12 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరు కోట్లకు పైగా తగ్గిన ఓటర్లు !
న్యూఢిల్లీ : ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శుక్రవారంతో పూర్తికావడంతో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 6.08కోట్ల వరకు పేర్లు తొలగించబడ్డాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికొబార్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాల్లో తుది ఓటర్ల జాబితాలను ప్రచురించారు. గత కొద్ది నెలలుగా ఈ రాష్ట్రాల చీఫ్ ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషన్ పంచుకున్న డేటా ప్రకారం, గతేడాది అక్టోబరు 27న సర్ ప్రక్రియను ప్రారంభించినపుడు ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా ఓటర్లు 51 కోట్ల మంది ఓటర్లు వున్నారు. సర్ ముగిసిన తర్వాత, మొత్తంగా ఓటర్ల జాబితా దాదాపుగా 44.92కోట్లుగా వుంది. అంటే దాదాపుగా 6.08 కోట్ల మంది తగ్గారు. ఈ నెల్లో మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ఇక మిగిలిన 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రారంభం కానుంది. అక్కడ దాదాపుగా 40 కోట్ల మంది ఓటర్లు వుండనున్నారు.



