ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
లిస్టులో నుంచి ఓటర్ల పేర్ల తొలగింపు అందులో భాగమే..!
అమెరికా సామ్రాజ్యవాదానికి కాలం చెల్లింది
అనేక విషయాల్లో జియావుద్దీన్ స్ఫూర్తిదాయకం
జియా సర్ సంస్మరణ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగులేటి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కమ్యూనిస్టు ఉద్యమానికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు రావొచ్చని, ఓట్లు, సీట్లు కనపడకపోవచ్చని.. కానీ ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ సమగ్ర పరిష్కారం చూపించగలిగేది కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీన్ని అందరూ గుర్తించక తప్పదన్నారు. అనేక పార్టీలు, ఉద్యమాలను చూస్తున్నామని, తాత్కాలికంగా కొన్ని మంచి పనులు చేయొచ్చన్నారు. అన్ని సమస్య లకు శాశ్వతంగా పరిష్కారం చూపించే సిద్ధాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని, అది ఒక కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందని స్పష్టంచేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో జియావుద్దీన్ సర్ ఓ స్ఫూర్తి దాయక వ్యక్తి అని కొనియాడారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సుబ్లేడులో పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అధ్యక్షతన గురువారం జరిగిన కామ్రేడ్ జియావుద్దీన్ సంస్మరణ సభలో తమ్మినేని ప్రసంగించారు. ప్రస్తుత అననుకూల పరిస్థితుల్లో దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నా యని వివరించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా.. వివిధ దేశాల పట్ల అనుసరిస్తున్న వైఖరి, సుంకాలు ఆ దేశాలు ఎదురు తిరుగుతున్న తీరుచూస్తే సామ్రాజ్యవాదానికి నూకలు చెల్లిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. సామ్రాజ్యవాదం, అమెరికా పెత్తనం బలహీనపడుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఆలోచించటం మొదలు పెట్టాయని, అలాంటి మంచి పరిణామాలే దేశంలోనూ రాబోతున్నాయని తెలిపారు.
ఇప్పటి వరకు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేక పోయిందని తమ్మినేని అన్నారు. నిరుద్యోగం, నల్లడబ్బులు, రైతాంగానికి ఆదాయాలు రెట్టింపు చేస్తానన్న మాట కానీ, 2022 కల్లా దేశంలో ఇండ్లు లేని పేదవాళ్లు లేకుండా చేస్తామన్న హామీ కానీ, ఏ ఒక్కమాట కూడా అమలు చేయలేదన్నారు. ఏ మాటలను నిలుపుకో లేకపోయింది కాబట్టే బీజేపీ ఓ మార్గం ఎంచుకుంటోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం, హిందూముస్లింల మధ్య గొడవలు పెట్టడం, ప్రతి సమస్యనూ మత రాజకీయం చేయటం, ఇప్పుడూ ఏకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఓటర్ లిస్టు నుంచి పేర్లు తొంలగించటం వంటి అప్రజాస్వామిక పద్ధతులకు బీజేపీ పూనుకుంటోందన్నారు. అందుకే అటువంటి బీజేపీని గద్దెదించేందుకు జరుగుతున్న ఓ మహాపోరాటంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు. కమ్యూనిస్టులు అందరూ ఐక్యమై, నిర్ధిష్టమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆ విధమైన స్ఫూర్తితో వ్యవహరించిన జియా సర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటం మనందరి కర్తవ్యమని పిలుపునిచ్చారు. తన సతీమణితో మాట్లాడినప్పుడు తనను బాగా చూసుకునేవారని చెప్పారని తెలిపారు. కమ్యూనిస్టులు సమాజంతో పాటు కుటుంబాన్ని బాగా చూసుకోవాలని సూచించారు. అందులోనూ జియావుద్దీన్ సర్ ఆదర్శంగా ఉన్నారని చెప్పారు.
మంచితనానికి మారుపేరు జియా సర్: పోతినేని
మంచితనానికి మారుపేరుగా జియావుద్దీన్ సర్ ఉండేవారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. అందరితో సహృదయంతో వ్యవహరించేవారన్నారు. తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా ఖండించేవారని తెలిపారు. జీవితాంతం ఎర్రజెండా సిద్ధాంతాన్ని నమ్మి, ముందుకు తీసుకుపోయిన నాయకుల్లో జియావుద్దీన్ సర్ ఒకరని అన్నారు. తండ్రి బాటలోనే పయనిస్తానని జావీద్ చెప్పటం అభినందనీయమన్నారు. తన తండ్రిని ఉద్దేశించి కుమారుడు, నవతెలంగాణ ఖమ్మం రీజినల్ మేనేజర్ జావీద్ మాట్లాడుతూ.. కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి బాటలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ సభలో పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్, బషీరుద్దీన్, మహబూబాబాద్ జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ మౌనిక, మండల నాయకులు అంగిరేకుల నర్సయ్య, రావుల వెంకటరాంరెడ్డి, ముత్తయ్య, కొమ్ము నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీను, చావా శివరామకృష్ణ, మంగీలాల్, కొప్పుల అశోక్, ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకులు చింతిరాల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి నివాళి
జియావుద్దీన్ సర్ సంస్మరణ సభకు హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయునిగా విద్యార్థులకు మంచి విద్య, నాణ్యమైన భోజనం అందించేలా జియావుద్దీన్ సర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రజా ఉద్యమకారుడిగా, ప్రజా ప్రతినిధిగా ఆయన అందించిన సేవలు గుర్తించుకోదగినవని తెలిపారు.
ధన్యజీవి జియా సర్ : అలుగుబెల్లి
జియా సర్ ధన్యజీవని, ఇంటాబయట గెలిచి అందరి ఆదరా భిమానాలు చూరగొన్నారని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. సర్‌కు నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యు లను కలిసి ఓదార్చారు. జియా సర్ అంకితభావాన్ని కొనియాడారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో బాధను పంచుకున్నారు. ప్రజా ఉద్యమాల్లో ఉన్నా ఏ ఒక్కరోజూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదని జియా సర్ సతీమణి ముస్తారీబేగం, కుమారుడు జావీద్‌తో పాటు కూతుళ్లు ముస్రత్ ఆరా, ఇస్రత్ ఆరా తండ్రి గురించి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. అలుగుబెల్లి వెంట టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, టీఎస్ యూటీఎఫ్ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి నాగమల్లేశ్వరరావు ఉన్నారు.