాలో నివసిస్తున్నారు లత. భర్త మరణం తర్వాత అప్పులు తీర్చడంలో మునిగిపోయిన ఆమెకు 2014లో ఏకల్ మహిళా సంఘటన్ పరిచయమయింది. వితంతువులు, ఒంటరి, అవివాహిత మహిళలకు మద్దతు ఇస్తూ వారి హక్కుల కోసం సమిష్టిగా కృషి చేసే సంస్థ ఇది. చేరిన కొన్ని నెలల్లోనే ఆమె తన వితంతు పెన్షన్‌ను ఎలా పొందాలో, బ్యాంకు ఖాతా ఎలా తెరవాలో తెలుసుకుంది. అంతే కాదు విస్తరాకుల తయారీ నేర్చుకుని ఇంట్లోనే జీవనోపాధి పొందుతున్నారు.
కష్టతరమైన జీవితం
సమిష్టి కృషి లతకు నిరంతర ప్రోత్సాహం, సమాచారాన్ని పంచుకోవడం, కష్టతరమైన జీవితాన్ని నడిపించడానికి విశ్వాసాన్ని అందించింది. అంతేకాదు ఆమెను ఓ అంగన్‌వాడీ కార్యకర్తగా మలిచింది. మహారాష్ట్ర అంతటా రైతు ఆత్మహత్యల వల్ల ఒంటరిగా మిగిలిపోయిన అనేక మంది మహిళల్లో లత కూడా ఒకరు. 2022 నాటి ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం ఒక్క మహారాష్ట్రలోనే 2,708 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. దాంతో అప్పులు, పిల్లల సంరక్షణ, భూమిపై సరైన హక్కు లేని మహిళలు, కనబడకుండా పోయినా డాక్యుమెంట్లు, లింగ వివక్షతో ఆ ఒంటరి మహిళలు మౌనంగా పోరాడుతున్నారు.
డాక్యుమెంటేషన్ లేక…
జీవితాన్ని పునర్నిర్మించడానికి ఆ మహిళలకు అడ్డంకులు అనేకం. పెన్షన్ చెల్లింపులలో జాప్యం, గుర్తింపు, భూమి పత్రాలను పొందడంలో ఇబ్బంది, సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడం లాంటివి ఎన్నో ఉన్నాయి. 2018లో ఇండియాస్పెండ్ సర్వేలో వితంతువు మహిళల్లో కొంత మందికి మాత్రమే పెన్షన్ అందుతుందని, చాలా మందికి భూమి లేదా పరిహారం క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ లేదని తేలింది. ఉస్మానాబాద్‌కు చెందిన అనితా తారు వంటి మహిళలకు ఇవి రోజువారీ కష్టాలుగా మారుతాయి. ‘నిబంధనలు ప్రకారం నా పేరు భూమి పత్రాలపై లేదా కార్డులో ఉండాలి. నా దగ్గర రెండూ లేవు. నా భర్త తన జీవితాన్ని ముగించిన తర్వాత నాకు రేషన్ కూడా లేకుండా చేశారు’ అంటూ ఆమెతో పంచుకున్నారు.
పరిపాలనకు స్థలాలుగా…
అనిత కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి మహిళలు ఎందరో ఉన్నారు. పొలం పండించడానికి, పిల్లలను చూసుకోవడానికి, గ్రామ కార్యక్రమాల గురించి చర్చించడానికి ప్రయత్నిస్తున్న వితంతువులు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వితంతువు అనే చిన్నచూపు, ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో ఆర్థికంతో పాటు సామాజిక అసమానతలను సృష్టిస్తుంది. మహారాష్ట్ర అంతటా లత వంటి మహిళలు ఒకేసారి ఆచరణాత్మకమైన, రాజకీయమైన సమిష్టులను ఏర్పాటు చేసుకున్నారు. మరాఠ్వాడాలో ఏకల్ మహిళా సంఘటన్ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, తమ హక్కుల గురించి తెలుసుకోవడం, రేషన్ కార్డుల నుండి పెన్షన్ల వరకు తమ రోజువారీ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. దీని కోసం ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. ప్రస్తుతం వారి చిన్న చిన్న సమావేశాలు ముఖ్యమైన పరిపాలనకు స్థలాలుగా మారాయి. చాలా మంది మహిళలు కిచెన్ గార్డెన్స్ ప్రారంభించారు. అలాగే కొందరు పౌల్ట్రీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. సమూహ పొదుపు పథకాలలో పాల్గొంటున్నారు.
నాయకులుగా ఎదిగేందుకు
2014లో కలెక్టివ్స్ గ్రాస్‌రూట్స్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ పొందిన 27 మంది మహిళలలో చిత్ర తారు ఒకరు. ఆమె అంబజోగైలోని తన గ్రామానికి తిరిగి వచ్చి పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చెక్-డ్యామ్ నిర్మించడానికి 250-300 మంది మహిళలను సమీకరించారు. ‘మేమంతా కలిసి ఒక చెక్-డ్యామ్ నిర్మించాము. నేను చాలా మంది ఒంటరి మహిళలకు ‘ఉపాధి హామీ’లో ఉద్యోగాలు పొందడానికి సహాయం చేసాను. ఇది నేనే కాదు నాలాంటి మహిళలు ఎవరైనా గ్రామంలో నాయకురాలిగా ఎదగవచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది’ అంటూ ఆమె పంచుకున్నారు. అయితే ఇందులోని సభ్యులందరూ వితంతువులు కాదు. పేదరికంతో అల్లాడుతున్న మహిళలకు, గృహహింస వల్ల భర్తలను విడిచిపెట్టిన వారికి, భర్త ఆదరణకు దూరమైనవారికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం.
లోపాలను పరిష్కరించేందుకు
వీరి సమిష్టి కృషి సమాజంలో లోతైన మార్పును కూడా తీసుకొస్తుంది. ఒకప్పుడు మహిళలంటే ‘నిశ్శబ్దంగా ఉండాలి’ అని భావించిన వారు ఇప్పుడు గుంపులుగా తాలూకా కార్యాలయాలకు ప్రయాణిస్తారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం పదే పదే వెంటబడుతున్నారు. వారి సమిష్టి ఉనికి అధికారుల పనిలో జాప్యాలను గుర్తించి, లోపాలను పరిష్కరించే కృషి చేస్తోంది. ముంబైలో కేంద్రంగా పనిచేస్తున్న సీఓఆర్‌ఓ (కమ్యూనిటీ ఔట్రీచ్ అండ్ రిసోర్స్ ఆర్గనైజేషన్) మహారాష్ట్ర అంతటా చురుగ్గా పనిచేస్తోంది. మరాఠ్వాడాలో బీడ్, లాతూర్, ఉస్మానాబాద్, నాందేడ్ అంతటా ఉన్న సింగిల్ ఉమెన్ ప్రోగ్రామ్ ద్వారా వితంతువులు, వదలివేయబడిన, విడిపోయిన లేదా వివాహం కాని మహిళలకు సంఘటన్లు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తోంది.
ఒక చోట చేర్చి
‘మేము వితంతువులు, వదలివేయబడిన, ఒంటరి మహిళలతో కలిసి పనిచేస్తున్నాము. అనేక కారణాల వల్ల తమ భర్తలను విడిచిపెట్టిన మహిళ లను మేము చూశాము. వారిని అలా ఎందుకు వదిలివేయాలి అని మేము ఆలోచిం చాము? కాబట్టి మేము అన్ని నేపథ్యాల నుండి ఒంటరి మహిళలను ఒకచోట చేర్చాము’ అని సీఓఆర్‌ఓ ద్వారా శిక్షణ పొందిన నాయకుడు మహానంద అంటున్నారు. లింగ వివక్ష, విద్యపై పనిచేసే సంఘటన్ నిరంతార్. దీన్ని ఒక రకమైన ఉద్భవి స్తున్న నాయకత్వంగా అభివర్ణిస్తున్నారు. సమిష్టి నుండి ఒక మహిళ మాట్లాడుతూ ‘కుటుంబం అంటే ఏమిటి – మీరు జన్మించిన కుటుంబం లేదా మీరు నివసించే సమాజం? నేను వ్యక్తిగత జీవితం కోసం అధికారికంగా పోరాడుతు న్నప్పుడు నిమిషాల్లో పది లేదా పన్నెండు మంది మహిళలు నాకు చేయూతగా వస్తారు. సాధికారత అలాగే కనిపిస్తుంది’ అంటూ నమ్మకంగా చెబుతున్నారు.
ఒంటరి మహిళల నిశబ్ద విప్లవం
- Advertisement -
- Advertisement -



