Wednesday, April 8, 2026
E-PAPER
Homeజాతీయంపశ్చిమబెంగాల్‌లో సర్‌ ఎఫెక్ట్‌

పశ్చిమబెంగాల్‌లో సర్‌ ఎఫెక్ట్‌

- Advertisement -

ఓటర్ల జాబితా నుంచి 91 లక్షల పేర్లు తొలగించిన ఈసీ
మొదటిదశలో 152 స్థానాలకు 23న పోలింగ్‌
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం (సీఈసీ) ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక విస్తృత ఓటర్ల సవరణ (సర్‌) ప్రక్రియ తర్వాత, ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఈ జాబితా సవరణ ప్రక్రియ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 28న విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, గతేడాది నవంబర్‌లో సర్‌ ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుంచి 63.66 లక్షల పేర్లు (అంటే మొత్తం ఓటర్లలో సుమారు 8.3 శాతం) తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య సుమారు 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు పైగా తగ్గిపోయింది. 7.04 కోట్ల ఓటర్లలో, ‘పరిశీలనలో ఉన్న’ (అండర్‌ అడ్జుడికేషన్‌) కేటగిరీలో 60.06 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. న్యాయాధికారుల పరిశీలనలో ఈ 60.06 లక్షల ‘పరిశీలనలో ఉన్న’ ఓటర్లలో 27.16 లక్షలకు పైగా పేర్లను తొలగించినట్టు ఈసీ డేటా తెలిపింది. ‘పరిశీలనలో ఉన్న’ కేటగిరీ లోని వారిలో 32.68 లక్షల మంది పైగా తుది జాబితాలో చేర్చారు. ఈసీ డేటా ప్రకారం, సర్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తుది తొలగిం పులు సుమారు 90.83 లక్షలుగా ఉన్నాయి.

మొదటిదశలో 152 స్థానాలకు పోలింగ్‌
”ఓటర్ల సవరణ ప్రక్రియను దశలవారీగా, పారదర్శకంగా చేపట్టాం. నిజ నిర్దారణకు జిల్లా వారీ డేటాను ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాం” అని ఒక ఈసీ సీనియర్‌ అధికారి తెలిపారు. పరిశీలనలో ఉన్న 60.06 లక్షల ఓటర్లలో, 59.84 లక్షల మందికి సంబంధించిన డేటాను ప్రచురించామని, మిగిలిన 22,163 కేసులను పరిష్కరించినప్పటికీ వాటిపై ఇంకా ఈ-సంతకాలు పూర్తికాలేదని ఆయన చెప్పారు. ఈ-సంతకాలతో సహా మిగిలి ఉన్న విధానపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత, తొలగింపు, చేర్పుల సంఖ్యల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని ఆ అధికారి తెలిపారు. 294 స్థానాలకు గాను మొదటిదశలో 152 స్థానాలకు ఈ నెల 23న, రెండవ దశలో మిగిలిన 142 స్థానాలకు 29న పోలింగ్‌ నిర్వహించనున్నారు. రెండవ దశకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఈ నెల 9న నిలిపివేయనున్నారు. ఈ దశలో ఓటర్ల జాబితాలో ఇకపై ఎలాంటి చేర్పులు ఉండవని, మొదటి దశ నామినేషన్ల చివరి తేదీ ముగిసినందున, చట్టప్రకారం ఈ జాబితా నిలిపివేయనున్నామని ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ గెలవటానికే సీఈసీ సుమారు కోటి మంది ఓటర్లను తీసివేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -