Sunday, February 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసిట్‌కు నోటీసులిచ్చే అధికారమే లేదు

సిట్‌కు నోటీసులిచ్చే అధికారమే లేదు

- Advertisement -

నా రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు
నోటీసులు గోడలకు అంటించడం చట్టవిరుద్ధం
ఎర్రవల్లి ఫాంహౌజ్‌లోనే విచారణ జరపాలి
అయినా నేడు 3 గంటలకు నందినగర్‌లో అందుబాటులో ఉంటా
బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తా : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) అధికారుల నోటీసులపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) స్పందించారు. సిట్‌ అధికారులకు నోటీసులిచ్చే అధికారమే లేదనీ, అది తన రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని తెలిపారు. వారు వ్యవహరించిన తీరు చట్టాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ను సిట్‌ అధికారులు తుంగలో తొక్కారని అన్నారు. సిట్‌ అధికారుల నోటీసుకు కేసీఆర్‌ శనివారం బదులిచ్చారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీకి లేఖ రాశారు. ఈ మేరకు కేసీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. సిట్‌ అధికారులు రెండు సార్లు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధమనీ, చట్టాలను అతిక్రమించి ఇచ్చారని తెలిపారు. మొదటి నోటీసుకు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే రోజు విచారణ తేదీ ఇవ్వాలన్నానని గుర్తు చేశారు. 65 ఏండ్లుపైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ నిబంధనలను ప్రస్తావించానని తెలిపారు.

తదుపరి నోటీసులన్నీ ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలంటూ కోరానని పేర్కొన్నారు. ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు ఏసీపీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి తొమ్మిది గంటలకు నందినగర్‌ నివాసంలోని తమ ఇంటి గోడకు అతికించినట్టు తెలుస్తోందని తెలిపారు. ఆ లేఖ ఏసీపీ పంపినట్లయితే, వారి సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నానని పేర్కొన్నారు. ఇది భారత రాజ్యాంగం, చట్టం, సుప్రీంకోర్టుల పట్ల ఏమాత్రం గౌరవం లేదనే విషయాన్ని సూచిస్తుందని వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్‌ యాంటిల్‌ వర్సెస్‌ సీబీఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని గుర్తు చేశారు. వాట్సాప్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదనీ, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొందని తెలిపారు. సీఆర్‌పీసీ 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని కోరారు. కానీ కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏసీపీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వివరించారు.

ఎర్రవల్లికే నోటీసులు పంపాలని చెప్పినా.. విస్మరించిన అధికారులు
భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలంటూ చెప్పినప్పటికీ ఏసీపీ అధికారులు దాన్ని విస్మరించారని కేసీఆర్‌ తెలిపారు. రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదనీ, అది చెల్లబోదని స్పష్టం చేశారు. తాను ఏసీపీ పరిధి పోలీస్‌ స్టేషన్‌కుగానీ, పొరుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగానీ నివసించడం లేదని తెలిపారు. నోటీసు ఇచ్చే అధికారం, కట్టడి చేసే అధికారం లేదని వివరించారు. ఎన్నికల అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్‌ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు.

నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారన్నదే ముఖ్యమని వివరించారు. తాను కొన్నేండ్లుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నానని తెలిపారు. హరీశ్‌రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారని పేర్కొ న్నారు. ఇది సిట్‌ అధికారుల ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నదని విమర్శిం చారు. తనకు ఇచ్చిన నోటీసు గోడకు అతికించడం చట్టవిరుద్ధమని తెలిపారు. చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నా మాజీ సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని స్పష్టం చేశారు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని పట్టుబట్టినందున ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి నందినగర్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -