Monday, April 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపరిస్థితి మరింత దిగజారుతుంది

పరిస్థితి మరింత దిగజారుతుంది

- Advertisement -

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ బ్యాంకు హెచ్చరిక
జెనీవా
: అమెరికా, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాక్‌ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావటం.. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్‌ ధర మంట పుట్టిస్తోంది. చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు (100 డాలర్లకు పైనే) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కూడా తీవ్రంగా పడిపోయాయి. భారతదేశంతో సహా అనేక దేశాల దిగుమతులు, ఎగుమతులు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.
పరిస్థితులు ఇంకా స్పష్టంగా లేనప్పటికీ, పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అధిపతి అజరు బంగా హెచ్చరించారు. ఈ నష్టం చాలాకాలం పాటు కొనసాగవచ్చని, తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కూడా ఆర్థిక వ్యవస్థల్లో విస్తృత మాంద్యాన్ని నిరోధించలేదని ఆయన అన్నారు. కాల్పుల విరమణ కొనసాగినా ప్రపంచ వృద్ధి 0.3 నుంచి 0.4 శాతం పాయింట్ల వరకు క్షీణించవచ్చని ఆందో ళన వ్యక్తం చేశారు. ఒకవేళ కాల్పుల విరమణ మళ్లీ విఫలమైతే, ఈ క్షీణత 1 శాతం పాయింట్‌ వరకు పెరగవచ్చని, దీనివల్ల వాణిజ్యం, ఇంధన మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉందని అజరు బంగా తెలిపారు. కాల్పుల విరమణ జరిగితే ప్రపంచ ద్రవ్యోల్బణం 200 నుంచి 300 బేసిస్‌ పాయింట్ల వరకు పెరగవచ్చని, సంఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగితే మరో 0.9 శాతం పాయింట్లు పెరగవచ్చని బంగా సూచించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోందని, అక్కడ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరుకోవచ్చని వెల్లడించారు.

ప్రమాదంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు
సంక్షోభ సహాయం ద్వారా అత్యవసర నిధులను అందించడానికి, ఇంధన దిగుమతులపై ఆధారపడిన ద్వీప దేశాలతో సహా, బలహీన దేశాలతో ప్రపంచ బ్యాంకు చర్చలు ప్రారంభించిందన్నారు. అయితే, భవిష్యత్‌లో ఆర్థిక అస్థిరతకు దారితీసే నిలకడలేని ఇంధన సబ్సిడీల్లో ప్రభుత్వాలు చిక్కుకోకూడదని బంగా స్పష్టంగా హెచ్చరించారు. దీనికి విరుద్ధంగా, తమ ఇంధన వనరులను వైవిధ్యపరచడంలో విఫలమయ్యే దేశాలు దీర్ఘకాలిక ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన వాదిస్తున్నారు. అందుకు నైజీరియాను బంగా ఉదహరించారు. ‘అక్కడ 20 బిలియన్‌ డాలర్ల రిఫైనరీ ప్రాజెక్ట్‌ దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, పొరుగు దేశాలకు జెట్‌ ఇంధనం వంటి ఎగుమతులను కూడా సాధ్యం చేసింది. అణు, జల, భూఉష్ణ, పవన, సౌర వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంలోనే దీర్ఘకాలిక పరిష్కారం ఉంద’ని బంగా నొక్కి చెప్పారు. ఈ మార్పు జరగకపోతే, దేశాలు సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు తిరిగి వెళ్ళి, ఆర్థిక, పర్యావరణపరమైన నష్టాలను పెంచుకోవచ్చని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -