నవతెలంగాణ-కోహెడ
మండలంలోని కూరెళ్ళ, తంగళ్ళపల్లి గ్రామ శివారులలో శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఆదివారం జనసంద్రంగా మారింది. జాతరకు లక్షలాది భక్తులు హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు. శాకాహార వంటలతో జాతర ప్రాంగణం ఆహ్లాదకరంగా మారింది.
జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుంచి సింగరాయడు పేరు మీద ఈ జాతర కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సింగరాయుని జాతరపై అపారమైన విశ్వాసం ఉందని, భక్తులు మోయ తుమ్మెద వాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు.
సింగరాయుని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా చేరేలా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.



