Tuesday, October 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆల్మట్టి పాపం పాలకులందరిదీ!

ఆల్మట్టి పాపం పాలకులందరిదీ!

- Advertisement -

కర్నాటక ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఇటీవల వాదోపవాదాలు, తీవ్ర చర్చలకు దారితీసింది. డ్యామ్‌ ఎత్తు పెంచితే ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నా.. తెలంగాణకు మరింత నష్టం చేకూరే అవకాశాలున్నాయని సాగునీటి నిపుణులు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తలోమాట మాట్లాడుతున్నా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకోవడంలో వాళ్లు చేసిందేమీ లేదని కండ్లముందటి చరిత్ర నిరూపిస్తూనే ఉంది. ఆల్మట్టి డ్యాం చుట్టూ ఉన్న రాజకీయాల్ని మొదటి నుండి గమనిస్తున్న ప్రజా ప్రతినిధిగా ఈ పాపంలో ఈ రాష్ట్రాన్నీ ఏలిన పార్టీలదే అని చెప్పక తప్పదు.
కృష్ణా జలాలపై కర్నాటకకు 509 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. దానికనుగుణంగా అప్పర్‌ కృష్ణా నదిపై ఆల్మట్టి, నారాయ ణపూర్‌, హిప్పర్గి వియర్‌ ప్రాజెక్టులను చేపడుతూ వచ్చింది కర్నాటక ప్రభుత్వం. 509 మీటర్ల ఎత్తులో ఆల్మట్టి డ్యాంను నిర్మాణం చేపట్టారు. అంత వరకు బాగానే ఉంది. కానీ 1994లో కర్నాటకలో అధికారంలోకి వచ్చిన హెచ్‌డీ దేవగౌడ ప్రభుత్వం ఏడాది తిరక్కముందే ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 అడుగుల నుండి 524.526 అడుగులకు పెంచాలనీ నిర్ణయం తీసుకుంది. డ్యాం ఎత్తు పెంపు నిర్మాణం ఆ రాష్ట ప్రజలకు ఉపయోగకరం అయినప్పటికీ, ఎత్తు పెంచితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరుకు సైతం ఇబ్బందులు వస్తాయంటూ అనాడు సీపీఐ(ఎం) శాసనసభ సభ్యులుగా మేమంతా అసెంబ్లీలో ఆ అంశాన్ని లేవనెత్తాం.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపువల్ల కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా రాయలసీమ ప్రాంతం కూడా క్రమక్రమంగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిం చాం. హంద్రీ – నివాకు, తెలుగు గంగకు నీళ్లు రావనీ క్రమంగా నీటి సమస్య ఏర్పడుతుందనీ, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత ఇబ్బంది ఏర్పడుతుందనీ. అధిక వర్షాల సమస్యలో వరదనీరు వచ్చిన సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో ఆల్మట్టి వల్ల కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదనేది ఎప్పటి నుండో సీపీఐ(ఎం) చెబుతూ వస్తున్నది.
కృష్ణానదిపై కర్నాటక ప్రభుత్వం బాగల్కోట్‌ జిల్లా ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం (1995-96)లోనే ”ఆ ప్రాజెక్టుతో మనకు ప్రమాదం పొంచివుందని” సత్తెనపల్లి శాసనసభ్యురాలిగా నేను అసెంబ్లీలో లేవనెత్తితే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ”కమ్యూనిస్టులకు ముందే కలలు వస్తాయా?” అని అవహేళన చేశారు తప్ప ఆ సమస్య లోతును అర్థం చేసుకోలేకపోయారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు, దేవగౌడ పట్ల సాఫ్ట్‌ కార్నర్‌గా వ్యవహరించడంతో యదేచ్ఛగా ఎత్తును పెంచుకుంటూ పోయారు కర్నాటక అధికారులు. ఒకరకంగా 2002 నాటికే ఆ పనులు పూర్తయ్యాయని చెప్పవచ్చు.
‘మా పాలన, మా నీళ్లు, మా ఉద్యోగాలు’ అంటూ అస్తిత్వ ఉద్యమాన్ని లేవనెత్తిన తెలంగాణ ఉద్యమ నాయకులు అధికారంలోకి వచ్చాక ఆల్మట్టి విషయంలో చేసిందీ ఏమీ లేదనీ చెప్పకతప్పదు. ఆంధ్రా పాలకుల వల్ల ఈ ప్రాంతం ఎడారిగా మారిందనీ ఎద్దేవా చేసిన వాళ్లు అధికారంలోకి వచ్చాక గత పదేళ్ల కాలంలో చేసిందేమిటనేది ఆలోచించుకోవాలి. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) వేదికల మీద మాట్లాడుతూ కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచి కిందికి నీళ్లు రాకుండా చేస్తుంటే నల్లమల్ల పులిబిడ్డకి (రేవంత్‌ రెడ్డి) ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచడాన్ని అడ్డుకునే దమ్ము లేదా? గులాబీ దండు వెళ్లి అడ్డుకోవాలా? అంటూ సవాలు విసురుతున్నాడు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు అనేవి ప్రజల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి పనికొస్తాయికానీ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడానికి పనికిరావన్నది జగమెరిగిన సత్యం.
తెలంగాణ ఉద్యమంలో మన నీళ్లు మనకే అంటూ ఆశ చూపించిన తెలంగాణ ఉద్యమ నాయకులు ఈ పదేండ్ల కాలంలో ఏం చేశారనేది ఆలోచించుకోవాలి. ఇరిగేషన్‌ నిపుణులు, రైతు సంఘాలు వద్దని వారిస్తున్న వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టీ అదనంగా ఎకరం నీటిని అందివ్వకపోగా దక్షిణ తెలంగాణను అలాగే వదిలేశారు. ఆల్మట్టి గురించి మాట్లాడే బీఆర్‌ఎస్‌ పాలకులు తమ పదేండ్ల కాలంలో కృష్ణా నది మీద ఒక్క ప్రాజెక్టును కూడా కొత్తగా ఎందుకు చేపట్టలేదో, వలస పాలమూరును ఎందుకు సస్యశ్యామం చేయలేదు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
‘ఆల్మట్టిపై సుప్రీంకోర్టులో స్టే ఉంది, కొత్తగా మాట్లాడటానికి ఏమీ లేదని’ దాటవేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను సులభంగానే పరిష్కరించవచ్చు అనేది మర్చిపోతున్నారు. ఈ దేశంలో అనేకమంది నీటి పారుదల నిపుణులున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య మొదలూ అనేకమంది ప్రజానాయకులు సమగ్ర నీటి పంపిణీ పై ఇప్పటికే అనేక సూచనలు చేశారు. ఇప్పుడు కావాల్సిందంతా వాటిని అమలు చేసే చిత్త శుద్ధి మాత్రమే. అదే లోపించింది కాంగ్రెస్‌ నాయకులకు. తెలంగాణతో పాటూ పొరుగున ఉన్న కర్నాటకలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యను మరింత సులభంగా పరిష్కరించవచ్చు. కానీ పాలకులకు సమస్యల మీద లబ్ధి పొందడమే తప్ప పరిష్కరించాలనే చిత్తశుద్ధి లోపించింది అదే నేటి దౌర్భాగ్యం.
1969లో ఏర్పాటైన బచావత్‌ ట్రైబ్యునల్‌ కానీ, ఆ తర్వాత వచ్చిన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కానీ ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలో అనేది తేల్చిచెప్పినప్పటికీ పాలకుల అధిక దాహం ఈ సమస్యలన్నింటికీ కారణం. ప్రజా ఉద్యమాలే తప్ప వీటికి పరిష్కారం దొరకదు. అటువైపుగా ప్రజానీకం ఆలోచించాలి. లేదంటే ఏదో ఓనాడు పాలకులపై తిరగబడక తప్పదు.
పుతుంబాక భారతి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -