Sunday, October 19, 2025
E-PAPER
Homeసోపతివయసు వీథిలో సాగే వలపు బండి పాట

వయసు వీథిలో సాగే వలపు బండి పాట

- Advertisement -

అమ్మాయిలను చూసి అబ్బాయిలు మురిసిపోతూ, వెంటపడుతూ పాటలు పాడడం చూస్తూ ఉంటాం. అలాంటి పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. అయితే.. ఈ పాట మాత్రం అలాంటి పాట కాదు. అబ్బాయిని చూస్తూ, మైమరచిపోతూ అమ్మాయి పాడే పాట ఇది. అయితే అతడి వెంటే తిరుగుతూ, అతడి ప్రతి కదలికను గమనిస్తూ, పులకిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మనసులోని ప్రేమ పులకింతల్ని పాటగా అల్లాడు మిట్టపల్లి సురేందర్‌. 2019 లో బి.జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘జార్జిరెడ్డి’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.

మిట్టపల్లి సురేందర్‌ పల్లెదనం పరిమళించే పాటలైనా, పడుచుదనం పరవళ్ళు తొక్కే పాటలైనా.. ఎలాంటి పాటలైనా అద్భుతంగా రాయగలడు. ఈ పాటను కూడా పరమాద్భుతంగా రాశాడు. యూత్‌ కి బాగా కనెక్ట్‌ అయింది ఈ పాట.
సినిమాకథ పరంగా చూస్తే.. హీరో యువనాయకుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడైన జార్జిరెడ్డి. విశ్వవిద్యాలయంలో హీరోని చూసి ఇష్టపడుతోంది ఓ అమ్మాయి. తొలిచూపులోనే అతనికి తన మనసునిచ్చేస్తుంది. అతనితో స్నేహం చేస్తుంది. కాని అతన్ని ప్రేమిస్తున్న విషయం చివరిదాకా చెప్పదు. అతడి నాయకత్వ లక్షణాలను చూసి, అతడి మాటల్లో ఉండే పదునును చూసి, అతడి నడకల్లో ఉండే రాజసాన్ని చూసి, అతడి స్టైల్‌ని చూసి, నిండైన అతని మనసుని చూసి తన మనసు పారేసుకుంటుంది. అతడు ఎక్కి తిరిగే బండిని కూడా చూసి మురిసిపోతుంటుంది. హీరో ప్రతీ కదలికను జాగ్రత్తగా గమనిస్తూ అతని వెంటే తిరుగుతుంటుంది. నాయకుడిగా చాలా బిజీగా ఉండే హీరో ఆ అమ్మాయిని అంత ఎక్కువగా పట్టించుకోడు. ఆమె మాత్రం అతన్నే ప్రాణప్రదంగా ప్రేమిస్తుంటుంది. ఇదీ సందర్భం.
హీరో నడిపే రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ బండిని చూసి మురిసిపోతుంది. వీరుడైన చెగువేరాకున్న చురుకుదనాన్ని హీరో చూపుల్లో చూసి మరింత ఇష్టాన్ని పెంచుకుంటుంది. అతడు బండి మీద వస్తుంటే చాలు వీథంతా ఇంజన్‌ సౌండే.. అంటే.. హీరో వస్తుంటే అంతా ఒక సంచలనమే అని చెప్పకనే చెబుతున్నట్లుగా తోస్తుంది. ఆ బండి చేసే ఇంజన్‌ శబ్దంతో గుండెల్లో మొత్తం చెడుగుడు బ్యాండ్‌ మోగిపోతుందని చెబుతోంది ఆమె. ఇలా అతడి రాజసాన్ని చూసి, నిజాయితీని చూసి నాకు తెలియకుండానే నేను అతడికి గర్ల్‌ ఫ్రెండ్‌ ని అయిపోయాను.. అని అంటోంది.
హీరో ఒంటికి పూసుకున్న అత్తరు వాసన వస్తే చాలు ఆ అమ్మాయి ఊపిరి మొత్తం మెలిపెట్టి లాగేసినట్టుగా అవుతుందట.. అది అత్తరు వాసన మహిమ కాదు.. అతని మహిమ అని అర్థం చేసుకోవాలిక్కడ. అత్తరు ఎంత సువాసనగా ఉన్నా అతని ఒంటిని తాకిన తర్వాతే ఆ అమ్మాయికి మరింతగా సువాసనగా తోస్తున్నదని గ్రహించాలి. అతడు కాలేజీ క్యాంటిన్‌లో కూర్చునే చోటుని తలచుకోగానే నిద్రలో ఉన్నప్పటికీ కూడా తెల్లవారిందేమో, సూర్యకాంతి వచ్చిందేమో అని అనిపిస్తుందట. అంటే..అతని రాక ఉదయపు వెలుగుల్ని తలపిస్తుందని స్పష్టం చేస్తోంది. లేదా.. హీరో చాలా నియమానుసారంగా మసలుకునే విద్యార్థి నాయకుడు. అతడు సరైన సమయపాలనతో నడుచుకుంటాడు. అతడు క్యాంటిన్‌లో ప్రతీరోజు సరైన సమయానికి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి అతడు వచ్చాకే సూర్యుడు వస్తాడని అన్నదేమో. అతని రాకతో ఆమెకు ఉదయమవుతుంది. నిద్ర నుంచి మేలుకుంటుంది. అని గ్రహించుకోవచ్చు.
అడవిని తలపించే అంత ఒత్తుగా, చిక్కగా ఉంటుందట అతని తలపై జుట్టు..అందుకే క్రాఫు చాలా నీటిగా ఉంటుందన్న విషయాన్ని కూడా చెబుతోంది. అసలు ఈ ప్రపంచంలోనే అతనికి ఉన్న బాడీ మ్యాపు.. (శరీర చిత్రం) ఇంకెవరికి లేదని అంటుంది. అంటే.. హీరో భుజబలమున్నవాడు. బాక్సింగ్‌ చేస్తుంటాడు. ఆ విషయాన్నే ఇక్కడ చెబుతోంది. తనతో పాటు నన్ను కూడా ఎగరేసుకుపోయాడు. నేను ఇక్కడే వున్నట్టు కనబడుతున్నా నా మనసు మాత్రం అతనితోనే ఉంది. అతని వెంటే తిరుగుతోంది. అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతోంది. అని చెబుతోంది.
హీరో వేగంగా బండి మీద దూసుకువచ్చి తన ముందు నుంచి అలా వెళిపోతుంటే ఆ బండి వెనకే ఆమె మనసు పరుగులు పెడుతుందట. ఆమె మనసు, వయసు రెండూ నిలకడగా లేవన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. అతడు బండి మీద ఒక్కడే వెళుతుంటే అతని వెనుక ఉన్న ఖాళీ సీటు నన్ను వేధిస్తోంది. ఆ సీటు నా కోసమేనా అని అనిపిస్తోంది. అవకాశముంటే నేను వెనక కూర్చునేదాన్ని కదా..అని అనుకుంటుంది. అందరికి దారులు చూపించే వాడి చూపుడి వేలుని చుట్టుకోవాలనిపిస్తుంది..అని అనుకుంటోంది. అంటే అతని వేలుపట్టుకుని, ఏడడుగులు వేసి అతని భార్య అయిపోవాలనుకుంటుంది. తన నూరేళ్ళ జీవితాన్ని అతనికి కానుకగా అర్పించుకోవాలనుకుంటుంది.
ఇలా..హీరోని దూరం నుంచే చూస్తూ మురిసిపోవడమే కాని హీరోతో నేరుగా తన ప్రేమ విషయం చెప్పదు ఆమె. హీరోలో ఉన్న నాయకత్వ లక్షణాలు, రాజసం.. చూసి ఆమె భయపడి చెప్పలేకపోయిందేమోనని భావించవచ్చు. దూరంగానే ఉన్నా ఆమె ప్రేమలోని నిర్మలత్వాన్ని, గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ప్రేమికులందరికి మిట్టపల్లి సురేందర్‌ ఈ పాటను కానుకగా ఇచ్చాడా అనిపిస్తుంటుంది. అంతలా ప్రేమికులందరినీ ఆకట్టుకుందీపాట. ఈ పాటలో అద్భుతమైన తెలుగు పదాలతో పాటు ‘రాయల్‌ ఎన్‌ ఫీల్డు’, ‘ట్రెండు’, ‘గళ్‌ ఫ్రెండు’, ‘కాలేజీ క్యాంటిన్‌’, ‘బాడీ మ్యాపు’, ‘క్రాఫు’..వంటి ఇంగ్లీష్‌ పదాలు కూడా జత కలిశాయి..పదికాలాలు నిలిచిపోయే ప్రేమపాటను అందించిన మిట్టపల్లి సురేందర్‌ ప్రశంసనీయుడు.

పాట:
వాడు నడిపే బండీ రాయల్‌ ఎన్‌ ఫీల్డు/వాడి చూపుల్లో ఉంది చెగువేర ట్రెండు/వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు/మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు/చెప్పకుండానే అయిపోయా నే గాళ్‌ ప్రెండు/ ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే/నేను ఎక్కడఉన్నా వాడి అత్తరుఘాటు/నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే/వాడు కాలేజి క్యాంటిన్‌ లో కూర్చునే చోటు/అడవిని తలపించే వాడి తలపై క్రాఫు ఏ దునియాలో దొరకదె ఆ బాడీ మ్యాపు/నన్నెగరేసుకు పోయాడే వాడితొపాటు వాడు నడిపే బండీ రాయల్‌ ఎన్‌ ఫీల్డు/వాడి చూపుల్లోఉంది చెగువేర ట్రెండు/వేగంగా నావైపే దూసుకువచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసూ/ఒంటరిగా ఒక్కడలా తిరుగుతుఉంటే/నన్ను వేధించే వాడివెనుక ఖాళీ సీటు/దారులు చూపించు వాడి చూపుడువేలు/చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెనవేలు/ఏడడుగులేసి ఇచ్చుకుంట నావందేళ్ళు..

డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -